గురువారం 25 ఫిబ్రవరి 2021
Siddipet - Nov 05, 2020 , 00:27:40

మది దోచేలా మర్కుక్‌ ఠాణా

మది దోచేలా మర్కుక్‌ ఠాణా

రాష్ర్టానికే రోల్‌ మోడల్‌గా మర్కూక్‌ పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణం

రూ,14 కోట్లతో సకల హంగులు

రాష్ట్రంలోనే వినూత్న నిర్మాణం

త్వరలోనే ప్రారంభించనున్న సీఎం  కేసీఆర్‌

మర్కూక్‌ : మండల కేంద్రంలో ఆధునిక సదుపాయాలు సకల హంగులతో దర్పంలా నిర్మిస్తున్న ఠాణా నిర్మాణం చివరి దశకు చేరుకుంది. సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశంతో వినూత్న రీతిలో నిర్మిస్తున్న ఈ ఠాణాలో పనులు తుదిదశకు చేరుకున్నాయి. త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు సర్వం ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటైన క్రమంలో  మ్యుమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో సిద్దిపేట జిలాల్లోని మర్కూక్‌ గ్రామాన్ని ప్రత్కేక మండలంగా గెజిట్‌ విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎర్రవల్లితోపాటు మరో 15 గ్రామాలను కలుపుతూ మర్కుక్‌ను కొత్త మండలంగా ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామంలోనే ఓ అద్దె భవనాన్ని లీజుకు తీసుకొని తాత్కాలికంగా పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌ను నిర్మించడానికి పోలీస్‌శాఖ ఉన్నత అధికారులతో ప్రతిపాదనలు సిద్ధం చేయించారు. దీంతో రాష్ట్రంలోనే మరెక్కడా లేని విధంగా మర్కూక్‌లో పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది.

రూ.14 కోట్లతో సకల హంగులు

మర్కూక్‌ మండంలోని శివారు వెంకటాపూర్‌ గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూమి 8 ఎకరాల 35 గుంటల్లో పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణం రూపుదిద్దుకుంది. ఈ ప్రాంతం మండలంలోని మిగతా 15 గ్రామపంచాయతీలకు మధ్యలో ఉంటుందన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ శాఖ ఉన్నత అధికారి తెలిపారు. రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో రూ.14 కోట్లతో సిబ్బందికి వసతి, ప్రత్యేక విచారణ గది, విడిది గది, విశాలమైన ఆవరణ, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర అధునాతన వసతులతో నిర్మించారు.

సమీకృత భవన సమ్మేళనం

నూతన మండలంలో ఆయా గ్రామాల ప్రజలు పోలీస్‌ సేవలతోపాటు, రైతు వేదిక నిర్మాణం, సామూహిక కల్యాణ మండపం, మోడల్‌ స్కూల్‌ తదితర ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండడంతో నిత్యం వివిధ పనుల కోసం వచ్చే వారికి మర్కూక్‌ పోలీస్‌స్టేషన్‌ ఒక సమీకృత అవసరాల కేంద్రంగా మారింది. నేరస్తుల విచారణకు ప్రత్యేక భవనం, పైఅంతస్తులో అధికారులతో మాట్లాడేందుకు కాన్ఫరెన్స్‌హాలు అలాగే అన్ని గ్రామాల్లో ఉన్న సీసీ కెమెరాలను అనుసంధానం చేసి, ఎప్పటికప్పుడు శాంతి భద్రతల పరిరక్షణను తెలుసుకునేందుకు మరో భవనం కూడా నిర్మించారు. మహిళా సిబ్బందికి కూడా ప్రత్యేక భవనం నిర్మించారు. రోడ్డుకు ఎడమ వైపున ఎస్సై, సిబ్బందికి నివాస సముదాయాన్ని నిర్మించారు. ఇందులో దాదాపు వంద మందికి పైగా సరిపడా పడకలను ఏర్పాటు చేశారు. 50 మరుగుదొడ్లను నిర్మించారు. 

త్వరలోనే అందుబాటులోకి వస్తుంది.. 

 ఆధునిక హంగులు, సకల వసతులతో రూపు దిద్దుకుంటున్న మర్కూక్‌ మోడల్‌ పోలీస్‌స్టేషన్‌ నిర్మాణ పనులు తుదిదశకు చేరాయి. మంచి ముహుర్తాన సీఎం కేసీఆర్‌ ప్రారంభించేందుకు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సిబ్బందితోపాటు ఇతర భవన సముదాయాలు కూడా పూర్తికావచ్చాయి. మర్కూక్‌ పోలీస్‌ ఠాణా అంటేనే.. దర్పంలా మారనున్నది. త్వరలోనే అందుబాటులోకి రానున్నది.     - ఎస్సై శ్రీశైలంయాదవ్‌  (మర్కూక్‌ పోలీస్‌స్టేషన్‌) 

VIDEOS

logo