ఆదివారం 17 జనవరి 2021
Siddipet - Dec 04, 2020 , 00:22:26

కేంద్ర చట్టాలను రద్దు చేయాలి

 కేంద్ర  చట్టాలను రద్దు చేయాలి

  • కొత్త చట్టం వ్యాపారులకే మేలు 
  • మండలాల్లో రాస్తారోకోలు, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం 
  •  ఢిల్లీ పోరాటానికి తెలంగాణ రైతాంగం మద్దతు  

 హుస్నాబాద్‌టౌన్‌ : కేంద్ర ప్రభుత్వం వ్యాపారులకు మేలుచేసే చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా హుస్నాబాద్‌లో రైతులు గురువారం రాస్తారోకో నిర్వహించారు. స్థానిక అంబేద్కర్‌ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతులు నినదించారు. పంటకు మద్దతు ధర ఇవ్వలేని చట్టం రైతులకు ఎలా మేలుచేస్తుందని రైతు ఐక్యత సంఘం నాయకుడు పచ్చిమట్ల రవీందర్‌గౌడ్‌ ప్రశ్నించారు. సన్న, చిన్నకారు రైతులు ఇతర ప్రాంతాలకు తమ పంటను తీసుకువెళ్లి అమ్మే పరిస్థితులు లేవన్నారు. నిరసనలో వివిధ పార్టీల నాయకులు అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, గవ్వ వంశీధర్‌రెడ్డి, అక్కు శ్రీనివాస్‌, గురాల సంజీవరెడ్డి, పున్న సది,  కౌన్సిలర్‌ వల్లపు రాజు, రైతులు పాల్గొన్నారు.  

 సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాస్తారోకో

  దుబ్బాక టౌన్‌ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ డిల్లీలో రైతులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ బాధ్యులు దుబ్బాకలో నిరసన చేపట్టారు.  స్థానిక బస్టాండ్‌లో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి గొడ్డుబర్ల భాస్కర్‌ పిలుపు మేరకు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ...వ్యవసాయ రంగాన్ని నాశనం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తెచ్చిందన్నారు.  మతోన్మాద ఎజెండా ఎల్లకాలం సాగదన్నారు. నిరసనలో పెంటి సాయికుమార్‌, భాస్కర్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి సాధిక్‌, నాయకులు మద్దెల అంజయ్య, పవన్‌, నాగరాజు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

చేర్యాల : రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ జనగామ-సిద్దిపేట ప్రధాన రహదారిపై రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, సీపీఎం కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారిపై రైతులు, కార్మికులు, పార్టీల నాయకులు  బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం దాసరి కళావతి మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకునేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌మావో, నాయకులు ఒగ్గు రాజు, రాళ్లబండి నాగరాజు, ఆముదాల నర్సిరెడ్డి, పోలోజు శ్రీహరి, బండకింది అరుణ్‌కుమార్‌, చందు, కుమార్‌  పాల్గొన్నారు.

 రద్దు చేసే వరకు పోరాటం ఆగదు.. 

 సిద్దిపేట టౌన్‌ :  రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదని రైతు సంఘాల, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు కేంద్రాన్ని హెచ్చరించారు. ఢిల్లీలో రైతులు చేపట్టిన పోరాటానికి మద్దతుగా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్త పిలుపులో భాగంగా సిద్దిపేట కొత్త బస్టాండ్‌ వద్ద రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ఆముదాల మల్లారెడ్డి, తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు మారెడ్డి రామలింగారెడ్డి మాట్లాడుతూ ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులపై కేంద్రం లాఠీచార్జి చేయడం హేయమన్నారు. రాస్తారోకోలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు యాదవరెడ్డి, రైతు రక్షణ సమితి జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు రవీందర్‌రెడ్డి, శ్రీరాంరెడ్డి, తిరుపతిరెడ్డి, శశిధర్‌ ఉన్నారు.