శనివారం 06 మార్చి 2021
Siddipet - Dec 09, 2020 , 00:59:16

మదుర్గంధం మటుమాయం

మదుర్గంధం మటుమాయం

  • ఎస్‌టీపీ ట్యాంకుతో 7.25 ఎంఎల్‌డీ సామర్థ్యపు మురుగు నీరు శుద్ధి 
  • రేపు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌ 
  • సిద్దిపేట, నమస్తే తెలంగాణ  / కలెక్టరేట్‌ : 

మురుగు నీటి శుద్ధి కేంద్రాలు.. ఇవి ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మున్సిపాలిటీల్లోనూ ఎస్‌టీపీ ట్యాంకులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. జిల్లా కేంద్రమైన సిద్దిపేట మున్సిపాలిటీలో భూగర్భ మురుగు నీటి కాలువలను చేపట్టి జనావాసాల నుంచి వచ్చినటువంటి మురుగు నీటిని శుద్ధి చేసి శుభ్రమైన నీరుగా మార్చేటువంటి ప్రక్రియ అయిన సీవరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను పట్టణంలోని చింతల్‌ చెరువు వద్ద నిర్మించి వినియోగంలోకి తీసుకరానున్నారు. ఈ సీవరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను ఈ నెల 10న సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్న నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న కథనం. 

 సిద్దిపేట పట్టణాన్ని ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన పట్టణంగా మార్చేందుకు చేపట్టిన పథకం అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం. అమృత్‌ పథకంలో భాగంగా రూ.278.5 కోట్లతో సిద్దిపేట పట్టణంలో 324.4 కి.మీ మేర భూగర్భ మురికి కాలువల నిర్మాణం చేపట్టారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణంలో మొదటి ప్యాకేజీలో భాగంగా చింతల్‌ చెరువు వద్ద 7.25 ఎంఎల్‌డీ సామర్థ్యంతో ఎస్‌టీపీ ట్యాంకు ను నిర్మించారు. ఈ ఎస్‌టీపీ ట్యాంకు ద్వారా సీ క్యాచ్‌మెంట్‌ పరిధిలో గల 8 వేల జనావాసాలకు సంబంధించిన మురుగు నీరును శుద్ధి చేస్తారు. ఇందుకోసం ట్రీట్‌మెంట్‌, పైప్‌లైన్‌లతో పాటు చింతల్‌ చెరువు విభాగం కోసం రూ.70.67 కోట్లతో 14వార్డుల్లో పూర్తి స్థాయిలో 91.16 కి.మీ మేర పైపులైన్‌ నిర్మించి దీని ద్వారా జనావాసాల మురుగును ఈ ఎస్‌టీపీ ట్యాంకుకు తరలించి శుద్ధి చేస్తారు. కాళ్లకుంట కాలనీ నుంచి మెదక్‌ రోడ్‌లో ఎడమ వైపు ఉన్న కాలనీలకు సంబంధించిన మురుగు నీటినంతా సీ క్యాచ్‌మెంట్‌ పరిధిలో నిర్మించిన చింతల్‌చెరువు ఎస్‌టీపీ ట్యాంకుకు అనుసంధానం చేశారు. అక్కడ నీటిని శుద్ధి చేసి ఆ నీటిని బయటకు వదులుతారు. 

ఎస్‌టీపీ ట్యాంకుతో మురుగు నీటిని శుద్ధి చేయడం ఇలా..

నివాస గృహాల నుంచి వెలువడే మురుగు నీటితో పాటు సీవరేజ్‌ మరియు ఇతర వ్యర్థాన్ని భూగర్భ మురుగు నీటి కాల్వ ద్వారా ఎస్‌టీపీ ట్యాంకుకు తీసుకవచ్చి నీటిని శుద్ధి చేస్తారు.   వ్యర్థపు నీరు, మురుగు నీరును పైపులైన్‌ ద్వారా మొదటగా ఆర్‌ఎస్‌సీఎస్‌ ట్యాంకులోకి వదిలి మూడు పంపుల సహాయంతో (ఒక్కో పంపు 3.25 హెచ్‌పీ గల సామర్థ్యం) వాటర్‌ రన్‌ చేసి 20 ఎంఎం వరకు ఉన్న వ్యర్థ పదార్థాలను తొలిగిస్తారు. (ఈ ట్యాంకులో ఐదు పంపులు ఏర్పాటు చేశారు). వ్యర్థాలను తొలిగించిన నీటిని స్టీలింగ్‌, స్క్రీన్‌ చాంబర్‌లోకి పంపి 4 ఎంఎం నుంచి 6 ఎంఎం వరకు గల వ్యర్థాన్ని తీసి వేస్తారు. (ఆ స్టీలింగ్‌ చాంబర్‌లో మెకానికల్‌, మ్యాన్‌హోల్స్‌ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు.) ఆ నీటిని గ్రిడ్‌ చాంబర్‌లోకి వదులుతారు. ఈ చాంబర్‌లోని 1, 2 డెట్రాయిడ్ల ద్వారా నీటిలోని ఇసుక, మట్టి, ఒండ్రు లాంటి వ్యర్థ పదార్థాలతో  పాటు ఇతర సూక్ష్మమైన వ్యర్థాలను స్క్రీనింగ్‌ చేసి తొలిగిస్తారు. ఆ నీటిని నేరుగా ఎంబీబీఆర్‌-1( మూవింగ్‌ బెడ్‌ బయాలజికల్‌ రియక్టర్‌)లోకి వదులుతారు. ఈ ఎంబీబీఆర్‌లో నీటిని స్క్రీనింగ్‌ చేయడానికి ఎంబీబీఆర్‌ను నింపి స్టేజ్‌ -1లో భాగంగా నీటిని శుద్ధి చేస్తారు. 

మొదటి ఎంబీబీఆర్‌ -1 నుంచి తీసుకవచ్చిన మురుగు నీటిని ఎంబీబీఆర్‌ -2లోకి వదిలి మురుగు నీటిని శుద్ధి చేసి క్లారిఫ్లైయర్‌ చాంబర్‌లోకి  వదులుతారు. ఈ చాంబర్‌లోకి నీరు ద్వారా వచ్చిన వ్యర్థాలను కిందకు పంపి స్క్రూపంపు సహాయంతో అందులోని వ్యర్థాన్ని తొలిగించివేస్తారు. ఆ వ్యర్థ పదార్థాల్లో ఉన్నటువంటి నీటిని తీసివేసి పాలిమార్‌ డోసింగ్‌ ట్యాంకులోకి పంపించి సంపులో స్టోర్‌ చేస్తారు. స్లెడ్జ్‌ తీసివేసిన నీటిని క్లోరినేషన్‌ ట్యాంకులోకి వదిలి అక్కడ నీటిని శుద్ధి చేసి నీరును బయటకు వదులుతారు. ఇలా జనావాసాల నుంచి రోజు వారిగా వచ్చే మురుగు నీరును నిత్యం ఈ ఎస్‌టీపీ ట్యాంకులో శుద్ధి చేస్తూ బయటకు నీటిని వదులుతారు. పాలిమార్‌ డోసింగ్‌ ట్యాంకులోకి తీసుకవచ్చిన స్లెడ్జ్‌లోని వాటర్‌ను తొలిగించగా మిగిలిన వ్యర్థాన్ని వర్మీ కంపోస్టుగా తయారు చేస్తారు. పాలిమార్‌ డోసింగ్‌ ట్యాంకులో స్లెడ్జ్‌ నుంచి వచ్చిన నీటిని రాసీవెజ్‌ కనెక్షన్‌ సంపులోకి వదులుతారు.  

మురుగు నీరు బంద్‌ అయింది.

అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పైపులైన్‌ వేయడం వల్ల మోరీల్లోకి మురుగు నీరు బంద్‌ అయింది. దీంతో ఈగలు, దోమలు పోయినయ్‌. దుర్గంధం కూడా తగ్గిపోయింది. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణంతో పరిశుభ్రత ఏర్పడింది. తద్వారా రోగాలు బంద్‌ అయినయ్‌.  

- రహమాన్‌ (నసీర్‌నగర్‌, 29వ వార్డు)

వార్డులో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కనెక్షన్లు ఇచ్చారు..

వార్డులో అందరికీ అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కనెక్షన్లు ఇచ్చారు. దీంతో మోరీల్లోకి మురుగు నీరు రావడం తగ్గింది. మురుగు నీటితో పాటు ఇల్లు, వంట పాత్రలను శుభ్రపర్చిన నీరును అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీకి కనెక్షన్‌ ఇవ్వడం వల్ల పరిశుభ్రత ఏర్పడింది. వర్షం పడినప్పుడు మాత్రమే మోరీల్లోకి నీరు వస్తుంది. 

- దొంతరబోయిన యాదవ్వ (నాసర్‌పుర, 34వ వార్డు)

మురుగు నీరు వల్ల దోమలు వచ్చేవి.. 

ఇంతకు ముందు మురుగు నీరు మోరీల్లోకి వదలడం వల్ల మోరీల్లో చెత్త జామై నీటి నిల్వ ఉండేది. దీంతో దోమలు, ఈగలు, దుర్వాసన వచ్చేది. భూమిలో పైపులైన్‌ వేసి మరుగుదొడ్ల పైపులైన్‌ను కలుపడంతో దుర్వాసనపోయింది. మోరీలో నీరు జామైతలేదు. దీంతో ఈగలు, దోమలు రాకుంటైంది. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుకు ధన్యవాదాలు.

- బాల్‌లక్ష్మి (బాల్‌నగర్‌, సిద్దిపేట) 


VIDEOS

logo