పోలింగ్ నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారులదే కీలక పాత్ర

- సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ పద్మాకర్
సిద్దిపేట కలెక్టరేట్ : పోలింగ్ నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారులదే కీలక పాత్ర అని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ పద్మాకర్ అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధన ప్రకారం పోలింగ్ జరిగేలా చూడాలని పీవోలు, ఏపీవోలకు ఆయన సూచించారు. శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులుగా నియామకమైన సిద్దిపేట జిల్లాకు చెందిన వివిధ శాఖల సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు జిల్లా నుంచి 435 మంది పీవోలు, ఏపీవోలుగా సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. వారు తప్పనిసరిగా విధులకు హాజరు కావాలన్నారు. ఎన్నికల విధుల నుంచి ఎవరికీ మినహాయింపు లేదని, ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎన్నికల నియామవళి ప్రకారం ఎన్నికల అధికారి చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ నిర్వహించబోయే ఎన్నికల్లో 171 ప్రిసైడింగ్ అధికారులు, 264 అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు గాను జిల్లా నుంచి కేటాయించబడిన సిబ్బందికి జిల్లా కేంద్రంలోనే శిక్షణ ఇస్తున్నామన్నారు. డిసెంబర్ 1న జరుగనున్న పోలింగ్‌కు సిబ్బంది ఒక రోజు ముందుగానే నవంబర్ 30న కేటాయించబడ్డ డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. అక్కడి నుంచి మెటీరియల్ తీసుకొని, పరిశీలించుకొని సంబంధిత పోలింగ్ సిబ్బంది బృందంతో పోలింగ్ కేంద్రానికి చేరుకుని తగు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. డిసెంబర్ 1న ఉదయం 7 గంటల కల్లా ఏర్పాట్లు పూర్తి చేసుకొని సరిగ్గా 7 గంటలకు పోలింగ్‌ను ప్రారంభించాలన్నారు. నిబంధనల ప్రకారం పీవోలు, ఏపీవోలు పోలింగ్‌ను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. శిక్షణలో తెలియజేసిన అంశాలతో పాటు, బ్యాలెట్ బాక్సులను ఉపయోగించే విధానం తదితర అంశాలను తెలుసుకోవాలన్నారు. జిల్లా రెవెన్యూ బాధ్యులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చెన్నయ్య, ఆర్డీవోలు అనంతరెడ్డి, జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.