ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Siddipet - Nov 03, 2020 , 00:13:45

ఈ పొద్దు దుబ్బాకదే

ఈ పొద్దు దుబ్బాకదే

ఆలోచించి అడుగేయాల్సిన సమయం

మూడేండ్ల అభివృద్ధికి పరీక్షా కాలం

ఓటరన్నా.. పారాహుషార్‌

అభివృద్ధి చేసేవాళ్లు కావాల్నా.. 

మన బోర్లకు మీటర్లు పెట్టేటోళ్ల వైపు ఉంటవా.. తేల్చుకో

దుబ్బాకలో రెట్టించిన ఉత్సాహంతో గులాబీ దండు

ప్రచారంలో దూసుకుపోయిన కారు 

సోలిపేట సుజాతకు కలిసి రానున్న అనేక అంశాలు

ఉద్యమాల గడ్డ దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నికకు సిద్ధమైంది. నేటి ఎన్నికలకు అధికారయంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. అయితే, ఓటరన్నా.. పారాహుషార్‌.. ఆలోచించి, అడుగేయాల్సిన సమయమిది. మూడేండ్ల అభివృద్ధికి గీటురాయి కానున్నది. మన బోర్లకు మీటర్లు పెట్టేటోళ్లు ఒక వైపు.. ప్రజా సంక్షేమం కోసం తాపత్రపడేటోళ్లు మరోవైపు.. ఎవరిని ఎన్నుకోవాలో తేల్చుకోవాల్సిన గడియ ఇది.. ఓటరు చేతిలోనే భవితవ్యం ఉంది. మోసపోతే గోసపడుతం..! ఆలోచిస్తే బాగుపడుతం.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి కొట్లాడిన గడ్డ ఇది.. దుబ్బాక మరింతగా అభివృద్ధి కావాలన్నా.. పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలన్నా.. ఓటర్లు విజ్ఞతతో వ్యహరించాల్సిన టైం ఇది.. దుబ్బాక ప్రజలారా..! జాగ్రత్తగా ఆలోచించి, ఓటేయండి.. అభివృద్ధిని సాధించుకోండి.. ఆల్‌ ది బెస్ట్‌..!

రెట్టించిన ఉత్సాహంతో గులాబీ దండు

సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు దుబ్బాకలో చేపట్టిన అభివృద్ధి పనులను టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు గడప గడపకూ తీసుకెళ్లారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన నాటి నుంచి ఎన్నికల ప్రచారం ముగిసే వరకు టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు. ఈ ఎన్నికల్లో సుజాతను భారీ మెజార్టీతో గెలిపించుకునే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన యువత, విద్యార్థులు, ముఖ్యనాయకులు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఆయా గ్రామాలకు టీర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత వెళ్లినప్పుడు గ్రామాలకు గ్రామాలే కదిలివచ్చి బోనాలు, బతుకమ్మలు, మంగళహారతలు, డప్పు చప్పులు, జలపందిరిలతో ఘన స్వాగతం పలికారు. టీఆర్‌ఎస్‌ ఆయా మండల కేంద్రాల్లో నిర్వహించిన సభలు గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యాయి. కాంగ్రెస్‌, బీజేపీలు చేస్తున్న మోసాలను ఎప్పటికప్పడు మంత్రి హరీశ్‌రావు ఎండ గట్టారు. 20 రోజలుగా జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రతి రోజు వందలాది మంది కాంగ్రెస్‌, బీజేపీల నుంచి పెద్దఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరారు. చివరకు ఆపార్టీలకు లోకల్‌ క్యాడర్‌ లేక పోవడంతో పరాయి నాయకులు, కిరాయి లీడర్లతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ పార్టీలకు ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో ముందే చెతులెత్తేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత రామలింగారెడ్డి గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ దాటి భారీ విజయం సాధించనున్నదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రెండు,మూడు రోజులుగా కాంగ్రెస్‌, బీజేపీలు తమకు డిపాజిట్‌ సైతం వచ్చే పరిస్థితులు లేవని వారికి అర్ధమైంది. ఏది ఏమైన దుబ్బాక గడ్డపై మరోసారి భారీ మెజార్టీతో గులాబీ జెండా ఎగురనున్నది.

సిద్దిపేట, నమస్తే తెలంగాణ : పుట్టెడు దుఃఖంతో మీ ముందుకు వచ్చాను..! ఈ పరిస్థితి వస్తదను కోలేదు...! మీ తోబుట్టువును...నిండు మనస్సుతో దీవించండి..! మీ ఆడబిడ్డగా ఆశీర్వదించండి..! మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటాను. సీఎం కేసీఆర్‌ సహకారంతో దుబ్బాకలో మిగిలిపోయిన పనులు చేసి పెట్టుకుందామంటూ ఎన్నికల ప్రచార సభల్లో సోలిపేట సుజాత మాటలకు ఆయా గ్రామాల్లోని ప్రజలు తమ మద్దతు మీకే అంటూ .. మా అడబిడ్డను గెలిపించుకుంటామంటూ నినదించారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు మంగళహారతులు, డప్పచప్పుల్లు, బతుకమ్మలతో ఆమె ఘన స్వాగతం పలికారు. గ్రామాలకు గ్రామాలు కదిలివచ్చి ఘన స్వాగతం పలికాయి. దుబ్బాక నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని 148 గ్రామాల్లో ఆమె సుడిగాలి పర్యటనలు చేసి ప్రతి ఒక్కరినీ కలిశారు. తనను దీవించాలని ఓటర్లను కోరారు. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, దుబ్బాకలో చేపట్టిన అభివృద్ధి గురించి గడప గడపకూ గులాబీ శ్రేణులు తీసుకెళ్లి, రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారంలో దూసుకుపోయింది. ప్రత్యర్థి పార్టీలకు అందనంత దూరంతో దూసుకెళ్లింది. దుబ్బాక నియోజకవర్గంలో ఎక్కడ చూసిన గులాబీ జోష్‌ కనిపిస్తున్నది. ఈ ఉత్సాహం చూస్తా ఉంటే భారీ మెజార్టీతో సోలిపేట సుజాత విజయం సాధించడం ఖాయమనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.                                                                          

ఉద్యమాల గడ్డ దుబ్బాక..

దుబ్బాక నియోజకవర్గం ఉద్యమాల గడ్డ...తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి కొట్లాడింది. సీఎం కేసీఆర్‌ విద్యాబుద్ధులు నేర్చుకున్న ఈ గడ్డ...ఒక జర్నలిస్టును శాసనసభకు పంపిన నేల.. గ్రామీణ ప్రాంత ప్రజలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గ ప్రజలు.. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వైపే ఉన్నారు. సోలిపేట రామలింగారెడ్డిని నాలుగు సార్లు శాసనసభకు పంపింది. దుబ్బాక నియోజకవర్గం అంటేనే టీఆర్‌ఎస్‌ పార్టీకి కంచుకోట. సాధారణ, స్థానిక సంస్థలు ఏ ఎన్నికలైనా ఎగిరేది ఇక్కడ గులాబీ జెండానే అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. రామలింగారెడ్డి మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి సోలిపేట సుజాత బరిలోకి దిగారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నీ తానై నడిపించారు. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఉమ్మడి మెదక్‌ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. అన్నీ తానై ప్రచారం చేసి ప్రతిపక్ష పార్టీలకు ముచ్చెమటలు పట్టించారు. సోలిపేట సుజాతకు కుడి , ఎడమ భుజం లాగా మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, స్థానిక మహిళా ప్రజాప్రతినిధులు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. పుట్టెడు దుఃఖలో ఉన్న సుజాతను అనునయిస్తూ ప్రతి గ్రామానికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాలకు వెళ్లినప్పుడు జ్ఞాపకాలను గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. సుజాతకు అన్నివర్గాల ప్రజల మద్దతు ఉంది. పైగా రామలింగారెడ్డి చనిపోయిన మద్దతు తోడవుతుంది. దీంతో గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కన్నా అత్యధికంగా మెజార్టీతో గెలువనున్నది. దుబ్బాక నియోజకవర్గంలోని 148 గ్రామాలతో పాటు మున్సిపాలిటీల్లో తమ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. కాంగ్రెస్‌, బీజేపీలు ఆయా మండలాల్లోని పూర్తి స్థాయిలో గ్రామాలను తిరగ లేకపోయారు. కాంగ్రెస్‌, బీజేపీలు గ్రామాలకు వెళ్లినప్పుడు మీరు ఏం చేశారని బహిరంగం గానే ప్రజలు వారిపై తిరగబడ్డారు, ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్‌, కేసీఆర్‌ కిట్టు, ఇలా అన్ని ఇచ్చిందని ఆ పార్టీకే ఓటు వేస్తామంటూ  ప్రజలు ప్రచార సమయంలో తేల్చిచెప్పారు.

దుబ్బాకకు సీఎం కేసీఆర్‌ అండాదండ...

సీఎం కేసీఆర్‌కు దుబ్బాకతో ఆత్మీయ, ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ ప్రాంతంలో చదివారు. ఈ ప్రాంతం వాసి కావడంతో స్వతాహాగా ఆ ప్రాంత అభివృద్ధిపై మమకారం ఉంటుంది. అందుకే కోట్లాది రూపాయలతో దుబ్బాకలో అనేక అభివృద్ధి పనులు చేయించారు. దుబ్బాకలో వంద పడకల దవాఖాన, రామసముద్రం చెరువు అభివృద్ధి, దుబ్బాకలతో తను చదువుకు ప్రభుత్వ బడిని కోట్లాది రూపాయలతో అన్ని హంగులతో నిర్మించారు. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి దుబ్బాక నియోజకవర్గంలో ఇంటింటికీ మిషన్‌ భగీరథ కింద తాగునీరు నళ్లాల ద్వారా అందిస్తున్నారు. ఈ ప్రాంతంలో తాగునీటి గోస తీర్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరందించేందుకు కాలువలు తవ్వించారు. ఆ పనులు వేగంగా జరగుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా ఆసరా పింఛన్లు, బీడీ పింఛన్లు దుబ్బాక నియోజకవర్గంలోనే ఇస్తున్నారు. అత్యధికంగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఈ ప్రాంతంలోనే ప్రభుత్వం కట్టించింది. ఇవన్ని సీఎం కేసీఆర్‌, దివంగత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కృషితోనే సాధ్యమయ్యాయి. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మరో మూడేండ్లు అధికారంలో ఉంటుంది. దుబ్బాక మరింతగా అభివృద్ధ కావాలన్నా, పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా అది అధికార టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం. కాబట్టి ఓటర్లు విజ్ఞతతో వ్యహరించాల్సి సమయమిది. తమకు అభివృద్ధి కావాల్నా.. లేక బోరుమోటర్లకు మీటర్లు పెడతానంటున్న బీజేపీ వైపు ఉంటరా.. లేక ఎన్నికల తర్వాత పత్తా ఉండని, అభివృద్ధి పట్టని కాంగ్రెస్‌ వైపు ఉంటారో తేల్చుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది. దుబ్బాకకు సీఎం కేసీఆర్‌ శ్రీరామరక్షగా చెప్పవచ్చు. ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్న వ్యక్తిగా ఆయన దుబ్బాకకు మేలు జరిగేందుకే ఏ ప్రయత్నమైనా చేస్తారు. ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి, సంక్షేమాన్ని ఆయన పట్టించుకున్నట్లుగా పరాయి నేతలు.. కిరాయి నాయకులు పట్టించుకోరు. కాబట్టి దుబ్బాక ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాల్సిన సమయమిది.


VIDEOS

logo