బుధవారం 24 ఫిబ్రవరి 2021
Siddipet - Nov 10, 2020 , 01:02:01

ఉత్కంఠకు తెర

ఉత్కంఠకు తెర

నేడు దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 

గెలుపు ధీమాలో టీఆర్‌ఎస్‌

కొవిడ్‌-19 నిబంధనలతో కౌంటింగ్‌కు ఏర్పాట్లు

14 టేబుళ్లు.. 23 రౌండ్లు..

ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం

12 గంటలకల్లా తుది ఫలితం వచ్చే అవకాశం

విధుల్లో 350 మంది ఉద్యోగులు

357 మంది పోలీస్‌ సిబ్బందితో పటిష్ట బందోబస్తు  

పాస్‌లున్న వారికే లోపలికి అనుమతి 

పరిశీలించిన ఉన్నతాధికారులు

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: ఎంతో ఉత్కంఠ నెలకొన్న దుబ్బాక శాసనసభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మంగళవారం (నేడు) జరుగనున్నది. దీనికి యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సిద్దిపేటలోని ఇందూర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కాను న్నది. మొదటగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తారు. తదుపరి ఈవీఎంల లెక్కింపు ప్రారంభవుతున్నది. ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీతో సహా మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 350 మంది వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొననున్నారు. 357 మంది పోలీస్‌ సిబ్బందితో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. సోమవారం ఎన్నికల సాధారణ పరిశీలకుడు శ్యామ్లా ఇక్బాల్‌, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ భారతీ హోళికేరి, పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌, సిద్దిపేట అదనపు కలెక్టర్‌ పద్మాకర్‌, రిటర్నింగ్‌ అధికారి చెన్నయ్యతో కలిసి ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని సోమవారం సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పాస్‌లున్న వారికి మాత్రమే లోపలికి అనుమతి ఇస్తారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోపలికి అనుమతిస్తారు. ఇందుకోసం మెటల్‌ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇలా... 

తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారు. కౌంటింగ్‌ ప్రారంభానికి ముందు ప్రిసైడింగ్‌ అధికారి సంతకం ఉన్న 17సీ ఫారం వివరాలను రాజకీయ పార్టీల ఏజెంట్లకు తెలియజేస్తారు. 8.30గంటలకు ఈవీఎంల కౌంటింగ్‌ను ప్రారంభించనున్నారు. ఈవీఎంల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాగానే, పోలైన ఓట్ల వివరాలు ఈవీఎంల వారీగా నమోదు చేసి వివరాలతో పోలైన ఓట్లు, ఈవీఎంలో వచ్చిన ఓట్లు సమానంగా ఉన్నాయా లేదా సరిచూసుకుంటారు. వాటిని నోట్‌ చేసుకొని ఏజెంట్లకు చూపి సంతకాలు తీసుకుంటారు. అనంతరం ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంల సీల్‌ తీసి రిజల్ట్‌ బటన్‌ నొక్కుతారు. దీంతో ఏఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో రికార్డు చేసి రిటర్నింగ్‌ అధికారికి అందించి ఫలితాలను ప్రకటించనున్నారు. కౌంటింగ్‌ పూర్తయిన అనంతరం అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో వీవీప్యాట్‌లోని ముద్రిత ఓటరు స్లిప్పులను లెక్కించనున్నారు. 10 నుంచి 20 నిమిషాల్లో ఒక్కో రౌండ్‌ లెక్కింపు ముగిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12 గంటలకల్లా తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల నిఘాలో జరుగనున్నది. మీడియా కోసం ప్రత్యేకంగా గ్యాలరీని ఏర్పాటు చేశారు.


పార్కింగ్‌ ప్రదేశాలు.. 

మీడియా, ప్రజాప్రతినిధులు, ఎలక్షన్‌ ఏజెంట్లు, పోలీసు సిబ్బంది, కమిషనర్‌ కార్యాలయం వెనుక సైడ్‌ వాహనాలు పార్కింగ్‌ చేసుకోవాలి. 

ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులు ఇందూర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల మెయిన్‌ గేట్‌ నుంచి లోనికి వచ్చి అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్‌ వద్ద వాహనాలు పార్కింగ్‌ చేసుకోవాలి. 

వీఐపీలు ఇందూర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన ప్రెస్‌ గ్యాలరీ పక్కన వాహనాలు పార్కింగ్‌ చేసుకోవాలి. 

ట్రాఫిక్‌ డైవర్షన్‌ పాయింట్స్‌..  

పొన్నాల నుంచి వచ్చే ప్రజలు, పొన్నాల గ్రామంలో నుంచి రాజీవ్‌ రహదారి రోడ్డుపై నుంచి సిద్దిపేటకు వెళ్లాలి. 

సిద్దిపేట నుంచి పొన్నాల గ్రామానికి వచ్చే ప్రజలు పొన్నాల దాబాల మీదుగా రాజీవ్‌ రహదారిపై నుంచి పొన్నాలకు వెళ్లాలి. 

 పోలీస్‌ కమిషనర్‌ సూచనలివి.. 

సిద్దిపేట పట్టణంలో కూడా పోలీసు పికెట్స్‌ ఏర్పాటు   

పిక్‌ అప్‌ టీమ్స్‌ అధికారులు, సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలి. 

మీడియా, ప్రజాప్రతినిధులు, ఎలక్షన్‌ ఏజెంట్లు, పోలీసు సిబ్బంది, ఇందూర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల గెస్ట్‌హౌస్‌ పక్కన ఉన్న వెనుక దారి నుంచి డీఎఫ్‌ఎండీ ద్వారా తనిఖీ చేసి, అక్కడే మాస్క్‌లు, శానిటైజర్‌ పెట్టుకున్న తర్వాత లోపలికి అనుమతిస్తారు. 

ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియా వారు సిద్దిపేట పోలీసు కమిషనర్‌ కార్యాలయం పక్కన ఇందూర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల వెళ్లడానికి ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆర్వో జారీ చేసిన పాసులను తనిఖీ చేసి లోపలికి పంపిస్తారు. 

వీఐపీలు, ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులు ఇందూర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల మెయిన్‌ గేట్‌ నుంచి లోపలికి పంపుతారు. 

పోలింగ్‌ ఏజెంట్లు, పోలింగ్‌ అధికారులు తప్పనిసరిగా ఆర్వో జారీ చేసిన ఐడెంటిటీ కార్డు తీసుకొని రావాలి. ఐడెంటిటీ కార్డు డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులకు చూపించి లోనికి వెళ్లాలి. 

ఆర్వో జారీచేసిన ఐడెంటిటీ కార్డు, పాసు లేకుండా లోపలికి ప్రవేశం లేదు. 

కౌంటింగ్‌ కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఆర్వోకు వెంటనే తెలుపాలి

కౌంటింగ్‌ కేంద్రంలోనికి వెళ్లే పోలింగ్‌ అధికారుల, ఏజెంట్ల వద్ద మొబైల్‌ ఫోన్‌ ఉండకూడదు. 

ఇందూర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల చుట్టుపక్కల నలుదిక్కుల బందోబస్తు ఏర్పాటు చేశాం. 

పోలీసు అధికారులు సిబ్బందితో క్రమశిక్షణతో పారదర్శకంగా విధులు నిర్వహించాలి. 

కౌంటింగ్‌ సెంటర్‌ వద్ద చుట్టుపక్కల, జిల్లాలో సిటీ పోలీసు యాక్టు అమలులో ఉంది. 

కౌంటింగ్‌ సెంటర్‌, చుట్టూ 500 మీటర్ల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమల్లో ఉంది. 

ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా తిరుగవద్దు.

పార్టీ జెండాలు పార్టీ గుర్తులు ప్ల్లకార్డ్సు ధరించొద్దు ప్రదర్శించవద్దు.

మైకులు, లౌడ్‌స్పీకర్లు వాడరాదు. పాటలు ఉపన్యాసాలు ఇవ్వకూడదు.

గెలుపొందిన పార్టీ నాయకులు ర్యాలీలు, సభలు సమావేశాలు, విజయోత్సవ ర్యాలీ నిర్వహించడానికి అనుమతి లేదు.

ధర్నాలు, రాస్తారోకోలు, ఊరేగింపులు, పటాకులు  లాంటివి నిర్వహించడం నేరంగా పరిగణించడంతోపాటు సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

ప్రజలు, ప్రజాప్రతినిధులు పోలీసుల అధికారుల సలహాలు, సూచనలు, పాటించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్‌ జరిగేలా సహకరించాలి.

సిద్దిపేట పట్టణ సమీపంలోని ఇందూర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా  అధికారులు, సిబ్బందికి బందోబస్తు గురించి సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ సోమవారం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు అధికారులు, సిబ్బంది అందరూ క్రమశిక్షణతో విధులు నిర్వహించినందున ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. కౌంటింగ్‌ బందోబస్తును 7 సెక్టార్లుగా విభజించామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా  357 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటారని తెలిపారు. వీరిలో ఏసీపీలు 6, సీఐలు 18, ఎస్సైలు 38, ఏఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుళ్లు 16, మహిళా కానిస్టేబుళ్లు, మహిళా హోంగార్డులు 50, కానిస్టేబుళ్లు, హోంగార్డులు 229 ఉన్నారన్నారు. బీడీ టీమ్స్‌, మఫ్టీ పార్టీ టీమ్స్‌, సిద్దిపేట పట్టణంలో కౌం టింగ్‌ సెంటర్‌ పరిసర ప్రాంతాల్లో పికె ట్స్‌, టియర్‌ గ్యాస్‌ 2 టీమ్స్‌, కౌం టింగ్‌, కేంద్రం, పరిసర ప్రాంతాల్లో రూప్‌ టాప్‌ అబ్జర్వేషన్‌ టీమ్స్‌తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్‌ తెలిపారు. పోలీసు అధికారులు, సిబ్బంది ఉదయం 4గంటలకు మీకు కేటాయించిన స్థలంలో ఉండాలని సూచించారు. కౌంటింగ్‌ సెంటర్‌లో విధులు పోలీసు అధికారులు, సిబ్బంది సెల్‌ఫోన్‌ తీసుకొని లోనికి వెళ్లకూడదన్నారు. పోలింగ్‌ కేంద్రంలోనికి అగ్గిపెట్టెలు, సిగిరేట్లు, ఇతర విధ్వంసకర పరిసరాలను వెంట అనుమతించరాదన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ప్రజలు, నాయకుల అనుచరులు గుంపులుగా చేరకుండా చూడాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అనుమతిలేని వాహనాలను పోలింగ్‌ కేంద్రంలోనికి పంపకూడదన్నారు. ప్రతిఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం విధులు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో దుబ్బాక ఉప ఎన్నికల పోలీసు నోడల్‌ అధికారి ఏసీపీ బాలాజీ, సిద్దిపేట ఏసీపీ విశ్వప్రసాద్‌, హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్‌, సీసీఎస్‌ ఏసీపీ సురేంద్ర, గజ్వేల్‌ ఏసీపీ నారాయణ, సిద్దిపేట రూరల్‌ సీఐ సురేందర్‌రెడ్డి, సిద్దిపేట టుటౌన్‌ సీఐ పరశురామ్‌గౌడ్‌, హుస్నాబాద్‌ సీఐ రఘుపతిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. 

VIDEOS

logo