గురువారం 25 ఫిబ్రవరి 2021
Siddipet - Dec 10, 2020 , 00:13:44

ముమ్మరంగా రెండో రీచ్‌ పనులు

ముమ్మరంగా రెండో రీచ్‌ పనులు

  • గజ్వేల్‌ టూ దుద్దెడ  
  • త్వరలోనే గజ్వేల్‌కు రైలు
  • ఫలించిన సీఎం కేసీఆర్‌ కృషి  

గజ్వేల్‌ రూరల్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గజ్వేల్‌, సిద్దిపేట, సిరిసిల్ల మీదుగా కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి వరకు రైలు మార్గం తీసుకొచ్చేందుకు విశేషంగా కృషి చేసింది. మొదటి దశలో మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ నుంచి గజ్వేల్‌ వరకు రైల్వే లైన్‌ పనులను చేపట్టి పూర్తి చేసింది. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ నుంచి ఈ కొత్త మార్గం ప్రారంభంకానున్నది. రైలు మార్గం నిర్మాణానికి 2017 మార్చి 14న గజ్వేల్‌ మండలం గిరిపల్లి సమీపంలో పనులను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. మూడేండ్ల కాలంలోనే గజ్వేల్‌ వరకు పూర్తయ్యాయి.  గజ్వేల్‌ నుంచి దుద్దెడ వరకు రెండో రీచ్‌ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అక్టోబర్‌లో నెల రోజుల పాటు వర్షాలు కారణంగా పనుల్లో కొద్దిగా జాప్యం ఏర్పడింది. అనంతరం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ట్రాక్‌, వంతెనల పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. 

నాలుగు దశల్లో పనులు..

మనోహరాబాద్‌ నుంచి కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి వరకు 151 కిలో మీటర్ల వరకు రూ.1160.47 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న  రైల్వే ప్రాజెక్టును నాలుగు దశలుగా నిర్మిస్తున్నారు. మొదటి దశలో మనోహరాబాద్‌ నుంచి గజ్వేల్‌ వరకు 31 కిలోమీటర్ల మేర  ట్రాక్‌తో పాటు వర్గల్‌ మండలం నాచారం, దౌల్తాబాద్‌ మండలం అప్పాయిపల్లి, గజ్వేల్‌ పట్టణంలో మూడు చోట్ల రైల్వే స్టేషన్లను నిర్మించారు. ఇప్పటి వరకు రైల్వే లైన్‌ నిర్మాణం, ట్రాక్‌లు, స్టేషన్ల కోసం దాదాపు రూ.230 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు అంచనా. రైలు మార్గం రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ కృషి ఫలించడంతో ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వానికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 

కొనసాగుతున్న  కట్ట పనులు.. 

మొదటి రీచ్‌ పనులు మనోహరాబాద్‌ నుంచి గజ్వేల్‌ వరకు పూర్తవగా, రెండో రీచ్‌లో గజ్వేల్‌ నుంచి దుద్దెడ వరకు, మూడో రీచ్‌లో దుద్దెడ నుంచి సిరిసిల్ల వరకు 48 కిలో మీటర్లు, నాలుగో రీచ్‌లో సిరిసిల్ల నుంచి కొత్తపల్లి వరకు 38 కిలోమీటర్ల పనులు త్వరలోనే ప్రారంభంకానున్నాయి. రెండో దశలో నిర్మాణ పనుల్లో కట్ట పనులు కొనసాగుతున్నాయి. 

ఏండ్ల కల నేరవేరుతున్నది.. 

గజ్వేల్‌కు రైలు రావడం ఎన్నో ఏండ్ల కల. త్వరలోనే నెరవేరడం గజ్వేల్‌ ప్రాంతవాసుల అదృష్టం. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు  ప్రత్యేక చొరవతో రైలు త్వరలోనే వస్తుండడం సంతోషంగా ఉంది. 

-బాల్‌రాజు, రిమ్మనగూడ  

స్టేషన్‌ ఏర్పాటు సంతోషం ..

గజ్వేల్‌ నుంచి దుద్దెడ వరకు రైల్వేలైన్‌ నిర్మాణ పనులు త్వరితగతిన జరుగుతుండడం సంతోషంగా ఉంది. మా కొడకండ్ల గ్రామంలోనే స్టేషన్‌ను ఏర్పాటు చేయడంతో చుట్టూ పది గ్రామాల వారికి అందుబాటులోకి వస్తుంది. స్టేషన్‌ను నిర్మాణం చేస్తునందుకు సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు.

-ఎ.బాబు, కొడకండ్ల 

VIDEOS

logo