ఆదివారం 07 మార్చి 2021
Siddipet - Dec 13, 2020 , 03:18:03

వైశ్య సంక్షేమ సదన్‌ రాష్ర్టానికే ఆదర్శంగా నిలువాలి

వైశ్య సంక్షేమ సదన్‌ రాష్ర్టానికే ఆదర్శంగా నిలువాలి

సిద్దిపేట కలెక్టరేట్‌ : జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని వైశ్య సంక్షేమ సదన్‌ భవన్‌ రాష్ర్టానికే ఆదర్శంగా నిలువాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట వైశ్య సదన్‌ భవన్‌లో బంకెట్‌హాల్‌ను ఎమ్మెల్సీలు ఫారూఖ్‌హుస్సేన్‌, రఘోత్తంరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. వైశ్యసంక్షేమ భవన్‌కు ప్రభుత్వం నుంచి రూ.2.60 కోట్ల నిధులు రావడం గొప్ప విషయమన్నారు. శనిగలపై ఒకశాతం సెస్‌ను మార్కెటింగ్‌ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే తొలిగించాం. అదేవిధంగా బియ్యం, వడ్లపై మార్కెటింగ్‌ సెస్‌ తొలిగించాం. దీంతో ప్రభుత్వానికి 35శాతం తగ్గిందన్నారు. పత్తి జిన్నింగ్‌ మిల్లుల్లో పత్తి గింజలపై ఒకశాతం సెస్‌ను తొలిగించామన్నారు. వైశ్యసంక్షేమ సదన్‌ భవన్‌ను రెండు మూడు నెలల్లో అన్ని హంగులతో తీర్చిదిద్దుతామన్నారు. వైశ్యసంఘం ప్రతినిధి అంజయ్య మన మధ్య లేడని, ఆయన వైశ్య సంక్షేమానికి ఎంతగానో సేవ చేశారన్నారు. అంజయ్య విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ప్రెస్‌ అకాడమీ సభ్యులు కొమురవెల్లి అంజయ్య, వైశ్య సంఘం ప్రతినిధులు అశోక్‌, గంప రామచందర్‌రావు, అయిత రత్నాకర్‌, అనిల్‌ శ్రీను, గంప శ్రీనివాస్‌, కొర్తివాడ రాజేందర్‌, పుల్లూరు శివతో పలువురు పాల్గొన్నారు.

 

సీసీరోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన.. 

సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.10లక్షలతో నిర్మించే సీసీరోడ్లకు మంత్రి హరీశ్‌రావు శనివారం శంకుస్థాపన చేశారు. ఆయన వెంట మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, కౌన్సిలర్‌ కెమ్మసారం ప్రవీణ్‌, మున్సిపల్‌ ఈఈ వీరప్రతాప్‌ పలువురు పాల్గొన్నారు.  

కరోనాతో అన్ని రంగాలు కుదేలు..

కరోనా ప్రభావంతో ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు, ఇండస్ట్రీలు, అనేక సంస్థల యాజమాన్యాలు ఆర్థికంగా నష్టపోవడంతో ఆయా రంగాల్లో పనిచేసే వారి కుటుంబాల పరిస్థితి చిన్నాభిన్నమైనాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని చంద్రమౌళి గార్డెన్స్‌లో శ్రీసాయి అన్నపూర్ణ ట్రస్టు, సద్గురు శ్రీమధుసూదన్‌ సాయి దివ్యానుగ్రహ ఆశీస్సులతో సిద్దిపేట పట్టణంలో ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న వెయ్యి మంది టీచర్లకు కిరాణ సామగ్రి, నిత్యావసర సరుకులతో పాటు మంత్రి హరీశ్‌రావు తన సొంత డబ్బులతో ఒక్కొక్కరికీ రూ.3 వేల విలువైన హెల్త్‌ కిట్స్‌ను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ఉచిత అల్పాహార సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తుందన్నారు. స్వచ్ఛ సిద్దిపేట ఆరోగ్య సిద్దిపేటగా మార్చేందుకు ప్రైవేట్‌ టీచర్స్‌, లెక్చరర్స్‌ సహకారం అందించాలన్నారు. కరోనా ఎఫెక్ట్‌తో అనేక రంగాలు ప్రపంచ వ్యాప్తంగా కుదించుకపోయాయన్నారు. సిద్దిపేటను ఆరోగ్య, ఆకుపచ్చ సిద్దిపేటగా తయారు చేయాలన్నదే తన కోరిక అన్నారు. మీ అందరి అభివృద్ధిలోనే సిద్దిపేట అభివృద్ధి ఉందని, సీఎం కేసీఆర్‌ సిద్దిపేటకు వెయ్యి పడకల దవాఖానను మంజూరు చేశారన్నారు. సిద్దిపేట అర్బన్‌లో 200 ఎకరాల్లో ఆక్సిజన్‌ పార్కు అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో రూ.40 లక్షలతో ఎఫ్‌ఏఐ రఘు అల్పాహార వాహనం అందించడం సంతోషకరమని, మరో 4 వాహనాలు అందించాలని రఘును మంత్రి హరీశ్‌రావు కోరగా అందుకు రఘు అంగీకరించారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రమాదం ఉందని, అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయనతో ఆయా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 

ఎలక్ట్రిక్‌ వాహనాలదే భవిష్యత్‌..

గజ్వేల్‌ : వచ్చేకాలం ఎలక్ట్రిక్‌ వాహనాలపై అధారపడటం తప్పదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌లో శనివారం ఓ ప్రైవేట్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకం ‘షోరూం’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాలుష్య నివారణకు ఎలక్ట్రిక్‌ వాహనాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పర్యావరణ పరిరక్షణకు వీటి వినియోగం తప్పనిసరి అవుతుందన్నారు. బ్యాటరీ ఆధారంగా నడిచే వాహనాల వల్ల వాయు, శబ్ధకాలుష్యం కాదని అందుకు ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకం రోజురోజుకూ పెరుగుతుందన్నారు. వాహన కొనుగోలు దారులు భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త వాహనాలను కొనుగోలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సినీ యాక్టర్‌ సంపూర్ణేష్‌బాబు, ఎప్డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్సీరాజమౌలి, ఏఎంసీ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ శ్రీనివాస్‌, లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీలు మల్లేశం, యాదవ్‌, అర్జున్‌గౌడ్‌, జకియొద్దీన్‌, నర్సింగరావు పాల్గొన్నారు. 

VIDEOS

logo