బుధవారం 03 మార్చి 2021
Siddipet - Nov 11, 2020 , 00:08:25

యంత్రాలతోనే ఎవుసం పని..

యంత్రాలతోనే ఎవుసం పని..

కూలీల కొరతతో.. యంత్రాల వాడకంపై రైతుల దృష్టి

గజ్వేల్‌ :  వ్యవసాయానికి యంత్రాల వాడకం తప్పనిసరి అవుతోంది. రాష్ట్రంలో సాగు నీరు ప్రాజెక్టుల వల్ల సమృద్ధిగా అందుబాటులోకి రావడంతో సాగు విస్తీర్ణం పెరుగడం, ఉన్న పొలంలో ఎక్కు వ పంటలు సాగు కావడం, స్వల్పకాలిక రకాలు అందుబాటులోకి రావడంతో పాటు వాణిజ్య పంటల సాగు పెరుగడం లాంటి పరిణామాల వల్ల వ్యవసాయంలో యంత్రాల పనులు ముమ్మరమయ్యాయి. మనషుల పని, పశువుల సంఖ్య తగ్గడంతో దుక్కిదున్నడానికి, వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేయడానికి ట్రాక్టర్ల వాడకం పెరిగింది. ప్రతి మారు మూల పల్లెలో ట్రాక్టర్లు ఇతర వ్యవసాయ యంత్ర పరికరాలు కనిపిస్తున్నాయి. వరికోత యంత్రాలు, నాటు యంత్రాలు, గడ్డ కట్టలు కట్టే యంత్రాల కొనుగోలుపై రైతులు పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చిస్తున్నారు. అద్ద్దె యంత్రాలు సమయానికి అందుబాటులో ఉండక పోవడం, అద్ద్దె ఖర్చు అధికం కావడంతో చిన్న మధ్య తరగతి రైతు కూడా ట్రాక్టర్‌ను ఇతర వ్యసాయ యంత్రాలను కొనుగోలు చేస్తున్నారు. కొన్ని నెలలుగా ట్రాక్టర్ల కొనుగోళ్లు బాగా పెరిగినట్లు వ్యాపారులు చెప్తున్నారు. ప్రభుత్వం రాయితీపై ట్రాక్టర్లు, పనిముట్లు, హర్వేస్టర్లు రైతులకు అందజేస్తుండటంతో వ్యవసాయ యాంత్రీకరణ వేగంగా ముందుకు సాగుతోంది. 

ఏటా లక్షకు పైగా కిరాయిలు  

 మాకున్న రెండెకరాలకు మరో ఆరెకరాలు కౌలుకు తీసుకుని వరి, కూరగాయ పంటలు సాగు చేస్తున్నాం. ఎటా లక్షకు పైగా ట్రాక్టర్లకు కిరాయిలు అవుతున్నాయి. సమయానికి  కిరాయి ట్రాక్టర్‌ రాదు. సొంత ట్రాక్టర్‌ ఉంటే ఎవుసం మరింత సాఫీగా సాగుతుందని నెల కింద ట్రాక్టర్‌ కొన్నాం. వానకాలం కిరాయి పెట్టి దున్నించుకున్నాం. ఈ పంట నుంచి మాట్రాక్టర్‌తోనే వ్యవసాయం చేస్తున్నాం. కిరాయి పైసలు కిస్తీ కడితే ట్రాక్టర్‌ అప్పు తీరుతుంది. ఈ మధ్య కిరాయిలు బాగా పెంచిండ్రు. 

-బొనగిరి యాదగిరి, రైతు 

VIDEOS

logo