సోమవారం 18 జనవరి 2021
Siddipet - Nov 26, 2020 , 00:15:19

శిక్షణ అధికారుల ప్రశంసలు

శిక్షణ అధికారుల ప్రశంసలు

  • గుజరాత్‌కు చెందిన శిక్షణ డిప్యూటీ కలెక్టర్ల బృందం సందర్శన
  • భగీరథ నీటి సరఫరాను వివరించిన అధికారులు

గజ్వేల్‌ రూరల్‌: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం కోమటిబండ గుట్టపై నుంచి ఆవాస గ్రామాలకు ‘మిషన్‌ భగీరథ’ ద్వారా నీటి సరఫరా అమలు తీరును బుధవారం గుజరాత్‌కు చెందిన 50మంది శిక్షణ డిప్యూటీ కలెక్టర్లతో కూడిన బృందం పరిశీలించింది. ఆరు రోజుల శిక్షణలో భాగంగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ హరిప్రీతిసింగ్‌ ఆదేశాల మేరకు మిషన్‌ భగీరథ పథకం అమలును క్షేత్రస్థాయిలో బృందం పరిశీలించింది. నీటిశుద్ధి తీరు, గ్రామాలకు నీటి సరఫరా, ప్రతిఒక్కరికి ఎన్ని లీటర్ల నీటిని ప్రతిరోజు అందిస్తున్నారో స్థానిక అధికారులను బృందం సభ్యులు అడిగి  తెలుసుకున్నారు. శిక్షణ అధికారులకు మిషన్‌ భగీరథ ఈఈ రాజయ్య, డీఈ నాగార్జున పూర్తి వివరాలు తెలియజేశారు. కోమటిబండ నుంచి నీటి సరఫరా పథకం అమలుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషిచేశారని, ఫలితంగానే తాగునీటి ఇబ్బందులు తీరాయని, ప్రతి గ్రామానికి ఉదయం, సాయంత్రం రెండుసార్లు నీటిని అందిస్తున్నామని అధికారులు బృందానికి తెలిపారు. అంతకు ముందు ఫొటో గ్యాలరీని చూసిన బృందం సభ్యులు, కోమటిబండ మిషన్‌ భగీరథ ప్రాజెక్టును ప్రశంసించారు. మిషన్‌ భగీరథ కార్యక్రమం భేష్‌ అని బృందం కితాబిచ్చింది. బృందం వెంట కోర్సు డైరెక్టర్‌ రావులపాటి మాధవి, ఫ్యాకల్టీ డాక్టరు సురేశ్‌కుమార్‌, పెద్దబోయిన శ్రీనివాస్‌ ఉన్నారు.