శుక్రవారం 05 మార్చి 2021
Siddipet - Nov 19, 2020 , 00:14:24

అడవుల పునరుజ్జ్జీవం అద్భుతం

అడవుల పునరుజ్జ్జీవం అద్భుతం

డీజీపీ మహేందర్‌రెడ్డి

గజ్వేల్‌, ములుగు అటవీ ప్రాంతాలను పరిశీలించిన ఐపీఎస్‌ అధికారుల బృందం

అడవుల పెంపకాన్ని బృందానికి వివరించిన అటవీ అధికారులు

కృత్రిమంగా అడవుల పెంపకానికి ఆశ్చర్యపోయిన బృందం 

మిషన్‌ భగీరథ, కొండపోచమ్మ జలాశయం,

గజ్వేల్‌ అభివృద్ధి భేష్‌ అని కితాబు  

జిల్లాలో అధికారుల సమష్టి కృషి అభినందనీయం : డీజీపీ 

గజ్వేల్‌అర్బన్‌/ములుగు/వర్గల్‌: గజ్వేల్‌ ప్రాంతంలో మానవ ప్రయత్నంతో మొక్కలను పెంచి అడవులకు పునరుజ్జీవం పోసిన ప్రక్రియ అద్భుతంగా ఉందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. గజ్వేల్‌ నియోజకవర్గం ములుగు మండలంలోని అటవీ కళాశాల, ఉద్యానవన యూనివర్సిటీ, వర్గల్‌ మండలం సింగాయపల్లి, గజ్వేల్‌ అర్బన్‌ పార్కు, కోమటిబండ అటవీ ప్రాంతాన్ని, కోమటిబండ్‌ మిషన్‌ భగీరథ సంప్‌హౌస్‌, మర్కూక్‌ మండలం కొండపోచమ్మ పంప్‌హౌస్‌, జలాశయాలను డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు 60మంది ఐపీఎస్‌ అధికారులు బుధవారం పరిశీలించారు. గజ్వేల్‌ అటవీ ప్రాంతంలో కృత్రిమంగా సృష్టించిన అడవులను చూసి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సదర్భంగా వారు మాట్లాడుతూ.. గజ్వేల్‌ పట్టణంలోని అభివృద్ధిని చూసి ఇతర జిల్లాల్లో కూడా అధికారులు ఇలాంటి అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని, అందుకే సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు గజ్వేల్‌ ప్రాంత అడవులతో పాటు ఇతర అభివృద్ధి పనులను చూడడానికి వచ్చామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.  

మొక్కలు నాటిన అధికారులు..

   అడవులను పరిశీలించడానికి వచ్చిన అధికారులకు ముందుగా ములుగులోని అటవీ కళాశాలకు చేరుకున్న ఐపీఎస్‌ల బృందానికి కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, అటవీ శాఖ ఏపీసీసీఎఫ్‌ చంద్రశేఖర్‌రెడ్డి, డోబ్రియాల్‌, పీసీసీఎఫ్‌ ఆర్‌ శోభలతో పాటు ఇతర అధికారులు గజ్వేల్‌ అటవీ ప్రాంతం గురించి కళాశాల గురించి సంక్షిప్తంగా వివరించారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం కొండపోచమ్మ సాగర్‌ ముంపు గ్రామాల ప్రజల కోసం తున్కిబొల్లారంలో నిర్మించిన ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీని, ప్రజల జీవనాన్ని వాహనశ్రేణి నుంచే పరిశీలించారు. అనంతరం మర్కూక్‌లోని కొండపోచమ్మ సాగర్‌ పంప్‌హౌస్‌ను, జలాశయాన్ని పరిశీలించారు. కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, ప్రాజెక్టు ఎస్‌ఈ వేణు  ప్రాజెక్టు గురించి ఐపీఎస్‌, అటవీ శాఖ అధికారులకు వివరించారు. అనంతరం సింగాయపల్లిలో అటవీ శాఖ అధికారులు అడవులను ఏవిధంగా అభివృద్ధి చేస్తున్నారో వివరించారు. సింగాయపల్లిలో 157హెక్టార్లలో, సంగాపూర్‌ అర్బన్‌ పార్కు వద్ద సెమీ మెకానికల్‌ ప్లాంటేషన్‌ 105హెక్టార్ల, కోమటిబండ ప్రాంతంలో 1000 హెక్టార్లలో అటవీ పునరుజ్జీవన కార్యక్రమాలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.  

ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ సందర్శన..

   గజ్వేల్‌ మున్సిపాలిటీలోని ముట్రాజ్‌పల్లిలో మల్లన్నసాగర్‌ భూనిర్వాసితులకు నిర్మిస్తున్న ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, సీఎం క్యాంపు కార్యాలయం, మహతి ఆడిటోరియం వాహన శ్రేణి నుంచి కలెక్టర్‌ వివరిస్తుండగా.. వారు పరిశీలించారు. అనంతరం గజ్వేల్‌ వెజ్‌, నాన్‌వెజ్‌ సమీకృత మార్కెట్‌ సందర్శించగా మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి, ఏఎంసీ చైర్‌పర్సన్‌ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్‌ అధికారుల బృందానికి స్వాగతం పలికారు. కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి మార్కెట్‌ నిర్మాణం గురించి వివరిస్తూ మార్కెట్‌ నిర్మాణానికి ముందు పరిస్థితులను, ప్రస్తుత పరిస్థితులను వివరించారు. డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు ఐపీఎస్‌ అధికారులంతా మార్కెట్‌లో పరిశుభ్రమైన వాతావరణంలో కూరగాయలు, పండ్ల విక్రయాలను సందర్శించి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. మార్కెట్‌లో పచ్చటి వాతావరణంతో పాటు రైతు జీవనాన్ని తెలియజేస్తూ ఏర్పాటు చేసిన అహ్లాదకర వాతావరణానికి ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారు. మార్కెట్‌లో వ్యాపారులను డీజీపీ మహేందర్‌ రెడ్డి మార్కెట్‌ నిర్మాణం తర్వాత ఏవిధంగా ఉందని ప్రశ్నించగా, తాము గతంలో రోడ్ల మీద వ్యాపారాలు చేసుకునే వారమని, ఇప్పుడు ఇక్కడ దుమ్మ ధూళి లేకుండా శుభ్రంగా ఉందని, వ్యాపారం కూడా బాగా సాగుతుందని చెప్పగా.. డీజీపీ నవ్వుతూ ఆనందాన్ని వెలిబుచ్చారు.  

అర్బన్‌ పార్క్‌ పరిశీలన..

అధికారుల బృందం గజ్వేల్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌లు, సంగాపూర్‌ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు పరిశీలిస్తూ అర్బన్‌ పార్కుకు చేరుకున్నారు. అక్కడ కృత్రిమంగా అడవిని ఏ విధంగా అభివృద్ధి చేశారో అటవీ శాఖ అదికారులు డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర అధికారుల బృందానికి వివరించారు. అనంతరం కోమటిబండ అడవిని పరిశీలిస్తూ మిషన్‌ భగీరథ సంప్‌హౌస్‌కు చేరుకున్నారు. మిషన్‌ భగీరథ ఎస్‌ఈ శ్రీనివాస్‌చారి, ఇతర అధికారులు మిషన్‌ భగీరథ సంప్‌హౌస్‌ నిర్మాణం, నీటి సేకరణ, శుద్ధ్దీకరణ, నీటి సరఫరా తదితర అంశాల గురించి క్షుణ్ణంగా అధికారుల బృందానికి వివరించారు. ఆ తర్వాత ఐపీఎస్‌ అధికారుల బృందం తిరిగి వెళ్తూ మార్గమధ్యలో ములుగు ఉద్యానవన యూనివర్సిటీనికి సందర్శించారు. కార్యక్రమాల్లో అడిషనల్‌ డీజీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఇతర ఐపీఎస్‌ ఉన్నతాధికారులు, హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌, ఆర్డీవోలు విజయేందర్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, తహసీల్దార్‌ అన్వర్‌ రెవెన్యూ సిబ్బంది, అటవీ శాఖ ఎఫ్‌ఆర్‌వో రామారావు, సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

వెల్‌డన్‌ వెంకట్రామ్‌రెడ్డి : కలెక్టర్‌కు 

డీజీపీ ప్రశంస

రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా విశాలమైన అంతర్గత రోడ్లు, మెరుగైన వసతులతో ముట్రాజ్‌పల్లి, తున్కిబొల్లారం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలు, సంగాపూర్‌ 2బీహెచ్‌కేలు తీర్చిదిద్దడంపై సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ పి.వెంకట్రామ్‌రెడ్డిని డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రశంసించారు. జిల్లాలో అటవీ సంరక్షణ, పునరుద్ధ్దరణ కార్యక్రమాలు ప్రభావవంతంగా అమలయ్యేలా కృషి చేసిన కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, డీఎఫ్‌వో శ్రీధర్‌రావు, సీపీ జోయల్‌ డెవిస్‌ తదితరులను డీజీపీ అభినందించారు. 

కూరగాయలు కొనుగోలు చేసిన

 పోలీసు అధికారులు.. 

గజ్వేల్‌ సమీకృత మార్కెట్‌లో పరిశుభ్రమైన వాతావరణంలో కూరగాయల విక్రయాన్ని చూసి ఐపీఎస్‌ అధికారులు ముగ్ధులయ్యారు. రాచకొండ అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు, నారాయణపేట ఎస్పీ చేతన మార్కెట్‌లోని ఓ మహిళా వ్యాపారి వద్ద సొరకాయ, క్యాప్సికం, టమాట తదితర కూరగాయలను కొనుగోలు చేశారు. మార్కెట్‌ ఎంతో పరిశుభ్రంగా ఉందని, కూరగాయలు   తాజాగా ఉన్నాయని వారు చెప్పారు.  

VIDEOS

logo