గురువారం 04 మార్చి 2021
Siddipet - Dec 10, 2020 , 00:13:40

నవశకానికి నాంది

నవశకానికి నాంది

సిద్దిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను గురువారం సీఎం కేసీఆర్‌ చేయనున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నది. కోమటి చెరువు సుందరీకరణ పనులను సీఎం కేసీఆర్‌ స్వయంగా పరిశీలించనున్నారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు మూడు, నాలుగు రోజులుగా సిద్దిపేటలోనే ఉండి ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తూ అటు అధికారులకు, ఇటు ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. 10న ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు  సిద్దిపేట నియోజకవర్గంలో సీఎం పర్యటన కొనసాగనున్నది. ఈ నేపథ్యంలో అధికారులు పక్కాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో 10వేల మందితో బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

-సిద్దిపేట, నమస్తే తెలంగాణ  

మెడికల్‌ కళాశాల భవనం..


సిద్దిపేట జిల్లా ఆవిర్భావ సభలో మంత్రి హరీశ్‌రావు కోరిక మేరకు సీఎం కేసీఆర్‌ మెడికల్‌ కళాశాలను మంజూరు చేశారు. సిద్దిపేట అర్బన్‌ మండలం ఎన్సాన్‌పల్లి గ్రామ శివారులో  మెడికల్‌ కళాశాల భవన సముదాయానికి అక్టోబర్‌ 2017న సీఎం కేసీఆర్‌ శంకుప్థాపన చేశారు. ఈ భవన నిర్మాణానికి సుమారుగా 25 ఎకరాల స్థలం కేటాయించారు. రూ.135కోట్లతో పనులు ప్రారంభించి భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. 3లక్షల చదరపు అడుగుల్లో జీ+3 విధానంలో మెడికల్‌ కళాశాలను నిర్మించారు. ఈ మెడికల్‌ కళాశాలలో మొత్తం 8డిపార్ట్‌మెంట్లు ఉన్నాయి. గ్రౌండ్‌ఫ్లోర్‌లో లైబ్రరీ, అటానమీ డిపార్ట్‌మెంట్‌తో పాటు అడ్మినిస్ట్రేషన్‌ బ్లాక్‌తో పాటు రెండు తరగతి గదులు ఉన్నాయి. మొదటి అంతస్తులో రీడింగ్‌ రూమ్‌, రెండు తరగతి గదులు, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీలను ఏర్పాటు చేశారు. రెండో అంతస్తులో కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగం, రెండు పరీక్ష గదులు, ఫార్మా కళాశాల, ఫైతాలజీ డిపార్ట్‌మెంట్లను ఏర్పాటు చేశారు. మూడో అంతస్తులో మైక్రో బయాలజీ డిపార్ట్‌మెంట్‌తో పాటు ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగం, క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. మెడికల్‌ కళాశాల ప్రాంగణంలోనే విద్యార్థులకు హాస్టల్‌ వసతి కోసం ‘జీ’ప్లస్‌-5 విధానంలో బాలురు, బాలికలకు వేర్వేరుగా భవనాలను నిర్మించారు. 12,024 చదరపు అడుగుల్లో కిచెన్‌ బిల్డింగ్‌ను నిర్మించారు. బాలురు, బాలికలకు హాస్టల్‌ వసతితో పాటు కళాశాలలోని టీచింగ్‌ స్టాఫ్‌ కోసం 26 క్వార్టర్లు, నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ కోసం 36 క్వార్టర్లను ‘జీ’ప్లస్‌-5 విధానంలో నిర్మించారు. అదేవిధంగా ప్రిన్సిపాల్‌, హెచ్‌వోడీల కోసం ప్రత్యేక బ్లాక్‌లను నిర్మించారు. కళాశాల ఏర్పాటు కావడంతో సిద్దిపేట జనరల్‌ దవాఖానలో మెడికల్‌ కళాశాల తరగతులు ప్రారంభమయ్యాయి. 2018-19 మొదటి బ్యాచ్‌లో 150 మంది విద్యార్థులు, 2019-20 రెండో బ్యాచ్‌లో 175 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 2020-21 మూడో బ్యాచ్‌కు అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. ఇదే సముదాయంలో రూ.225 కోట్లతో 966పడకల జనరల్‌ దవాఖాన భవనాన్ని జీ+7 పద్ధతిలో నిర్మించనున్నారు. త్వరలో దీనికి సీఎం కేసీఆర్‌ భూమిపూజ చేయనున్నారు. చేస్తారు. 

అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ..


స్వచ్ఛతలో ఇప్పటికే జాతీయ స్థాయిలో అవార్డులను సాధించిన సిద్దిపేట పట్టణం మరో ఘనతను సాధించింది. రాష్ట్రంలోనే మురుగుశుద్ధి కేంద్రం ఉన్న రెండో మున్సిపాలిటీ సిద్దిపేటగా ఖ్యాతి కెక్కింది. తడి,పొడి చెత్తను వేరు చేస్తూ వడివడిగా అడుగులు ముందుకు వేస్తూ ‘శుద్ధి’పేటగా పేరు తెచ్చుకుంది. సిద్దిపేట పట్టణాన్ని ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన పట్టణంగా మార్చేందుకు చేపట్టిన పథకం అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం. అమృత్‌ పథకంలో భాగంగా రూ.278 కోట్లతో సిద్దిపేట పట్టణంలో 328.4 కి.మీ మేర భూగర్భ మురికి కాలువల నిర్మాణానికి గాను 302 కి.మీ. మేర పూర్తి చేశారు. జనావాసాల నుంచి వచ్చే మురుగు నీటిని శుద్ధి చేసి ఆ నీటిని విడుదల చేసే ప్రక్రియలో భాగంగా నిర్మించిన కేంద్రం ఎస్‌టీపీ ట్యాంకు. సిద్దిపేట మున్సిపాలిటీలో 34 వార్డులు ఉన్నాయి. 25,517 గృహాలు ఉన్నాయి. ఇంటింటికీ కనెక్షన్లు ఇచ్చారు. మొదటి దశలో 8వేల ఇండ్లకు అనుసంధానం చేశారు. ప్రస్తుతం ప్రతి రోజు మొదటి ప్యాకేజీలో భాగంగా చింతల్‌ చెరువు వద్ద 7.25 ఎంఎల్‌డీ సామర్థ్యంతో నిర్మించిన ఎస్‌టీపీ ట్యాంకులోకి మురుగు నీరు ప్రవహిస్తుంది. అక్కడి శుద్ధీ చేసన నీరు పక్కనే ఉన్న చెరువులోకి విడుదల చేస్తారు. 

తెలంగాణ భవన్‌

 (సిద్దిపేట జిల్లా)

 

సిద్దిపేట జిల్లా కేంద్రం పొన్నాల శివారులోని పినాకిని క్లబ్‌ వద్ద సర్వే నంబర్‌ 211లో టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి ఎకరం స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. రూ.60లక్షలతో నిర్మించిన పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి గత ఏడాది జూన్‌ 24న భూమిపూజ నిర్వహించి త్వరతిగతిన పనులు చేపట్టి నిర్ధేశించిన గడువులోగా పూర్తి చేశారు. సిద్దిపేట జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ భవన నిర్మాణం రాష్ట్రంలోనే మోడల్‌గా నిలువనున్నది. జీ+1 పద్ధతిలో నిర్మించారు. దీంతో పాటు 1,500 మంది పార్టీ శ్రేణులు సమావేశంలో కూర్చుండే విధంగా సమావేశ హాల్‌ నిర్మించారు. మోడల్‌ కిచెన్‌ షెడ్‌, టాయిలెట్స్‌, విశాలమైన పార్కింగ్‌, ప్రహరీ తదితర పనులు పూర్తి చేశారు. మొత్తంగా భవన నిర్మాణానికి అన్ని కలుపుకొని రూ.1.5 కోట్లు ఖర్చు అయ్యాయి. భవనం చుట్టూ మొక్కలు నాటారు. పొన్నాలలో నిర్మించిన (తెలంగాణ భవన్‌) టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ భవనాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. 

మిట్టపల్లి రైతువేదిక..


సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లి రైతువేదికను సీఎం కేసీఆర్‌ ప్రారంభోత్సవం చేయనుండడంతో అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. ఒక్కో రైతువేదికను 2,046 చదరపు అడుగులలో నిర్మించారు. ఒక్కో  రైతువేదిక నిర్మాణానికి ప్రభుత్వం రూ.22లక్షలు మంజూరు చేసింది. సిద్దిపేట జిల్లాలో 127 రైతువేదికలకు గాను 110 రైతువేదికలను పూర్తి చేశారు. మిగితావి వివిధ దశల్లో ఉన్నాయి. రైతులంతా ఒక్క దగ్గర సమావేశమై మార్కెట్‌ంగ్‌, వ్యవసాయంలో నూతన విధానాలు తదితర అంశాలు చర్చించుకోవడానికి ప్రతి వ్యవసాయ క్లస్టర్‌కు ఒక రైతువేదిక నిర్మాణాన్ని చేపట్టింది. సాగు పంటలపై రైతులంతా ఈ రైతువేదికల్లో సమావేశమై ఏ ఏపంటలు సాగు చేయాలో చర్చించుకుంటారు. ఈ రైతువేదికలు రైతాంగానికి ఎంతో ఉపయోగ కరంగా ఉంటాయి. పూర్తి చేసిన రైతువేదికలపై వేసిన చిత్రాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుబంధు, రైతుబీమా తదితర చిత్రాలను రైతువేదికలపై వేస్తున్నారు. రైతువేదికలు ఎంతో చూడ ముచ్చటగా కన్పిస్తున్నాయి.

ఐటీ టవర్‌.. 


సిద్దిపేట పట్టణ శివారులోని నాగులబండ వద్ద ఐటీ టవర్‌ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ భూమిపూజ చేయనున్నారు. నాగులబండ వద్ద రాజీవ్‌ రహదారిని ఆనుకొని ఉన్న 668 సర్వే నంబరులోని 3ఎకరాల సువిశాల 60వేల చదరపు అడుగుల వైశాల్యంలో రూ.45 కోట్లతో ‘జీ’ప్లస్‌-5 అంతస్తులతో ఐటీ టవర్లు రూపుదిద్దుకోనున్నాయి. ప్రపంచం ఐటీవైపు పరుగుతీస్తున్న సమయంలో సిద్దిపేట ఐటీ పార్కు మంజూరు కావడంతో సిద్దిపేట పట్టణం ఐటీ రంగంలో దూసుకపోనుంది. ఐటీ టవర్ల ఏర్పాటుతో ఉద్యోగ అవకాశాలు పెరుగనున్నాయి. సీఎం కేసీఆర్‌ ఐటీ టవర్‌ను మంజూరు చేయడంతో ఈ ప్రాంత యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

6) రంగనాయక సాగర్‌ అతిథి గృహం.సిద్దిపేట శివారులోని చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌, పెద్దకోడూరు గ్రామల సమీపంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా  రంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌ను 3టీఎంసీల సామర్థ్యంతో ప్రభుత్వం నిర్మించింది. ఈ రిజర్వాయర్‌ మధ్యలో 45ఎకరాల విస్తీర్ణంలో  పల్లగుట్ట ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా పల్లగుట్టపై రంగనాయక సాగర్‌ అతిథి గృహాన్ని సుమారుగా రూ.7 కోట్లతో నిర్మించారు. దీని వెనుక భాగంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్‌ఈ కార్యలయం ఉంది. రంగనాయక సాగర్‌ మధ్యలో ఉన్న పల్లగుట్ట సుమారు 45ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, ఈ అతిథి గృహాన్ని సుమారు ఎకరం విస్తీర్ణంలో జీ+2 పద్ధతిలో 21,000 ఎస్‌ఎఫ్‌టీలో నిర్మించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో వేయిటింగ్‌హాల్‌, డైనింగ్‌హాల్‌తో పాటు ఆఫీస్‌ గది ఉంది. మొదటి అంతస్తులో కాన్ఫరెన్స్‌హాల్‌, వేయిటింగ్‌హాల్‌ ఏర్పాటు చేశారు. పై అంతస్తులో వీవీఐపీ సూట్‌ ఒకటి, వీఐపీ సూట్‌లు రెండు, మినీ సూట్‌ను ఒకటి ఏర్పాటు చేశారు. ఈ అతిథి గృహానికి చుట్టూ గోదావరి జలాకళను సంతరించుకొని ద్వీప కల్పంలా ఉంటుంది. ప్రస్తుతం రంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌లో 2.5టీఎంసీల గోదావరి జలాలు ఉన్నాయి. ప్రస్తుత నీటి మట్టం నుంచి 35మీటర్ల ఎత్తు భాగంలో ఈ అతిథి గృహం ఉంటుంది. రిజర్వాయర్‌ పూర్తి సామర్థ్యం 3టీఎంసీలు (490 ఎఫ్‌ఆర్‌ఎల్‌) ఉంటుంది. పల్లగుట్ట చుట్టూ 7.5మీటర్ల వెడల్పుతో 1.6 కి.మీటరు పొడవు రింగురోడ్డును ఏర్పాటు చేశారు. దీంతో రంగనాయక సాగర్‌ మంచి పర్యాటక క్షేత్రంగా మారనున్నది.

VIDEOS

logo