సోమవారం 01 మార్చి 2021
Siddipet - Dec 02, 2020 , 00:29:04

అర్హులకే ‘డబుల్‌' ఇండ్లు

అర్హులకే ‘డబుల్‌' ఇండ్లు

  • గజ్వేల్‌ నియోజకవర్గంలో 3,957 ఇండ్ల నిర్మాణం 
  • 2250 ఇండ్లు గృహప్రవేశాలకు సిద్ధం 
  • అర్హులను పారదర్శకంగా ఎంపిక చేయాలి 
  • త్వరలో మిగతా ఇండ్ల నిర్మాణం పూర్తిచేయాలి
  • సమీక్షలో సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి

గజ్వేల్‌ అర్బన్‌: సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో గజ్వేల్‌ నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శంగా జరుగాలని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం గజ్వేల్‌ ఆర్డీవో కార్యాలయంలో గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, హౌసింగ్‌ డీఈ రాంచంద్రం వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో అర్హులైన వారికి మాత్రమే డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు కేటాయించాలని, ఎంపిక చేయాల్సిన ప్రక్రియ కసరత్తు, జాబితా రూపకల్పన అంశాలు, భవిష్యత్‌ ప్రణాళికపై అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలిచ్చారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో మొత్తం 3957 డబుల్‌ బెడ్‌రూంలు నిర్మించామని, ఇప్పటికే 2250 ఇండ్లు పూర్తయి గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. అర్హులకు మాత్రమే డబుల్‌బెడ్‌రూం ఇండ్లు దక్కేలా చూడాలని అధికారులకు సూచించారు. చివరిదశ లో ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇండ్లును కూడా ప్రారంభోత్సవానికి త్వరగా సిద్ధం చేయాలన్నారు. గజ్వేల్‌ పట్టణంలో 1296గృహాలు, ములుగు మండలంలో 88, గజ్వేల్‌ మండలం కొడకండ్లలో 66, అహ్మదీపూర్‌ 50, కొండపాక మండలం కొండపాక 90, వెలికట్ట 20, ఖమ్మంపల్లి 46, వెల్కటూరు 20, జగదేవ్‌పూర్‌ మండలం చిన్న తిమ్మాపూర్‌ 22తో పాటు గజ్వేల్‌ మండలం సింగాటం గ్రామాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తయి గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి, అర్హులైన పేదలకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ విషయం లో అనర్హులకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో పారదర్శకంగా ఉండేలా సర్వే నిర్వహించనున్నామన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మెడికల్‌ బిల్లులు క్లియర్‌ చేయండి

సిద్దిపేట కలెక్టరేట్‌ : ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్‌లో ఉన్న మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులను వెంటనే క్లియర్‌ చేయాలని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి వైద్యాధికారులకు సూచించారు. మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్‌లో ‘పెండింగ్‌ బిల్లుల చెల్లింపులు-సదరం క్యాంపుల నిర్వహణ’పై అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. బిల్లులను త్వరితగతిన క్లియర్‌ చేసేందుకు, సదరం క్యాంపు ద్వారా వైకల్య నిర్ధారణ పరీక్షలు జాప్యం లేకుండా చూసేందుకు వీలుగా జిల్లా మెడికల్‌ బోర్డును గజ్వేల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహేశ్‌ చైర్మన్‌గా పునర్‌ వ్యవస్థీకరణ చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. మెడికల్‌ కళాశాలు, ఇతర వైద్యులను ప్యానెల్‌ మెంబర్లుగా నియమిస్తామన్నారు. అవసరమైన సపోర్టింగ్‌ స్టాఫ్‌ను సమకూర్చుతామన్నారు. పెండింగ్‌ బిల్లులతో పాటు కొత్తగా వచ్చే మెడికల్‌ బిల్లులో జెన్యూన్‌ బిల్లులు క్లియర్‌ చేయాలన్నారు. అవినీతికి ఆస్కారం ఉండొద్దన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ప్రతి గురువారం సదరం క్యాంపులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు క్యాంపు నిర్వహించాలన్నారు. జిల్లాలోని దివ్యాంగులు మొదట మీ సేవ కేంద్రాల్లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలన్నారు. స్లాట్‌లో నిర్ణయించిన తేదీల ప్రకారం సదరం క్యాంపునకు నిర్దేశిత సమయంలో హాజరుకావాలన్నారు. గరిష్టంగా 80 మందికి పరీక్షలు నిర్వహిస్తారన్నారు. దీంతో పాటు ఆ రోజు వైద్యాధికారులు విధుల్లో ఉండేలా చూడాలని సదరం కమిటీ సభ్యులకు కలెక్టర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రమేశ్‌, డీఆర్డీవో గోపాల్‌రావు, డీఈ వో రవికాంత్‌రావు, డీడబ్ల్యూవో రాంగోపాల్‌రెడ్డి, మెప్మా పీడీ హన్మంతరెడ్డి, మెడికల్‌ కళాశాల ఆర్‌ఎంవో కాశీనాథ్‌, సూపరింటెండెంట్లు చంద్రయ్య, మహేశ్‌ పాల్గొన్నారు.


VIDEOS

logo