దుబ్బాక మున్సిపాలిటీలో సజావుగా పోలింగ్

ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు
గంట గంటకూ పెరిగిన పోలింగ్ శాతం
ఆసక్తి కనబర్చిన దివ్యాంగులు, వృద్ధులు, యువకులు
దుబ్బాక టౌన్ : దుబ్బాక మున్సిపాలిటీలో ఉప ఎన్నికల పోలింగ్ సజావుగా ముగిసింది. మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో ఓటర్లు రావడంతో గంట గంటకు పోలింగ్ శాతం పెరిగింది. మున్సిపల్ పరిధిలోని దుంపలపల్లిలో ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ కొంత ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ తర్వాత పోలింగ్ సజావుగా కొనసాగింది. ఉప ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు, దివ్యాంగులు, వృద్ధులు, యువకులు ప్రత్యేక ఆసక్తిని కనబర్చారు. దూర ప్రాంతాలకు చెందిన వారు సైతం సాయంత్రంలోగా తమ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ధర్మాజీపేటలోని 30వ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడన్న అనుమానంతో పోలింగ్ కేంద్రం బైట రాజకీయ పార్టీల నాయకులు గొడవకు దిగారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దుబ్బాక మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్
నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకతోపాటు లచ్చపేటలోని పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్, సిద్దిపేట కలెక్టర్ భారతీ హోళికేరి సందర్శించారు. పోలింగ్ సరళిని సిబ్బంది ద్వారా అడిగి తెలుసుకున్నారు. కొవిడ్-19 నిబంధనల మేరకు ప్రతి ఓటరుకు థర్మల్ స్క్రీనింగ్ చేసి శానిటైజర్ అందిస్తూ చేతికి గ్లౌజ్‌లను ఇవ్వడం, సామాజిక దూరం పాటించేలా తీసుకున్న చర్యలపై ఎన్నికల అధికార యంత్రాంగం పని తీరును కలెక్టర్ అభినందించారు. లచ్చపేటలోని ఎన్నికల స్ట్రాంగ్ రూంను సందర్శించిన కలెక్టర్ ప్రతి రెండు గంటలకు పోలింగ్ శాతం నివేదికలు పంపాలని, స్ట్రాంగ్ రూంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ బోర్డులో పోలింగ్ కేంద్రాల వారీగా నియోజకవర్గంలోని 104 కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. దుబ్బాకలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును సీపీ జోయల్ డెవిస్ సమీక్షించారు. ఆర్వో చెన్నయ్య, ఎన్నికల నోడల్ అధికారి జయచంద్రారెడ్డి ఉన్నారు.
ఓటు వేసిన మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు..
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు గన్నె వనిత భూంరెడ్డి స్వగ్రామమైన దుబ్బాకలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగిలిన 19 వార్డుల్లో ఆయా కౌన్సిలర్లు తమ తమ వార్డుల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తాజావార్తలు
- రానా తమ్ముడు హీరోగా వచ్చేస్తున్నాడు!
- రూ.45వేల దిగువకు బంగారం ధర.. అదేబాటలో వెండి
- రియల్టర్ దారుణం : పెండ్లి పేరుతో కూతురు వయసున్న మహిళపై లైంగిక దాడి!
- వెంకీ-మీనా ‘దృశ్యం 2’ షురూ అయింది
- కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచేది లేదు : ఇఫ్కో
- ఇంటి రుణంపై రూ.4.8 లక్షల ఆదా.. ఎలాగంటే..!
- రియల్టర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీవో
- కొత్త కారు కొంటున్న జూనియర్ ఎన్టీఆర్.. ధరెంతో తెలుసా?
- ఒకే ప్రాంతం..ఒకే రోజు.. 100 సఫారీలు డెలివరీ
- శివసేన నేతలతో ప్రాణ హాని : సుప్రీంకోర్టులో బాలీవుడ్ క్వీన్ పిటిషన్