అందుబాటులోకి..ప్రభుత్వ వైద్య కళాశాల

- ఈ నెల 10న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
- ఎన్సాన్పల్లి శివారులో 25 ఎకరాల్లో రూ.135 కోట్లతో కళాశాల నిర్మాణం
సిద్దిపేట, నమస్తే తెలంగాణ/కలెక్టరేట్: గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉన్నత వైద్య సదుపాయాలతో పాటు వైద్య విద్యను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకోసం మెడికల్ కళాశాలను జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో ఏర్పాటు నిర్మించింది. సిద్దిపేట శివారు ఎన్సాన్‌పల్లిలో సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.135 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తయింది. అధునాతనమైన హంగులతో నిర్మించిన ఈ కళాశాలను సీఎం కేసీఆర్ ఈ నెల 10వ తేదీన ప్రారంభించనున్నారు.
2016 అక్టోబర్ 11న సిద్దిపేట జిల్లా ఆవిర్భావం రోజున సీఎం కేసీఆర్‌కు, స్థానిక ఎమ్మెల్యే, ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు మెడికల్ కళాశాల కోసం విన్నవించగా, సిద్దిపేటకు మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. సిద్దిపేట శివారులోని ఎన్సాన్‌పల్లిలో 25 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2017లో సీఎం కేసీఆర్ కళాశాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మొత్తం 25 ఎకరాల భూమిలో మెడికల్ కళాశాల, బాయ్స్ మరియు గర్ల్స్ హాస్టళ్లు, బోధన, బోధనేతర సిబ్బంది కోసం క్వార్టర్ల నిర్మాణం, ప్రిన్సిపల్స్, హెచ్‌వోడీల కోసం ప్రత్యేక భవనాన్ని నిర్మించారు. కళాశాల ఏర్పాటు కావడంతో సిద్దిపేట జనరల్ దవాఖానలో మెడికల్ కళాశాల తరగతులు నడుస్తున్నాయి. ఇప్పటికే మూడో సంవత్సరం విద్యార్థులు వైద్య విద్యనభ్యసించేందుకు కళాశాలలో అడ్మిషన్ తీసుకుంటున్నారు. మొదటి సంవత్సరంలో 150 మంది, రెండో సంవత్సరంలో 175 మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. మూడో సంవత్సరంలో మరో 175 మంది విద్యార్థులు విద్యను అభ్యసించనున్నారు.
మెడికల్ కళాశాల భవనం నిర్మాణం
25 ఎకరాలను ప్రభుత్వం కేటాయించగా అందులో 3 లక్షల చదరపు అడుగుల్లో జీప్లస్-3 విధానంలో మెడికల్ కళాశాలను నిర్మించారు. ఈ మెడికల్ కళాశాలలో మొత్తం 8 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. గ్రౌండ్‌ఫ్లోర్‌లో లైబ్రరీ, అటానమీ డిపార్ట్మెంట్తో పాటు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌తో పాటు రెండు తరగతి గదులున్నాయి. మొదటి అంతస్తులో రీడింగ్ రూమ్, రెండు తరగతి గదులు, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీలను ఏర్పాటు చేశారు. రెండో అంతస్తులో కమ్యూనిటీ మెడిసిన్ విభాగం, రెండు పరీక్ష గదులు, ఫార్మా కళాశాల, ఫైథాలజీ డిపార్ట్మెంట్లను ఏర్పాటు చేశారు. మూడో అంతస్తులో మైక్రో బయాలజీ డిపార్ట్మెంట్తో పాటు ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం, క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు.
హాస్టల్ వసతి
మెడికల్ కళాశాల ప్రాంగణంలోనే విద్యార్థులకు హాస్టల్ వసతి కోసం జీప్లస్-5 విధానంలో బాలురు, బాలికలకు వేర్వేరుగా భవనాలను నిర్మించారు. 12024 చదరపు అడుగుల్లో కిచెన్ బిల్డింగ్‌ను నిర్మించారు. 288 మంది బాలురు, 392 మంది బాలికలకు హాస్టల్‌ను నిర్మించారు. కళాశాలలోని టీచింగ్ స్టాఫ్ కోసం 26 క్వార్టర్లు, నాన్‌టీచింగ్ స్టాఫ్ కోసం 36 క్వార్టర్లను జీప్లస్-5 విధానంలో నిర్మించారు. ప్రిన్సిపల్, హెచ్‌వోడీల కోసం ప్రత్యేక బ్లాక్‌ను నిర్మించారు.
దవాఖాన నిర్మాణానికి భూమిపూజ
సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా 3 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.225 కోట్లతో నిర్మించనున్న 960 పడకల దవాఖానకు సీఎం కేసీఆర్ ఈ నెల 10న భూమిపూజ చేయనున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
ఈ నెల 10న ప్రభుత్వ వైద్య కళాశాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రారంభోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ తమిళ అరసితో పాటు వైద్యాధికారులకు ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.
తాజావార్తలు
- రోజూ పరగడుపునే బీట్రూట్ జ్యూస్ తాగితే..?
- మోదీజీ.. ఇప్పుడేం చెబుతారు? వీడియోలు రిలీజ్ చేసిన కేటీఆర్
- రాష్ట్రంలో ఆడియాలజీ కాలేజీ ఏర్పాటు
- హెచ్డీఎఫ్సీ హోంలోన్ చౌక.. ఎలాగంటే.. !!
- అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
- ఏంటి పవన్‌కు నాల్గో భార్యగా వెళ్తావా..నెటిజన్స్ సెటైర్లు..!
- ధోనీ సమావేశంలో తోపులాట, పోలీసుల లాఠీచార్జీ
- పాప చక్కగా పాలు తాగేందుకు.. ఓ తండ్రి కొత్త టెక్నిక్
- ఎన్‌పీఎస్‌లో పాక్షిక విత్‌డ్రాయల్స్ కోసం ఏం చేయాలంటే..?!
- జనగామ జిల్లాలో బాలిక అదృశ్యం