సోమవారం 01 మార్చి 2021
Siddipet - Oct 31, 2020 , 00:17:14

ఓటు వేసేందుకు గుర్తింపు కార్డు తప్పనిసరి

ఓటు వేసేందుకు గుర్తింపు కార్డు తప్పనిసరి

సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి భారతీ హోళికేరి 

సిద్దిపేట కలెక్టరేట్‌ : నవంబర్‌ 3న జరిగే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటరు గుర్తింపు కార్డు తప్పనిసరని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భారతి హోళికేరి తెలిపారు. ఉప ఎన్నికలో  ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటరు స్లిప్‌ గుర్తింపునకు ప్రామాణికం కాదన్నారు. ఓటర్‌ స్లిప్‌తో పాటు ఎపిక్‌ ఫొట్‌ ఓటర్‌ గుర్తింపు కార్డు తీసుకు రావాలన్నారు. ఎపిక్‌ కార్డు లేని ఓటర్లు, వారి గుర్తింపును నిరూపించుకోవడం కోసం భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 రకాల ఫొటోలతో కూడిన ఏదేని ప్రత్యామ్నాయ డాక్యుమెంట్లు సమర్పించాలని ఆమె సూచించారు. 

ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులు ఇవే.. 

1)పాస్‌పోర్ట్‌ 

2)డ్రైవింగ్‌ లైసెన్స్‌ 

3) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు/ ప్రభుత్వ రంగ సంస్థలు / పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగుల ఫొటో గుర్తింపు కార్డులు 

4) బ్యాంకులు, పోస్టాఫీసులు ఫొటోతో సహా జారీచేసిన పాస్‌ పుస్తకాలు

5) పాన్‌కార్డు 

6) ఎన్‌పీఆర్‌ కింద ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్‌కార్డు 

7) ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ జారీచేసిన ఉపాధి హామీ పత్రం 

8)ఆరోగ్యబీమా కింద కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన స్మార్ట్‌కార్డు 

9) ఫొటో జతచేసి ఉన్న పింఛన్‌ పత్రాలు

10)ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు జారీచేసిన అధికార గుర్తింపు పత్రం 11)ఆధార్‌కార్డు

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

సిద్దిపేట కలెక్టరేట్‌ : దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఓటరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి భారతీ హోళికేరి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును హక్కుగా మాత్రమే చూడకుండా బాధ్యతగా చూడాలన్నారు. నవంబర్‌ 3న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఓటర్లను జాగృతం చేసేందుకు స్వీప్‌ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక సారథి ద్వారా పల్లె పల్లెనా ప్రచారం నిర్వహిస్తూ ఓటు ప్రాధాన్యతను వివరిస్తూ ఓటర్లను చైతన్యం చేస్తున్నామన్నారు. వీటితో పాటు ప్రచార కరపత్రాలు, స్టిక్కర్లు, ఫ్లెక్సీ బ్యానర్ల ద్వారా అందరికీ అర్థమయ్యేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకోవడానికి తగిన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 80ఏండ్లు పైబడిన ఓటర్లకు, దివ్యాంగులు, కొవిడ్‌-19 బాధితులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు.

VIDEOS

logo