సశక్తీ కరణ్ అవార్డు గ్రహీతలకు నగదు పురస్కారం

పురస్కారాలు అందజేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
సిద్దిపేట రూరల్ : ఉత్తమ గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 16న ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తీ కరణ్ అవార్డుకు సిద్దిపేట రూరల్ మండలం పెద్దలింగారెడ్డిపల్లి ఎంపికైన విషయం తెలిసిందే. అయితే సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా చేతుల మీదుగా రూ.8 లక్షల నగదు పురస్కారాన్ని సర్పంచ్ తౌటి ఉదయశ్రీ తిరుపతి, పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి అందుకున్నారు. అనంతరం పెద్దలింగారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ ఉదయశ్రీని మంత్రి ఎర్రబెల్లి శాలువాతో సన్మానించారు.
గుర్రాలగొందికి నగదు పురస్కారం
నారాయణరావుపేట : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సశక్తీ కరణ్ అవార్డుకు నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామం ఎంపికయ్యింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా చేతుల మీదుగా రూ.8 లక్షల నగదు పురస్కారాన్ని సర్పంచ్ ఆంజనేయులు అందుకున్నారు. అనంతరం సర్పంచ్‌ను మంత్రి ఎర్రబెల్లి శాలువాతో సన్మానించారు.