బుధవారం 24 ఫిబ్రవరి 2021
Siddipet - Nov 14, 2020 , 00:02:35

రైతు సంక్షేమమే లక్ష్యం

రైతు సంక్షేమమే లక్ష్యం

కేంద్రం సహకరించక పోయినా రైతుకు మద్దతు ధర

రైతు పండించిన ప్రతి గింజా కొంటాం

జిల్లాలో 422 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

ఇప్పటికే రూ.44 కోట్లు రైతు ఖాతాల్లో జమ

ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

గజ్వేల్‌లో ధాన్యం, పత్తి కొనుగోలు, భూసార పరీక్షా కేంద్రం ప్రారంభం

గజ్వేల్‌: కేంద్రం రైతు వ్యతిరేక నిబంధనలు పెట్టినా రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గజ్వేల్‌లో శుక్రవారం ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను స్థానిక మార్కెట్‌ యార్డులో ప్రారంభించి మాట్లాడారు. సిద్దిపేట జిల్లాలో వరి సాగు విస్తీర్ణం బాగా పెరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 422 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వానకాలంలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 1,25,000 ఎకరాలు కాగా, ప్రాజెక్టులు, మిషన్‌ కాకతీయ పనుల వల్ల సమృద్ధిగా సాగునీరు అందుబాటులోకి రావడంతో 2,30,000 ఎకరాల్లో సాగైందన్నారు. రైతు పండించిన ధాన్యానికి మద్దతు ధర అందించడం కోసం గ్రామాల్లో  కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 34,686 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు జరుగగా, రూ.44 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు.  ఈ సారి సన్న రకం సాగు విస్తీర్ణం బాగా పెరిగిందన్నారు. కేంద్రం సహకరించక పోయినా క్వింటాలుకు రూ.1888 మద్దతు ధర అందిస్తున్నామన్నారు. మక్కలు ఇతర రాష్ర్టాల నుంచి పెద్ద మొత్తంలో రావడంతో స్థానికంగా పండించిన రైతుకు బహిరంగ మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించడం లేదని మంత్రి పేర్కొన్నారు. యాసంగి మక్కలతో రాష్ట్ర ప్రభుత్వానికి వెయ్యి కోట్లు నష్టం వచ్చినా  ఈ సారి కూడా మక్కలను కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్‌ చెప్పడంతో మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. జగదేవ్‌పూర్‌ మండలంలో త్వరలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు.

పత్తి 35 కేంద్రాల్లో కొనుగోలు..

జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం కూడా పెరుగడంతో సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు నిర్వహిస్తున్నామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. 9 మార్కెట్‌ యార్డుతో పాటు జిల్లాలోని 26 జిన్నింగ్‌ మిల్లుల్లో సీసీఐ కొనుగోలు చేస్తుందన్నారు. 8శాతం తేమ ఉన్న పత్తికి ప్రభుత్వ మద్దతు ధర వర్తిస్తుందని, రైతులు ఇంటి వద్దనే ఆరబెట్టుకుని రావాలని సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వ్యవసాయానికి నిరంతరం 24 గంటల విద్యుత్‌ సరఫరా, రైతుబంధు ద్వారా ఎకరానికి రూ.10వేలు రైతు బీమా తదితర సౌకర్యాలను అందిస్తుందన్నారు. ఇతర రాష్ర్టాల్లో మద్దతు ధరకు ప్రభుత్వాలు కొనుగోలు చేయకపోవడంతో రాష్ర్టానికి ధాన్యం వస్తుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వానికి నష్టం వచ్చినా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామన్నారు. ధాన్యం రీసైక్లింగ్‌ కాకుండా చూడాలని అధికారులకు సూచించారు. కేంద్ర రైతు వ్యతిరేక విధానాల వల్ల జరుగుతున్న పరిణామాలను ప్రజలకు వివరించాలన్నారు. రైతులకు మద్దతు ధర అందేవిధంగా కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు లేకుండా ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాలన్నారు. 

గజ్వేల్‌లో అధునాతన భూసార పరీక్షా కేంద్రం

గజ్వేల్‌లో అధునాతన సౌకర్యాలతో భూసార పరీక్షా కేం ద్రం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రూ.80 లక్షల వ్యయంతో ఏర్పాటయ్యే ఈ పరీక్షా కేంద్రం వచ్చే వానకాలానికి అందుబాటులోకి వస్తుందన్నారు. ఇందుకు అవసరమైన స్థలాన్ని సేకరించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ముట్రాజ్‌పల్లి వద్ద ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి అనుకూలంగా వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ను నిర్మించాలన్నారు. త్వరలో భూమి కేటాయించాలని ఆర్డీవో విజయేందర్‌రెడ్డికి సూచించారు. 

జగదేవ్‌పూర్‌కు 108 మొబైల్‌ వ్యాన్‌ 

ప్రజలకు వైద్య సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గజ్వేల్‌ మార్కెట్‌ యార్డులో శుక్రవారం జగదేవ్‌పూర్‌ మండలానికి 108 వాహనాన్ని కేటాయించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే 14 వాహనాలు  వైద్య సేవలందిస్తున్నాయన్నారు. ఇటీవల హుస్నాబాద్‌, దుబ్బాకకు 108 వాహనాలను కేటాయించినట్లు చెప్పారు. త్వరలో చిన్నకోడూరు, మర్కూక్‌, హుస్నాబాద్‌లోని అక్కన్నపేట ప్రాంతానికి 108 వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అక్కన్నపేట ప్రాంతంలో గిరిజనులకు వైద్య సేవలు మరింత అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు. కార్యక్రమాల్లో ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, అదనపు  కలెక్టర్‌ పద్మాకర్‌రావు, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ మాదాసు అన్నపూర్ణ, గడా ఓఎస్డీ ముత్యంరెడ్డి, నాయకులు లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్సీ రాజమౌళి, జడ్పీటీసీలు మల్లేశం, సుధాకర్‌రెడ్డి, ఎంపీపీ అమరావతి, దేవి రవీందర్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రావణ్‌కుమార్‌, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

మున్సిపాలిటీ కొత్త కార్యాలయ భవనాన్ని

 నెలరోజుల్లో పూర్తి చేయాలి

గజ్వేల్‌అర్బన్‌: గజ్వేల్‌ పట్టణంలో నిర్మిస్తున్న గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులను మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. కమిషనర్‌ కృష్ణారెడ్డి భవన నిర్మాణ పనుల గురించి మంత్రికి వివరించారు. భవన నిర్మాణానికి సంబంధించిన మ్యాప్‌ను మంత్రి పరిశీలించారు. నెల రోజుల్లో పనులన్నీ పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జకియొద్దీన్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ధరణి పోర్టల్‌ దేశానికే ఆదర్శం

ఆర్థిక శాఖ మంత్రి  హరీశ్‌రావు  

వర్గల్‌: ప్రజలకు అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ దేశంలోనే మొట్టమొదటిసారిగా ధరణి వెబ్‌సైట్‌ను ప్రవేశపెట్టి భూక్రయ, విక్రయాలకు నూతన శ్రీకారం చుట్టారని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మండల తహసీల్‌ కార్యాలయంలో జరుగుతున్న భూ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ..15 నిమిషాల వ్యవధిలోనే భూ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నారు. వెంటనే   ధ్రువీకరణ పత్రాలను జారీ చేయడమే కాకుండా సదరు కొనుగోలుదారులకు భూపట్టాదారు పాసుపుస్తకాలు వెంటనే ఇస్తున్నట్లు తెలిపారు. భూ కొనుగోలు, అమ్మకాలు, ఆన్‌లైన్‌  ప్రక్రియ  శరవేగంగా జరుగడందేశంలోనే రికార్డు అన్నారు. పాతకాల పద్ధతుల ద్వారా భ్రష్టుపోయిన రెవెన్యూ వ్యవస్థను సమూలంగా మార్చి నూతన ఒరవడికి నాంది పలుకడం టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం తీసుకున్న సంచలన నిర్ణయమన్నారు. నూతన ధరణి పోర్టల్‌ ద్వారా జరుగుతున్న రిజిస్ట్రేషన్లపై ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 501 రిజిస్ట్రేషన్లు జరుగగా, సాదాబైనామా కింద 44వేల 583 మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. అనంతరం భూ కొనుగోలుదారులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. మంత్రి తహసీల్దార్‌ వాణీరెడ్డి తదితరులు ఉన్నారు.


VIDEOS

logo