మంగళవారం 24 నవంబర్ 2020
Siddipet - Oct 31, 2020 , 00:16:20

జై తెలంగాణ అనిపించింది టీఆర్‌ఎస్‌ పార్టే

జై తెలంగాణ అనిపించింది టీఆర్‌ఎస్‌ పార్టే

దుబ్బాక టౌన్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీ లేనిదే తెలంగాణ ఉద్యమం లేదని, జై తెలంగాణ అంటే టీఆర్‌ఎస్‌, టీఆర్‌ఎస్‌ అంటే జై తెలంగాణ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ పార్టీలను జై తెలంగాణ అనిపించింది టీఆర్‌ఎస్‌ పార్టేనని ఆయన స్పష్టం చేశారు. దుబ్బాక మున్సిపల్‌ పరిధిలోని ధర్మాజీపేటలో శుక్రవారం సాయంత్రం మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ధూం ధాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ...తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎక్కడిది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఎన్ని సార్లు జైలుకు వెళ్లాడో కనిపించలేదా, నాతో పాటు టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులంతా ఉద్యమంలో రైలు పట్టాల మీద బైఠాయిస్తే మెదక్‌ జైల్‌లో ఉంచిది నిజం కాదా అని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే పదవులను పట్టుకొని పాకులాడింది అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి కాదా అన్నారు. ఎమ్మెల్యే పదవులను గడ్డి పోచల్లా రాజీనామా చేసి ప్రజల ముందు నిలబడ్డామన్నారు. పదవులను పట్టుకొని వేలాడింది బీజేపీ, తెలంగాణ కోసం త్యాగాలు చేసింది టీఆర్‌ఎస్‌ పార్టీ అని మంత్రి స్పష్టం చేశారు. త్యాగాల పునాదుల మీద తెలంగాణ సాధించిన టీఆర్‌ఎస్‌ను, బండి సంజయ్‌ ప్రశ్నించడం నవ్విపోదురు గాక నాకేమి సిగ్గు అన్నట్టు ఉందన్నారు. ఒక్క ఓటు.. రెండు రాష్ర్టాలు అని తెలంగాణ ప్రజలను మోసం చేసింది బీజేపీ పార్టీ అని మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ సాధ్యం కాని హామీలను ఇస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన మంత్రి కోరారు. గుజరాత్‌ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం వృద్ధ్దాప్య పింఛన్‌ ఇచ్చేది కేవలం రూ.400లు మాత్రమే. వితంతు పింఛన్‌ రూ.500లు మాత్రమే. అదే తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ రూ.2,016 ఇవ్వడం లేదా అని రాష్ర్టానికి ఈ రాష్ర్టానికి తేడాను గమనించాలన్నారు. ఇక కాంగ్రెస్‌ ఛీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వంత నియోజకవర్గంలో గెలువలేడు కానీ దుబ్బాకలో ఎలా గెలుస్తాడన్నారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ, రాష్ర్టాన్ని అభివృద్ధి బాటలో తెలిపారు. ఓట్ల కోసం ప్రతిపక్షాలు డబ్బులు ఇస్తే జీవితాతం బతుకులు ఆగమేనన్నారు. 

టీఆర్‌ఎస్‌ మాట తప్పని, మడమ తిప్పని పార్టీ...

టీఆర్‌ఎస్‌ మాట తప్పని పార్టీ అని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఢిల్లీని కదిలించి సాధించి తెలంగాణ సాధించామని, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా సుఖ శాంతులతో జీవించాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆశయం అన్నారు. బీజేపీ ఝూటా మాటలు నమ్మి బతుకులను ఆగం చేసుకోవద్దని మంత్రి హరీశ్‌రావు కోరారు. దుబ్బాక పౌరుషం గల గడ్డ...పోరాటాల గడ్డ...ఉద్యమాల గడ్డ. మీరు ఏ మాయ మాటలు చెప్పిన దుబ్బాక ప్రజలు సిద్ధంగా లేరన్నారు. రాష్ట్రంలో ఉన్నది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అని,  దుబ్బాక అభివృద్ధి బాధ్యత పూర్తిగా నాదేనని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. సుజాతక్కకు తోడుగా అందుబాటులో ఉండి ప్రతి మాటను నిలబెట్టుకుంటానని, కారు గుర్తుకు ఓటు వేసి పెద్ద మెజార్టీతో టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించాలని మంత్రి కోరారు. వచ్చే మూడు రోజులు పార్టీ కోసం టీఆర్‌ఎస్‌ శ్రేణులు కష్టపడితే వచ్చే మూడేండ్లు మీ కోసం నేను కష్టపడి మీ రుణం తీర్చుకుంటానన్నారు. ధర్మాజీపేట అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి పతాన ముందుకు సాగిస్తానన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బాలకృష్ణ, కనకయ్య, బత్తుల స్వామి, కో-ఆప్షన్‌ సభ్యురాలు పెంటమ్మ, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, నాయకులు రొట్టె రాజమౌళి, స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు ఉన్నారు. ధర్మాజీపేటలో నిర్వహించిన ధూం ధాం కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి పాడిన పాటలు ప్రజలను ఎంతగానో ఆలోచింపజేశాయి.