ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Siddipet - Dec 08, 2020 , 00:06:17

అతిథి మెచ్చేలా..

అతిథి మెచ్చేలా..

ప్రశాంత వాతావరణం.., చుట్టూ గోదావరి జలాలు.., మధ్యలో పల్లగుట్ట. ఒక ద్వీపంలా కనువిందు చేస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌ మధ్యలో వెలసిన పల్లగుట్టపై రాష్ట్ర సర్కార్‌ అతిథి గృహాన్ని నిర్మించింది. మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో అందరూ మెచ్చుకునేలా సకల హంగులతో నిర్మాణాలు చేపట్టారు. ఈ అతిథి గృహాన్ని ఈ నెల 10న సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది.

- సిద్దిపేట, నమస్తే తెలంగాణసకల హంగులతో 

  • రంగనాయక సాగర్‌ గెస్ట్‌హౌస్‌ 
  • ఈనెల 10న సీఎం కేసీఆర్‌ ప్రారంభోత్సవం
  • 45 ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి రమణీయంగా పల్లగుట్ట
  • ఎకరం విస్తీర్ణంలో జీ+2 పద్ధతిలో అతిథి గృహనిర్మాణం
  • పల్లగుట్ట చుట్టూ 1.6 కి.మీ బీటీ రోడ్డు 

సిద్దిపేట శివారులోని చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌, పెద్దకోడూరు గ్రామాల సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం 3 టీఎంసీల సామర్థ్యంతో రంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌ను నిర్మించింది. ఈ రిజర్వాయర్‌ మధ్యలో 45 ఎకరాలలో పల్లగుట్ట విస్తరించి ఉన్నది. ఈ పల్లగుట్టపై రంగనాయక సాగర్‌ అతిథి గృహాన్ని సుమారుగా రూ.7 కోట్లతో, దీనివెనుక భాగంలో కోటి రూపాయల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్‌ఈ కార్యాలయం, మొత్తంగా రూ.8 కోట్లకు పైగా నిధులను వెచ్చించి అన్ని హంగులతో భవనాలను నిర్మించారు. కాగా, అతిథి గృహాన్ని సుమారు ఎకరం విస్తీర్ణంలో జీ+2 పద్ధతిలో 21,000 ఎస్‌ఎఫ్‌టీలో నిర్మించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో వేయిటింగ్‌హాల్‌, డైనింగ్‌హాల్‌తో పాటు కార్యాలయ గది ఉన్నది. మొదటి అంతస్తులో కాన్ఫరెన్స్‌హాల్‌, వేయిటింగ్‌హాల్‌ ఏర్పాటు చేశారు. పై అంతస్తులో వీవీఐపీ సూట్‌ ఒకటి, వీఐపీ సూట్లు రెండు, మినీ సూట్‌ ఒకటి ఏర్పాటు చేశారు. ఈ అతిథి గృహానికి చుట్టూ గోదావరి జలకళ సంతరించుకొని ఉండి ఒక ద్వీప కల్పంలా ఉంటుంది. ప్రస్తుతం రంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌లో 2.5 టీఎంసీల గోదావరి జలాలున్నాయి. ప్రస్తుత నీటి మట్టం నుంచి 35 మీటర్ల ఎత్తు భాగంలో ఈ అతిథి గృహం ఉంటుంది. రిజర్వాయర్‌ పూర్తి సామర్థ్యం 3 టీఎంసీలు (490 ఎఫ్‌ఆర్‌ఎల్‌) ఉంటుంది. పల్లగుట్ట చుట్టూ 7.5 మీటర్ల వెడల్పుతో 1.6 కీ.మీ పొడవు రింగు రోడ్డును ఏర్పాటు చేశారు. కింది భాగంలో బతుకమ్మ మెట్లను సైతం ఏర్పాటు చేశారు. ఈ మెట్లు 0.5 టీఎంసీల నీటి సామర్థ్యం దిగువ వరకు ఏర్పాటు చేశారు. రిజర్వాయర్‌ పూర్తి లెవల్‌ నుంచి సుమారుగా 20 మీటర్ల లోతు వరకు మెట్లు ఉంటాయి. 


పర్యాటక క్షేత్రం..

రంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌ సిద్దిపేట పట్టణానికి దగ్గరలో ఉండడంలో పర్యాటక క్షేత్రంగా భాసిల్లుతున్నది. ఉదయం, సాయంత్రం వేళ పర్యాటకులు నిత్యం పెద్దఎత్తున తరలివస్తున్నారు. వారాంతంలో ఆ సంఖ్య భారీగానే ఉంటుంది. రంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌ను సుమారు 2,220 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. బండ్‌ పొడవు 8. 6 కీ.మీ ఉంటుంది. అన్నపూర్ణ రిజర్వాయర్‌ నుంచి రంగనాయక సాగర్‌కు గోదావరి జలాలు వస్తాయి. ఇక్కడి నుంచి మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ రిజర్వాయర్‌కు గోదావరి జలాలు పరుగులు పెడుతున్నాయి. గత మార్చి 24న రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌, మంత్రి హరీశ్‌రావులు నీటిని విడుదల చేశారు. అదే సమయంలో సిద్దిపేట, దుబ్బాక, మానకొండూరు నియోజకవర్గంలోని పలు చెరువులకు గోదావరి జలాలను విడుదల చేసి వాటిని నింపారు. 


సకల హంగులతో అతిథి గృహ నిర్మాణం

సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా రంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌ మధ్యలో పల్లగుట్టపై మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో అతిథి గృహాన్ని నిర్మించారు. అతిథి గృహానికి చుట్టూ గోదావరి జలకళను సంతరించుకొని ఉంటుంది. రాష్ట్రంలో ఈ తరహా అతిథి గృహం మరెక్కడా లేదు. ఈ అతిథి గృహాన్ని ఈనెల 10న సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.

- ఆనంద్‌ (కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్‌ఈ) 

VIDEOS

logo