నిబంధనల ప్రకారం నడుచుకోవాలి

- సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి
సిద్దిపేట కలెక్టరేట్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల పోలింగ్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహించే బాధ్యత ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులదేనని సిద్దిపేట కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి.వెంకట్రామ్రెడ్డి అన్నారు. పోలింగ్ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ఎన్నికల పోలింగ్ సజావుగా నిర్వహించడంలో ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర అన్నారు. శనివారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలకు జిల్లా నుంచి 700 మందిని పీవోలు, ఏపీవోల విధులకు పంపుతున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలింగ్ జరిగేలా చూడాలన్నారు. పీవోలు, ఏపీవోలతో పాటు ఓపీవోల విధుల, బాధ్యతలను తెలుసుకోవాలన్నారు. డిసెంబర్ 1న పోలింగ్ నేపథ్యంలో సిబ్బంది ఒక రోజు ముందుగానే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పీవోలు, ఏపీవోలు పోలింగ్‌ను సక్రమంగా నిర్వహించాలన్నారు. ఎన్నికల పోలింగ్ నిర్వహణ అనంతరం బ్యాలెట్ బాక్సుతో పాటు పోలింగ్ సామగ్రిని తిరిగి రిసెప్షన్ సెంటర్లో అప్పగించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం పోలింగ్ సిబ్బంది, సౌకర్యాలపై అధికారులతో సమీక్షించారు. శిక్షణలో అదనపు కలెక్టర్ పద్మాకర్, జిల్లా రెవెన్యూ బాధ్యులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చెన్నయ్య, ఆర్డీవోలు అనంతరెడ్డి, జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.