సోమవారం 01 మార్చి 2021
Siddipet - Nov 12, 2020 , 00:16:18

దుద్దెడలో వ్యక్తి దారుణ హత్య

దుద్దెడలో వ్యక్తి దారుణ హత్య

ఇనుపరాడ్‌తో తలపై దాడి

ప్లాన్‌ ప్రకారమే హత్య చేశారని కుటుంబీకుల ఆరోపణ

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన గజ్వేల్‌ ఏసీపీ నారాయణ

కొండపాక : ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన మండలంలోని దుద్దెడ గ్రామంలో జరిగింది. బుధవారం తొగుట సీఐ రవీందర్‌ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేక శ్రీనివాస్‌ 12 ఏండ్ల కింద కుటుంబీకులతో సహా సిద్దిపేటకు వలస వెళ్లి వివేకానంద కాలనీలో నివాసముంటున్నాడు. సిద్దిపేటలోని ఓ దుకాణంలో గుమస్తాగా పని చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరి తిరిగి రాలేదు. ఫోన్‌ స్విచ్చాఫ్‌ వచ్చింది. బుధవారం ఉదయం దుద్దెడ రాజీవ్‌ రహదారి నుంచి రాంపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు పక్కన పత్తిచేనులో శ్రీనివాస్‌ మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో గజ్వేల్‌ ఏసీపీ నారాయణ, తొగుట సీఐ రవీందర్‌, కుకునూర్‌పల్లి ఎస్సై సాయిరాం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి తల, ముఖంపై బలమైన గాయాలు ఉన్నాయి. ఇనుపరాడ్‌తో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. క్లూస్‌ టీంను రప్పించి ఆధారాలను సేకరించారు. డాగ్‌స్కాడ్‌ను రప్పించగా, పోలీస్‌ జాగిలం ఘటనా స్థలంలో తిరిగి రాజీవ్‌ రహదారి వరకు వచ్చి ఆగింది. మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడికి భార్య రాజేశ్వరి, ఇద్దరు కొడుకులు రాజు, శివ ఉన్నారు. గ్రామస్తులు పెద్దసంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబీకులు, బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 

VIDEOS

logo