ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Siddipet - Oct 28, 2020 , 00:05:32

ఇంటి పార్టీకి పట్టం కట్టండి

ఇంటి పార్టీకి పట్టం కట్టండి

ప్రతిపక్షాలకు ఓట్లతో బుద్ధి చెప్పండి 

అవకాశవాద నాయకులను ఓడించండి

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం..లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తాం

దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత

దుబ్బాక టౌన్‌ : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంటి పార్టీ టీఆర్‌ఎస్‌ను గెలిపించుకొని, మరోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు మరింత బలాన్ని అందించాలని దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత పిలుపునిచ్చారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట 10, 11వార్డుల్లో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి సోలిపేట సుజాత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సందర్భంగా ప్రజలు సుజాతక్కకు బ్రహ్మరథం పట్టారు. ప్రజలనుద్దేశించి ఆమె మాట్లాడారు. అభివృద్ధి వాదులు, అవకాశవాదులకు మధ్య జరుగుతున్న ఎన్నికల్లో అవకాశవాద నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. 70 ఏండ్లలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్‌ అమలు చేసి ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచినట్లు స్పష్టం చేశారు. తాగునీటి కోసం ఏ ఆడబిడ్డ కూడా బిందె పట్టుకొని రోడ్డుపైకి రావద్దనే ఉద్దేశంతోనే వేల కోట్ల రూపాయలతో మిషన్‌ భగీరథ ప్రాజెక్టు ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే సత్తాలేకనే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు అసత్య ప్రచారాలకు పూనుకున్నాయన్నారు. మరోసారి ఉద్యమ స్ఫూర్తిని చాటాలని సోలిపేట సుజాత పిలుపునిచ్చారు. మల్లన్నసాగర్‌ పూర్తయితే, నియోజకవర్గంలోని లక్షా 35 వేల ఎకరాలకు సాగునీరు, ఇండ్లు లేని వారందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను అందిస్తామన్నారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగన్నా ఆశయ సాధనకు పని చేస్తానని, నియోజకవర్గ ప్రజలే దేవుళ్లని, వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకొని సీఎం కేసీఆర్‌ తనపై ఉంచిన నమ్మకాని నిలబెట్టుకుంటానన్నారు.  

సుజాతక్కను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం..: రసమయి

తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మానుకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. లచ్చపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ చొరవతోనే బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి ఫలితాలు అం దుకున్నాయన్నారు. ఎన్నికల వచ్చినప్పుడు వచ్చే కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు మాటలు నమ్మొద్దన్నారు. ప్రజలకు అం దుబాటులో ఉండే టీఆర్‌ఎస్‌ నాయకులకు అండగా ఉండాలన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతకు ఓటు వేసి భారీ మెజార్టీని అందిచాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వనిత, కౌన్సిలర్లు బంగారయ్య, శ్రీజశ్రీకాంత్‌, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ కనకరాజు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు రాజమౌళి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఎల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ శ్రేణులు పాల్గొన్నారు.


VIDEOS

logo