శనివారం 06 మార్చి 2021
Siddipet - Dec 01, 2020 , 01:02:10

శిక్షణతో కొలువు సాధన సులువు

శిక్షణతో కొలువు సాధన సులువు

ఇంటర్‌ విద్యాశాఖ ఆధ్వర్యంలో పోలీస్‌ ఉద్యోగానికి శిక్షణ

యువత కల సాకారానికి సరైన వేదిక

అంచనాకు మించి వచ్చిన దరఖాస్తులు

శిక్షణ పొందుతున్న 200 మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కల ప్రతి ఒక్క విద్యార్థికి ఉంటుంది. వారి కలలు నిజం చేయడానికి ప్రభుత్వం అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ కళాశాలల్లో శిక్షణ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకుంది. విద్యతో పాటు ఉద్యోగానికి సన్నద్ధం చేసే విధంగా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పోలీస్‌ ఉద్యోగాలకు  నోటిఫికేషన్ల నేపథ్యంలో కళాశాలల్లోనే శిక్షణ ఇచ్చి విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్‌ పూర్తి చేసుకున్న లేదా ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 34 శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయగా, సిద్దిపేట జిల్లాకు సంబంధించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 

-సిద్దిపేట రూరల్‌

ప్రైవేటుకు దీటుగా శిక్షణ.. 

 హైదరాబాద్‌ నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో వేలకు వేలు ఫీజు చెల్లించి కోచింగ్‌ తీసుకుంటున్న పోలీస్‌ ఉద్యోగార్థులకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే అన్ని సమకూర్చి ఉద్యోగాలకు సిద్ధం చేయడం మంచి పరిణామమని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 400 దరఖాస్తులు ఒక్క సిద్దిపేట జిల్లా పీటీసీకి వచ్చాయంటే ఎంతగా స్పందన వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.  శిక్షణా కార్యక్రమం నోటిఫికేషన్‌ వచ్చి పరీక్షలు పూర్తయ్యే వరకు కొనసాగుతుందని నిర్వాహకులు వెల్లడించారు. 

ప్రారంభమైన శిక్షణ.. 

సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌గా ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్‌ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారు. కళాశాలలో పని చేస్తున్న ఫిజికల్‌ డైరెక్టర్లు, లైబ్రేరియన్లు, స్టూడెంట్‌ కౌన్సెలర్లు కూడా శిక్షణలో భాగస్వాములవుతారు. జిల్లా నుంచి సుమారు 400 దరఖాస్తులు రాగా అందులో నుంచి ప్రభుత్వ కళాశాల్లో చదువుతున్న 18 నుంచి 33 సంవత్సరాల వయసు ఉండి శారీరక కొలతలు సరిగ్గా ఉన్న సుమారు 200 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఇటీవలే శిక్షణ ప్రారంభించారు. ప్రతి రోజు ఉదయం 6  నుంచి 8 గంటల వరకు ఫిజికల్‌ ట్రైనింగ్‌ ఇస్తున్నారు. ఫిజికల్‌ క్లాసులతో పాటు త్వరలోనే థియరీ క్లాసులు కూడా ప్రారంభిస్తామని నిర్వాహకులు వెల్లడించారు.  

ప్రభుత్వ లెక్చరర్ల సాయంతో క్లాసులు..

జిల్లా ఇంటర్‌ విద్యాధికారి సహాయంతో జిల్లాలోని వివిధ జూనియర్‌ కళాశాలతో పాటు మోడల్‌ స్కూల్‌లో ఉన్న వివిధ రకాల సబ్జెక్టు నిపుణులతో  శిక్షణ విద్యార్థులకు థియరీ క్లాసులను నిర్వహిస్తాం. నిష్ణాతులైన శిక్షకుల సహాయంతో, పటిష్ట ప్రణాళికతో ట్రైనింగ్‌ అందించి విద్యార్థులందర్నీ పోలీస్‌ ఉద్యోగానికి సిద్ధం చేస్తాం.

- గన్న బాలకిషన్‌ (ప్రిన్సిపాల్‌, కోఆర్డినేటర్‌) నాణ్యమైన శిక్షణ అందిస్తాం..ప్రైవేటు శిక్షణ కేంద్రాలకు దీటుగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రంలో నాణ్యమైన శిక్షణ అందిస్తాం. మేము ఊహించిన దానికంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. మంత్రి హరీశ్‌రావు సహకారంతో వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులకు కోచింగ్‌ ఇచ్చేలా ప్రయత్నం చేస్తాం. 

- సీహెచ్‌. కనకచంద్రం (ట్రైనింగ్‌ సెంటర్‌ ఆర్గనైజర్‌)  

చాలా మంచి అవకాశం..

హైదరాబాద్‌ లాంటి ప్రదేశాలకు వెళ్లి కోచింగ్‌ తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఇక్కడే ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి మాకు శిక్షణ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు చాలా మంచి అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకొని  పోలీస్‌ ఉద్యోగం సాధిస్తా. 

- ఉల్లి రమ్య (మోడల్‌ స్కూల్‌, అక్కెనపల్లి) 

ప్రభుత్వానికి కృతజ్ఞతలు..

వరుసగా పోలీస్‌ నోటిఫికేషన్లు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే నా లాంటి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నందుకు ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు. వారి నమ్మకాన్ని నిలబెడుతూ మేము కష్టపడి ఉద్యోగం సాధిస్తాం. 

- అనిల్‌ (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిద్దిపేట) 

VIDEOS

logo