ఆదివారం 07 మార్చి 2021
Siddipet - Nov 12, 2020 , 00:15:31

అధైర్యపడొద్దు అండగా ఉంటాం

అధైర్యపడొద్దు అండగా ఉంటాం

రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు

దౌల్తాబాద్‌ : ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, దుబ్బాకలో ఓడినందుకు కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని, టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు మనో ధైర్యంతో ముందుకు వెళ్లాలని, భవిష్యత్‌ అంతా టీఆర్‌ఎస్‌ పార్టీదేనని రాష్ట్ర ఆర్థిశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేక దౌల్తాబాద్‌ మండల పరిధిలోని కోనాయిపల్లి గ్రామానికి చెందిన కొత్తింటి స్వామి యాదవ్‌ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్వామికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. కేవలం టీఆర్‌ఎస్‌ పార్టీ ఓడిపోయిందనే బాధతోనే ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు.. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి బుధవారం కోనాయిపల్లికి వెళ్లి బాధిత కుటుంబాన్ని మంత్రి పరామర్శించి ఓదార్చారు. మృతుడి కుటుంబానికి టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి రూ.2 లక్షల నగదు సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి, ఎంపీ, ఎఫ్‌డీసీ చైర్మన్‌ మృతుడి శవంపై గులాబీ జెండాను కప్పి నివాళులర్పించారు. అంత్యక్రియల్లో పాల్గొని పాడెను మోశారు. తలకొరివి పట్టిన తండ్రి మల్లయ్య యాదవుతో కలిసి వెళ్లి అంత్య క్రియల తర్వాత బొందపై మట్టిని వేశారు. అనంతరం రాష్ట్ర ఆర్థిశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు అధైర్య పడవద్దని సూచించారు. మనోధైర్యంతో ఉంటూ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. బీజేపీ గెలిచినంత మాత్రాన దుబ్బాకుకు ఒరిగేది ఏమి లేదన్నారు. 

ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా...

ఎన్నికల్లో ఓడినా, గెలిచినా.. ఎప్పటికీ టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల్లోనే ఉంటుందని, ఓటమికి ఆత్మహత్యలు పరిష్కారం కావని. టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మృతుడు స్వామి కుటుంబానికి పరామర్శించామని, ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు పార్టీ గెలిచినప్పుడూ పొంగిపోకుండా...ఓడినప్పుడూ కుంగిపోకుండా ఉంటూనే, పార్టీ దుబ్బాక ఉప ఎన్నికల ఓటమిపై లోటు పాట్లను సమీక్షించి సమన్వయంతో ముందుకు వెళ్తాతామని స్పష్టం చేశారు. అంత్యక్రియల్లో ఎంపీపీ గంగాధరి సంధ్య, టీఆర్‌ఎస్‌  మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్‌ గౌడ్‌, సర్పంచ్‌ సురేందర్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

VIDEOS

logo