సోమవారం 01 మార్చి 2021
Siddipet - Dec 06, 2020 , 00:11:18

10న సిద్దిపేటకు సీఎం కేసీఆర్‌

10న సిద్దిపేటకు సీఎం కేసీఆర్‌

పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం

  • ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి
  • మంత్రి తన్నీరు హరీశ్‌రావు
  • క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పరిశీలన
  • కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష

సిద్దిపేట, నమస్తే తెలంగాణ : సిద్దిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఈ నెల 10న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు వస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, సీఎం కేసీఆర్‌ పర్యటనను విజయవంతం చేయాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు క్షేత్రస్థాయిలో కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, సీపీ జోయల్‌ డెవిస్‌, ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం రాత్రి సిద్దిపేట సమీకృత కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారన్నారు. సిద్దిపేట పట్టణ శివారు నర్సపురంలో రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలకు రూ.163 కోట్లతో నిర్మించిన 2,460 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల సముదాయాన్ని ప్రారంభోత్సవం చేస్తారన్నారు. రూ.135 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, రూ.225 కోట్ల తో నిర్మించనున్న 960పడకల దవాఖానకు శంకుస్థాపన, రూ.278 కోట్లతో సిద్దిపేట పట్టణంలో చింతల్‌ చెరువు వద్ద నిర్మించిన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, రంగనాయకసాగర్‌ జలాశయం మధ్యలో రూ.8 కోట్లతో నిర్మించిన అతిథి గృహం, మిట్టపల్లి రైతు వేదిక ప్రారంభం అనంతరం బాబూ జగ్జీవన్‌రామ్‌ సర్కిల్‌ సమీపంలో నూతన ఆడిటోరియానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తారన్నారు. కోమటి చెరువు అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్‌ పరిశీలించిన అనంతరం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పబ్లిక్‌ మీటింగ్‌లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సీఎం కేసీఆర్‌ జిల్లా పర్యటన విజయవంతం కోసం అప్పగించిన బాధ్యతలను జిల్లా అధికారులు, మున్సిపల్‌ కమిషనర్‌, ఆర్డీవోలు పూర్తి స్థాయిలో నిమగ్నం కావాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ముజమ్మీల్‌ఖాన్‌, ట్రైనీ కలెక్టర్‌ దీపక్‌ తివారి, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, జిల్లా రెవెన్యూ బాధ్యులు చెన్నయ్య, ఆర్డీవోలు అనంతరెడ్డి, జయచంద్రారెడ్డి, విజయేంద్రరెడ్డి, డీఎఫ్‌వో శ్రీధర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రమణాచారి, జడ్పీ సీఈవో శ్రావణ్‌, జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్‌ కుమార్‌, డీపీవో సురేశ్‌బాబు, డీఆర్డీవో గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

మోడల్‌గా జిల్లా పార్టీ కార్యాలయం.. 

సిద్దిపేట అర్బన్‌ మండలం పొన్నాలలో నిర్మించిన టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ(తెలంగాణ భవన్‌) భవనాన్ని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శనివారం ఏర్పాట్లను పరిశీలించి, స్థానిక నాయకులకు సూచనలు చేశారు. సిద్దిపేట జిల్లా తెలంగాణ భవన్‌ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, దీనిని సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో తొలి జిల్లా పార్టీ కార్యాలయం సిద్దిపేటలో సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ భవన్‌ను మోడల్‌గా నిర్మించామని చెప్పారు.


Previous Article రాశి ఫలాలు
Next Article వాస్తు
VIDEOS

logo