కోమటిబండ వైపు దేశం చూపు

అటవీ పునరుద్ధరణలో సిద్దిపేట జిల్లా రికార్డు
13 వేల హెక్టార్లలో అడవి సృష్టి
నేడు కేస్ స్టడీకి రానున్న ఐపీఎస్‌ల బృందం
ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో అడవుల పునరుద్ధరణ యుద్ధప్రాతిపదికన మొదలు కావడం. అంతే వేగంతో విజయవంతం కావడమే ఇందుకు కార ణం. ఐదేండ్ల కిందట కోమటిబండ ప్రాంతాన్ని చూసిన వారు, ప్రస్తుత పరిస్థితిని చూసి ఇంతలో అంత మార్పా అని ఆశ్చర్యపడే పరిస్థితి నెలకొన్నది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశంతో అటవీశాఖ అధికారులు నిరంతరంగా సాగించిన ప్రత్యేక కృషి ఫలితంగా, బీడు భూములను తలపించిన ఈ ప్రాంతం పచ్చదనం తో ఫరిడవిల్లుతున్నది.
ఇంతింతై...
వంద అడుగుల ఎత్తైన కోమటి బండపైకి ఎక్కి చూస్తే కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఎటుచూసినా పచ్చదనమే కనిపిస్తున్నది. 2016లో ఇక్కడ మిషన్ భగీరథ కార్యక్రమా న్ని ప్రారంభించినప్పుడు 72 హెక్టార్లలో మొక్కలు నా టారు. ఆ తర్వాత యుద్ధప్రాతిపదికన దాదాపు రెండు వేల ఎకరాల్లో మేలైన జాతి మొక్కలు నాటారు. క్షీణించిన, విధ్వంసమైన అడవులను ఎయిడెడ్ న్యాచురల్ రీజనరేషన్(ఏఎన్ఆర్) పద్ధ్దతిలో తిరిగి జీవం పోశారు. ఇక అక్కడి నుంచి ఇంతింతై వటుడింతింతై అన్నట్లు గజ్వేల్‌తో పాటు సిద్దిపేట రేంజ్లో 13వేల హెక్టార్లలో అడవిని సృష్టించారు. నర్సంపలి, మీనాజీపేట, ధర్మారెడ్డిపల్లి, మర్పడగ ప్రాంతాల్లో వేలాది హెక్టార్లలో అడవికి తిరిగి జీవం పోశారు. పర్యావరణ సమతుల్యతను కాపాడారు. ఇంత వేగంగా అడవిని పునరుద్ధరించిన పరిస్థితి దాదాపు దేశంలో ఎక్కడా లేదంటే ఆశ్చర్యం కలుగక మానదు.
అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆర్ శోభ, అడిషనల్ పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ నుంచి మొదలుకొని డీఎఫ్‌వో శ్రీధర్‌రావు, రేంజ్ ఆఫీసర్ పర్యవేక్షణలో అన్ని స్థాయిల్లో అధికారులు, సిబ్బంది అంకితభావంతో చేసిన కృషి ఫలించింది. ఇక్కడ హైవే, అంతర్గత రహదారులకు ఇరువైపులా, రెండు నుంచి మూడు వరుసల వరకు నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ప్రయాణికులు, స్థానికులను పరవశింపచేస్తున్నాయి. కనుచూపు మేరలో ఎటుచూసినా పచ్చదనమే..ఇక్కడ నాటిన మొక్కల్లో 90 శాతం పైగా బతకడం విశేషం.
ఈ ప్రాంతానికి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ర్టాల అటవీ ఉన్నతాధికారులతో పాటు కేంద్ర అటవీ,పర్యావరణ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్‌తో పాటు ప్రపంచబ్యాంక్ బృందం పర్యటించి పర్యావరణం భేష్ అని ప్రశంసించింది. యునైటెడ్ నేషన్స్ ఎన్వీరాన్మెంట్ కంట్రీహెడ్ అతుల్ బకాయ్ వచ్చి, ఇది ఇతర ప్రాంతాలకు మార్గదర్శకం కావాలన్నారు. రాష్ట్రంలోని కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులు కూడా కోమటిబండకు వచ్చి పరిశీలించారు. తమ పరిధుల్లో కూడా కోమటిబండ తరహాలో అడవుల పునరుద్ధరణ పనులను చేపట్టారు. బుధవారం అన్ని జిల్లాల ఎస్పీలు గజ్వేల్‌లోని కోమటిబండ అటవీ ప్రాం తాన్ని సందర్శిస్తారు. ఇక్కడి అడవుల పునరుద్ధరణ తీరు ను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.
పునరుద్ధరణ అద్భుతం..
ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో గజ్వేల్ నియోజకవర్గంలో నాలుగేండ్ల క్రితం చేపట్ట్టిన అడవుల పునరుద్ధరణ కార్యక్రమం విజయవంతమైంది. మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్ వెంకట్రామరెడ్డి, అటవీశాఖ అధికారలు ప్రత్యేక చొరవతో అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని మిగతా ప్రాంతాలకు ఆదర్శంగా నిలిపారు. అంతరించి పోతున్న అటవీ ప్రాంతాన్ని సమగ్ర ప్రణాళికతో తిరిగి అభివృద్ధి చేశారు. నరికివేతకు గురైన చెట్లు, ఆక్రమణకు గురైన అటవీ భూములను గుర్తించి, వాటి పునరుద్ధరణ పనులు విజయవంతంగా అమలు చేశారు. 30 రకాల పండ్ల, వివిధ రకాల నీడ, కలపనిచ్చే మొక్కలు నాటారు. పక్కాగా సంరక్షణ చర్యలు చేపట్టడంతో అతి తక్కువ సమయంలో ఎదిగి ఫలాలిచ్చే స్థాయికి మొక్కలు పెరిగాయి. దీంతో వన్యప్రాణులకు ఆహారం లభించడం, పలు రకాల అటవీ సంపద సమకూరడంతో పాటు వాతావరణ సమతుల్యతతో వర్షపాతం పెరిగింది. ప్రధాని మోడీ సైతం ప్రశంసించారు. మంత్రులు, కలెక్టర్ల బృందం, దేశవిదేశీ ప్రతినిధుల బృందాలు పరిశీలించి, అభినందించాయి.