ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Siddipet - Nov 11, 2020 , 00:08:31

వ్యవసాయ పనుల్లో రైతులు బిజీబిజీ

వ్యవసాయ పనుల్లో రైతులు బిజీబిజీ

సాగుకు అనువుగా నల్లరేగడి నేలలు

యాసంగిలో జొన్న, శనగ 

పంటలు సాగు చేస్తున్న రైతులు 

రాయపోల్‌ : మండల కేంద్రంతోపాటు చుట్టు పక్కల గ్రామాల్లో యాసంగి పంటల సాగు ఊపందుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు మండలంలోని నల్లరేగడి భూములు పుర్తిగా తడిసి పంట సాగు చేయడానికి అనుకూలంగా మారాయి. మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో నల్లరేగడి భూములు అధికంగా ఉన్నాయి. రైతులు వానకాలంలో సాగు చేసిన మక్కజొన్న ఇతర పంటలు ఇప్పటికే కోతలు కోశారు. యాసంగి సీజన్‌లో శనగ, మక్కజొన్న పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురువడంతో వ్యవసాయ భూములు యాసంగి పంటలు సాగు చేయడానికి అనుకూలంగా మారడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ భూము లు తడిగా ఉండటంతో శనగ, జొన్న పంటలు విత్తుతున్నారు. రైతులందరూ పంటల సాగును ముమ్మరం చేయడంతో విత్తనాలు విత్తే ట్రాక్టర్లకు డిమాండ్‌ పెరిగింది. యాసంగి సీజన్‌లో తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించేందుకు రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటిస్తున్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో 300 ఎకరాల్లో పంటలను సాగు చేస్తున్నట్టు వ్యసాయాధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మండలంలోని ఆయా గ్రామాల రైతులు వ్యవసాయ సాగులో బిజీబిజీగా ఉన్నారు. చెరువులు, కుంటల వెనుక ఆరుతడి పంటలతోపాటు బోరులు ఉన్న రైతులు వరి సాగు చేయడానికి సిద్ధమవుతున్నారు. 

నాణ్యమైన విత్తనాలనే వాడాలి..

పంటల సాగు కోసం రైతు లు నాణ్యమైన విత్తనాలనే వాడాలి. నాసిరకం కంపెనీల విత్తనాలను వాడి గతంలో చాలా మంది రైతులు నష్టపోయారు. యాసంగి సీజన్‌లో విత్తనాలు నాటే ముందే వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేస్తే సమస్యలు రావు. రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందజేశాం. రైతులు సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి. పంటల సాగులో మెళకువలను తప్పకుండా పాటించాలి. 

- వెంకటరమణి, వ్యవసాయాధికారి  

VIDEOS

logo