ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Siddipet - Nov 03, 2020 , 00:13:50

కర్షకుల కుత్తుకపై కేంద్రం కొత్త కత్తి

కర్షకుల కుత్తుకపై కేంద్రం కొత్త కత్తి

రైతు నోట్ల మట్టి కొట్టేలా కేంద్ర వ్యవసాయ బిల్లు..!

కార్పొరేట్‌ చేతుల్లోకి వ్యవసాయరంగం 

వ్యవసాయ రంగం, మార్కెట్‌ వ్యవస్థ  పూర్తిగా నిర్వీర్యమయ్యే ప్రమాదం

ప్రజాపంపిణీ వ్యవస్థ ఇక కనుమరుగేనా?

కార్పొరేట్‌ సంస్థలతో సామాన్య రైతు పోరాటం చేయగలడా?

కేంద్ర వ్యవసాయ బిల్లుపై రైతులు, రైతు నాయకుల ఆగ్రహం

రైతుల గొంతు నొక్కడమే.. ఇదే పెద్ద కుట్ర అంటున్న రైతులు

ఆందోళన వ్యక్తం చేస్తున్న ‘రైతు రక్షణ సమితి’

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులతో దేశవ్యాప్తంగా రైతాంగం ఆందోళన చేస్తున్నది. ప్రధానం రైతుల ధర్నాతో ఉత్తర భారతదేశం అట్టుడుకుతున్నది. కార్పొరేట్‌ కంపెనీలు నేరుగా రైతులతో కాంట్రాక్టు వ్యవసాయ ఒప్పందాలు చేసుకునే ఈ బిల్లులతో రైతులకు, వినియోగదారులకు కష్టాలు ఎదు రు కానున్నాయని సర్వత్రా విమర్శ వ్యక్తమవుతున్నది. ఈ బిల్లులతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశన్నంటనున్నాయి. సామాన్య రైతులకు అందుబాటులో నిలిచే మార్కెట్‌ కమిటీలు నిర్వీర్యం కానుండటంతో రైతాంగం ఆందోళన బాట పట్టింది. ఏవైనా వివాదాలు తలెత్తితే, పరిష్కార మార్గాలను మరింత జఠిలం చేసేలా కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లు ఉంది. జిల్లా స్థాయిలో పరిష్కారాలు చేసుకోవాలనడం రైతుల గొంతు నొక్కడమే. ఇదే పెద్ద కుట్ర అని చెప్పాలి. ఓ సామాన్య రైతు బడా కార్పొరేట్‌ సంస్థతో న్యాయపోరాటం చేయగలడా..? ఇవన్నీ సాధ్యమా..? కొత్త వ్యవసాయ బిల్లు ప్రకారం రైతులను కార్పొరేట్‌ ఇష్టారాజ్యానికి వదిలేసి, కేంద్రం తన కనీస బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు కనిపిస్తున్నది. ప్రభుత్వం నిత్యావసరాలను నిల్వ చేసి ఎఫ్‌సీఐ లాంటి సంస్థలు, తాజాగా కేం ద్రం ప్రవేశపెట్టిన బిల్లులతో కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఫలితంగా ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే మోడీ ప్రభు త్వం లక్ష్యంగా కనిపిస్తోందని రైతు నాయకులు ఆరోపిస్తున్నారు.అందుకే ఈ బిల్లుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


కార్పొరేట్‌ కంపెనీల కొమ్ముకేనా..?

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ కంపెనీల కొమ్ము కాస్తున్నదన్న ఆరోపణలు రైతాంగంలో బలంగా ఉన్నాయి. కార్పొరేట్‌ కంపెనీ నేరుగా రైతులతో కాంట్రాక్టు వ్యవసాయ ఒప్పందాలు చేసుకునే బిల్లుతో రైతులు, వినియోగదారులకు ఎన్నో నష్టాలు ఎదురురయ్యే అవకాశముందని, నిత్యావసర వస్తువులు ఎంత మొత్తంలోనైనా నిల్వ చేసుకునేందుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తున్నదని, కార్పొరేట్‌ శక్తులు కృత్రిమ కొరతను సృష్టించి, వినియోగదారుల నడ్డి విరుస్తారని, దీంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశన్నంటుతాయని అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో వచ్చే లాభం రైతులకు కాకుండా కార్పొరేట్‌ వ్యవస్థ జేబుల్లోకి వెళ్తుందని, వందశాతం ధరలు పెరిగే వరకు నిత్యావసర వస్తువుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకునే వీలు లేదు. ఈ బిల్లు ఎవరి ప్రయోజనాల కోసం..? ఐదెకరాల లోపు వ్యవసాయ కమతాలు ఉన్న రైతులే దేశంలో 86 శాతం మంది, తెలంగాణలో 92.50 శాతం మంది ఉన్నారు. వాళ్లు ఇప్పటి వరకు ఎన్నడైనా తమ పంటలను నిల్వ చేసుకున్నారా? కల్లాల వద్దనే పంటలు అమ్ముకొని అవసరాలు తీర్చుకునే రైతులు, కొత్త వ్యవసాయ బిల్లుతో తమ పంటలను ఎక్కువ కాలం నిల్వ చేసుకొని, దేశంలో ఎక్కడైనా అమ్ముకొని లాభపడుతారని చెప్పడం పూర్తిగా వాస్తవ దూరమని రైతు నాయకులు పేర్కొంటున్నారు. కేంద్రం ఇప్పటి వరకు దేశంలో 23 పంటలకు మాత్రమే కనీస మద్దతు ధర నిర్ణయిస్తోంది. వాటిలో కూడా అన్ని పంటలను సేకరించడం లేదు. దేశంలో పండిన గోధుమ, వరిలో 6శాతం మాత్రమే ప్రభుత్వం సేకరిస్తోందని 2015 జనవరి 12న శాంతాకుమార్‌ కమిటీ తన నివేదికలో వెల్లడించింది. ఇప్పుడు ఈ బిల్లుతో కేంద్రం పూర్తిగా మద్దతు ధరల విధానానికి తిలోదకాలు ఇస్తోంది. కనీస మద్దతు ధరలు నిర్ణయించడానికి అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించడం కోసం కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ రమేశ్‌చంద్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ 2015 ఆగస్టు 2న ఇచ్చిన నివేదికలో ఎన్నో లోపాలను ఉటంకిస్తూ 23 సిఫారసులు చేసింది. ఇందులో రైతుకు ఉపయోగపడే ఏ ఒక్క సిఫారసును అమలు చేయలేదనే ఆరోపణలున్నాయి. 

ఇక చెక్‌పోస్టులు అనవసరం

వ్యవసాయ ఉత్పత్తుల రవాణాలో అక్రమాలను నివారించడానికి ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టులు మూతపడినట్లే. రైతులు, వ్యాపారులు ఎక్కడి నుంచైన కొనుగోలు, అమ్మకాలు చేసేందుకు వెసలుబాటు ఉన్నందున చెక్‌పోస్టుల అవసరం లేకుండాపోతోంది. వాటిలో పని చేస్తున్న వారికి ఉపాధిపోనున్నది. వేలాది మంది హమాలీలకు పనిదొరకకుండా పోతోంది. రాష్ట్రంలో జూన్‌ నుంచి చెక్‌పోస్టులు దాదాపు పని చేయడం లేదు. ఇప్పుడు చట్టం రావడంతో వాటి అవసరమే ఉండదు. రైతుల నుంచి ఉత్పత్తులు ఏ వ్యాపారి ఏ మోతాదులో కొన్నారో, మార్కెట్‌ యార్డు వ్యవస్థ ఉంటే తెలిసిపోతోంది. మార్కెట్‌ బయట జరిగే లావాదేవీలతో ఏ వ్యాపారి ఎంత మొత్తంలో కొన్నారు? ఎక్కడ దాచి పెట్టారు? కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? లాంటి అవకతవకలను చెక్‌ చేసే వ్యవస్థ ఉండదు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే రెవెన్యూ లేదా పౌరసరఫరాల విభాగం అధికారులు తనిఖీ చేయవచ్చు. ఎంత మొత్తంలోనైనా వ్యాపారులు నిల్వ చేసుకునే వెసులుబాటు కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలతో లభించినట్లయ్యింది.

ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం తప్పదా?

ప్రభుత్వ తరఫున నిత్యావసరాలను నిల్వ చేసే ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) లాంటి సంస్థలు కొత్త వ్యవసాయ బిల్లులతో కనుమరుగు కానున్నాయి. ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే మోడీ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇది దేశంలోని అత్యధిక శాతం సామాన్యులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందంటున్నారు. లాభాపేక్ష తప్ప, ఏ మాత్రం మానవత్వం లేని విదేశీ, స్వదేశీ బహుళజాతి కంపెనీలు.. చిన్న వ్యాపారులు, గ్రామీణ పేద రైతాంగ ప్రయోజనాల పరిరక్షణకు, వాళ్లకు అధిక ఆదాయం కల్పించడానికి సహకరిస్తారని చెప్పడం హాస్యాస్పదమని రైతు నాయకులు పేర్కొంటున్నారు. నిత్యావసర చట్టం పరిధి నుంచి ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, నూనెగింజలు, పప్పుధాన్యాలను తొలిగించి వినియోగదారులను నిండా ముంచడమే అని అన్నివర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నది. గ్రామీణ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌ యార్డులకు తెచ్చి అమ్ముకోవడం ద్వారా స్థానికంగా ఉండే హమాలీలు, చాలామంది కూలీలకు ఇప్పటి వరకు ఉపాధి లభిస్తున్నది. వ్యాపారులు, దళారులు లబ్ధి పొందుతున్నారు. ఎప్పుడైనా ధరలు పెరిగితే, రైతులకు ప్రయోజనం దక్కేది. పూర్తిగా కార్పొరేట్‌ వ్యవస్థ పడగ నీడకు వెళ్తే రైతుకు లాభం దక్కుతుందా? వినియోగదారుడికి సరసమైన ధరల్లో నిత్యావసర వస్తువులు లభిస్తాయా? కేంద్ర బిల్లులతో మార్కెట్‌ వ్యవస్థతోపాటు గోదాములన్నీ కార్పొరేట్‌ వ్యవస్థ చేతిలోకి వెళ్లనున్నాయి. అసంఘటిత వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని సంఘటితం చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం పలు విధాలా ప్రయత్నిస్తున్నది. కేంద్రం తెచ్చిన కొత్త బిల్లులతో ఆ ప్రయత్నాలకు విఘాతం కలిగిస్తున్నాయని రైతు రక్షణ వంటి సమితులు ఆరోపిస్తున్నాయి. ఈ బిల్లుల ద్వారా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని, మార్కెట్‌ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి బహుళజాతి కంపెనీలకు అప్పజెబుతుందని రైతు నాయకులు ఆరోపిస్తున్నారు.

మార్కెట్‌ కమిటీ వ్యవస్థ నిర్వీర్యం..

కేంద్రం తాజాగా తెచ్చిన బిల్లులతో ఇకపైన గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వ్యవస్థ నిర్వీర్యం కానున్నది. వీటిపై ఆధారపడి బతుకుతున్న వేలాది మందికి ఉపాధి కరువయ్యే ప్రమాదం ముంచుకొచ్చింది. వ్యవసాయ చెక్‌పోస్టులు ఎత్తేయాల్సి వస్తున్నందున, అందులో పనిచేసే సిబ్బంది, వాటిపై ఆధారపడి బతికే కార్మికులు రోడ్డున పడక తప్పని పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం రైతులు పంట ఉత్పత్తులను సమీపంలోని మార్కెట్‌ కమిటీలకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ కమిటీలు, నిర్ణీత ధరలు నిర్ణయించి కొనుగోలు చేస్తాయి. వ్యాపారులకు లైసెన్సు, గుర్తింపు, వార్షిక ఫీజు తదితరాలన్నీ అమలవుతూ ఉంటాయి. ఎవరికి నష్టం జరిగినా కమిటీలు జవాబుదారీగా ఉంటున్నాయి. కేంద్రం కొత్త చట్టంతో రైతులు వారి ఉత్పత్తులను మార్కెట్‌ కమిటీ సంబంధం లేకుండా ఏ వ్యాపారికైనా నచ్చిన రేటుకు అమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది. రేటు నిర్ణయం లో గానీ, ఆర్థిక లావాదేవీల్లో గానీ, తూకాల్లో తప్పులకు కానీ, మోసాలకు గానీ మార్కెట్‌ కమిటీతో సంబంధం ఉండదు. రైతుకు అన్యా యం జరిగితే నోడల్‌ ఆఫీసర్‌గా వ్యవహరించే సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌కు మొర పెట్టుకోవాల్సిందే. వ్యాపారికి, రైతులకు మధ్య జరిగే వ్యాపార లావాదేవీల్లో ఆధారాలు, లిఖిత పూర్వక ఒప్పందాలు లాంటి వాటిపై ఇప్పటికింకా స్పష్టత లేదని రైతు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మార్కెట్‌ కమిటీలతో జవాబుదారీతనం

మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో క్రయవిక్రయాలు జరిగితే రైతులకు, వ్యాపారులకు జవాబుదారీతనం ఉంటుంది. రైతును మోసం చేస్తే కమిటీ జోక్యం చేసుకుంటుంది. కొత్త విధానంలో వ్యాపారులకు ఎలాంటి లైసెన్సు ఉండదు. పాన్‌కార్డు ఉంటే చాలు. రైతు నుంచి వ్యాపారి సరుకు కొన్న తర్వాత డబ్బులు చెల్లించకుండా ఎగ్గొడితే జవాబుదారీతనం ఉండదు. రాష్ట్రంలో 189 మార్కెట్‌ యార్డులతోపాటు అనుబంధంగా పాతిక వరకు ఉన్నాయి. యార్డుల్లో జరిగే వ్యాపారం ద్వారా సగటున ఏటా రూ.150 కోట్లు, చెక్‌పోస్టుల్లాంటి వాటి ద్వారా రూ.200 కోట్ల మేరకు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. వీటిల్లో పనిచేసే ఉద్యోగులకే రూ.200 కోట్లు ఖర్చవుతాయి. ఇప్పుడు చెక్‌పోస్టులన్నీ ఎత్తేయాల్సి రావడంతో సుమారు రూ.200 కోట్ల మేర ఆదాయం పోతుంది. ఉద్యోగుల జీతాలకు ఇబ్బందులు ఏర్పడుతాయి. వ్యాపారుల ధరలతో పోటీ పడి రైతులను మార్కెట్‌కే రప్పించేలా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. దేశంలోని ఆహార సరఫరా గొలుసును బహుళజాతి సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. అంబానీ, అదానీ సంపన్నులతోపాటు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, డీ-మార్ట్‌ లాంటి కంపెనీలకు వ్యవసాయ ఉత్పత్తులను కారు చౌకగా అమ్మించడానికి ఈ చట్టం ఉపయోగపడుతుందని రైతు సంఘాలు, రైతు నాయకులు ఆరోపిస్తున్నారు.

రైతుల గొంతు నొక్కడమే?

సామాన్య రైతులకు అందుబాటులో ఉండే మార్కెట్‌ కమిటీలను నిర్వీర్యం చేస్తుందీ కొత్త వ్యవసాయ బిల్లు. రైతులను కంపెనీలకు నేరుగా అనుసంధానం చేయడమే కాకుండా, ఏవైనా వివాదాలు తలెత్తితే పరిష్కార మార్గాలను మరింత ఈ బిల్లు జఠిలం చేస్తుందనే ఆందోళనలు నెలకొన్నాయి. ఇప్పటి దాకా మండల, డివిజన్‌ స్థాయిలో ఉన్న వివాద పరిష్కార మార్గాలే పూర్తిగా రైతులకు న్యాయం చేయలేకపోతున్నాయి. అలాంటిది జిల్లా అదనపు కలెక్టర్‌ స్థాయిలో పరిష్కారాలు చేసుకోవాలనడం రైతుల గొంతు నొక్కడమే. ఓ సామాన్య రైతు బడా కార్పొరేట్‌ సంస్థలతో న్యాయపోరాటం చేయగలడా? మరి ప్రభుత్వం గానీ, దాని అనుబంధ సంస్థలు గానీ రైతుకు అండగా లేకుండా చేయడం కార్పొరేట్‌ శక్తులకు ఊతమివ్వడం కాదా? పంట దిగుబడులను మార్కెట్లలోనే అమ్ముకోవాల్సిన అవసరం లేదనడమంటే మార్కెట్‌ వ్యవస్థను రూపుమాపడమే కదా. కార్పొరేట్‌ సంస్థలు కనుసన్నల్లో మార్కెట్లు కొనసాగితే, గిట్టుబాటు ధర కాదు కదా! కనీస మద్దతు ధరల ఒప్పందాలకు కూడా ఈ సంస్థలు అంగీకరించవు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఎలా న్యాయం జరుగుతోంది? ఇం తకు ముందు మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు అదుపు తప్పితే కేంద్ర ప్రభుత్వం తన వద్ద ఉన్న నిల్వలను మార్కెట్‌లోకి విడుదల చేసి, నిత్యావసర వస్తువుల చట్టం ప్రయోగించి ధరల స్థిరీకరణకు తోడ్పడేది. కొత్త బిల్లు ప్రకా రం రైతులు, వినియోగదారులను కార్పొరేట్‌ ఇష్టారాజ్యానికి వదిలేసి, కేంద్రం తన కనీస బాధ్యతల నుంచి తప్పుకుంటుందని రైతునాయకులు, రైతులు, అనేక వర్గాలు ఆరోపిస్తున్నాయి.

రైతులకు వ్యతిరేకంగా 

కేంద్ర వ్యవసాయ బిల్లు 

కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ బిల్లు రైతులకు ఎంత మాత్రం ఉపయోగపడదు. కేవలం కార్పొరేట్‌ శక్తులు, పెద్ద పెద్ద వ్యాపారస్తుల ఒత్తిడితోనే కేంద్ర ప్రభు త్వం ఈ బిల్లును తీసుకువచ్చింది. కేంద్రం తీసుకువచ్చిన బిల్లు ప్రకారం దేశంలో రైతు పండించిన పంటను ఎక్కడైనా తీసుకెళ్లవచ్చని చెబుతున్నారు. అది ఎలా సాధ్యం. చిన్న రైతులు సిద్దిపేట ప్రాంతంలో పండించిన పంటను ఇక్కడే అమ్ముకుంటారు. వరంగల్‌కు వెళ్లి అమ్ముకోలేం కదా..? నూతన వ్యవసాయ బిల్లును రైతులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మండలాల వారీగా రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో సమావేశాలను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మాణాలు చేశాం. 

- పాకాల శ్రీహరి, రాష్ట్ర రైతు రక్షణ సమితి అధ్యక్షుడు 

VIDEOS

logo