శుక్రవారం 05 మార్చి 2021
Siddipet - Nov 09, 2020 , 00:37:22

విద్య, ఆధ్యాత్మిక రంగాల్లో హరినాథ్‌ శర్మ సేవలు గొప్పవి

విద్య, ఆధ్యాత్మిక రంగాల్లో హరినాథ్‌ శర్మ సేవలు గొప్పవి

హరినాథ్‌ శర్మను ఘనంగా సన్మానించిన మంత్రి హరీశ్‌రావు 

కొండపాక : విద్యారంగ అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక పరిమళాలను అందించడంలో విశేష కృషి చేసిన మర్పడగ విజయదుర్గా క్షేత్ర నిర్వాహకులు, అధ్యాపకులు డాక్టర్‌ చెప్పెల హరినాథశర్మ సేవలు ఎనలేనివని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గజ్వేల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగ అధ్యాపకులుగా పని చేసిన హరినాథ్‌శర్మ ఇటీవలే ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆదివారం కొండపాక మండలంలోని మర్పడగ విజయదుర్గ క్షేత్రంలో ఉద్యోగ విరమణ అభినందన సభ ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి హరినాథ్‌శర్మ దంపతులను ఘనంగా సన్మానించి మాట్లాడారు. నిస్వార్థంగా విద్యాభివృద్ధికి కృషి చేసి, తాను పని చేసిన కళాశాలల్లో విద్యార్థులకు మంచి బోధన అందించడానికి వసతుల కల్పనకు ప్రత్యేక కృషి చేశారన్నారు. అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన హరినాథ్‌శర్మ ఉద్యోగుల సమస్యలను, కళాశాలల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను నిరంతరం తన దృష్ట్టికి తీసుకొచ్చి పరిష్కరించుకునేవారన్నారు. ఆధ్యాత్మికతను ప్రజలకు చేరువ చేయడంలో భాగంగా తన జీతం డబ్బులతో జీర్ణ దేవాలయాన్ని పురుద్ధరించి, ఆలయ అభివృద్ధితో పాటు ఈప్రాంత ఆధ్యాత్మికతను పెంపొందించడానికి గొప్ప కృషి చేశారన్నారు. హరినాథ్‌శర్మ ఉద్యోగ విరమణ పొందినప్పటికీ, సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. ఉద్యోగ విరమణ పొందిన హరినాథ్‌ శర్మ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర ఏర్పాటుకు దైవకృప ఉండాలని సీఎం కేసీఆర్‌ మర్పడగ క్షేత్రంలో నిర్వహించిన శత చండీయాగాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఎన్ని ఒడి దొడుకులు వచ్చినా దృఢ సంకల్పంతో ముందుకు సాగితే ప్రతి ఒక్కరికీ విజయం సిద్ధిస్తుందన్నారు. మంత్రి హరీశ్‌రావు అందించిన సహకారంతో విద్య, ఆధ్యాత్మిక రంగాల్లో సేవ చేయగలిగానన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్‌, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ రాజేశంగౌడ్‌, గజ్వేల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి, మర్పడగ సర్పంచ్‌ ఏమల్ల రజితారాజిరెడ్డి, నాయకులు అయోధ్యరెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు రాధాకృష్ణశర్మ, సిద్దిపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాల సాయిరాం, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు విజయదుర్గ ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.  

బొడ్రాయి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి

మిరుదొడ్డి : పాడి పంటల సమృద్ధిగా పండి రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా ఎదిగేలా భగవంతుడు చల్లగా చూడాలని  మంత్రి హరీశ్‌రావు వేడుకున్నారు. మిరుదొడ్డిలో ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు గ్రామంలోని అన్ని కులాలకు చెందిన ప్రజలు బొడ్రాయి అమ్మవారి రెండో వార్షికోత్సవంతో పాటు గ్రామ దేవతల ఉత్సవాలను నిర్వహించారు. ఆదివారం గ్రామస్తులు వన భోజనాలను వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌తో కలిసి బొడ్రాయి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం టీఆర్‌ఎస్‌ నేత తోట కమలాకర్‌రెడ్డి మంత్రికి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. తోట కమలాకర్‌రెడ్డి ఏర్పాటు చేసిన వన భోజనాల్లో మంత్రి పాల్గొని భోజనం చేశారు. కార్యక్రమంలో సిద్దిపేట సూడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ గజ్జెల సాయిలు, పీఏసీఎస్‌ చైర్మన్‌, డీసీసీబీ డైరెక్టర్‌ బక్కి వెంకటయ్య, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత సూకురి లింగం, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు లింగాల వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు తుమ్మల బాల్‌రాజు, మాజీ ఎంపీపీ భాస్కరాచారి, రంగమైన రాములు, కాలేరు శ్రీనివాస్‌, పిట్ల సత్యనారాయణ పాల్గొన్నారు. 

VIDEOS

logo