సోమవారం 01 మార్చి 2021
Siddipet - Oct 28, 2020 , 00:05:30

బీజేపీ అబద్దాలకు అంతేలేదు

బీజేపీ అబద్దాలకు అంతేలేదు

వాస్తవాలను బయటపెట్టండి.. ఎక్కడికక్కడ కడిగి పారేయండి

ఆ బాధ్యత యువత, విద్యార్థుల మీదే ఉంది

విశ్వసనీయత అంటేనే సీఎం కేసీఆర్‌..

లక్ష మెజార్టీతో సుజాతమ్మ విజయం ఖాయం

తన డబ్బులు కానప్పుడు.. రఘునందన్‌ లొల్లి ఎందుకు?

ఓటమి భయంతోనే బీజేపీ డ్రామాలు 

యువత మొత్తం టీఆర్‌ఎస్‌ వైపే  

ఉద్యమ సమయంలో కిషన్‌రెడ్డి ఎక్కడికి పోయావు  

ముత్యంరెడ్డికి 2018లో టికెట్‌ ఎందుకివ్వలే ఉత్తమ్‌.. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

తొగుట మండల కేంద్రంలో యువజన సభ గ్రాండ్‌ సక్సెస్‌

వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన యువకులు

తొగుట :

 ‘బీజేపీ, కాంగ్రెస్‌ అవాస్తవాలను ప్రచారం చేస్తోంది.. గోబెల్‌ ప్రచారాన్ని తిప్పి కొట్టే బాధ్యత యువత, విద్యార్థులదే.. వాస్తవాలను బయటపెట్టండి.. ఎక్కడికక్కడ కడిగి పారేయండి’.. అని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. తొగుట మండలంలోని వివిధ గ్రామాల యువతతో కలిసి భారీ బైక్‌ర్యాలీ నిర్వహించి, తొగుటలో యువజన సభను నిర్వహించారు. ఈ సభకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ‘2001 నుంచి తెలంగాణ కోసం కేసీఆర్‌ కొట్లాడారు.. 11 రోజుల పాటు ఆమరణ దీక్ష చేసి మరణం అంచులకు వెళ్లి వచ్చి, తెలంగాణ సాధించుకున్నాం.. నాడు ఉద్యమంలో, నేడు అభివృద్ధిలో విశ్వసనీయతకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిదర్శనంగా నిలుస్తున్నారు’.. అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న సందర్భంగా గులాబీ దళపతి కేసీఆర్‌ పిలుపు మేరకు తమ ఎమ్మెల్యేలంతా పదవులను గడ్డిపోచతో సమాసంగా భావించి, రాజీనామాలు చేస్తే.. బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న నేటి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. దుబ్బాకలో ఓటమి భయంతోనే బీజేపీ నాయకులు డ్రామాలు చేస్తున్నారని, మున్ముందు బట్టలు చింపుకొని, కొత్త నాటకాలు చేస్తారని, వాళ్లకు టీఆర్‌ఎస్‌ నాయకులు దూరంగా ఉండాలన్నారు. సిద్దిపేటలో దొరికిన డబ్బులు మీది కానప్పుడు ప్రచారం బందు చేసుకొని రఘునందన్‌ సిద్దిపేటకు వచ్చి నానా యాగీ ఎందుకు చేశాడో అర్థం చేసుకోవాలన్నారు. యువత మా వైపే ఉన్నారని బీజేపీ నాయకులు భ్రాంతి కల్పిస్తున్నారని, ఇక్కడ కనిపించిన వారు యువత కాదా? కళ్లు పెట్టి చూసుకోవాలని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. 

పసుపు బోర్డు ఏమైంది అరవింద్‌..

ఎన్నికల్లో విజయం సాధిస్తే నిజామాబాద్‌ జిల్లా రైతులకు పసుపు బోర్డు మంజూరు చేస్తానని బాండ్లు రాసి ఇచ్చిన ఎంపీ అరవింద్‌, రైతులను మోసం చేశాడని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీజేపీకి ఓట్లు వేసిన పాపానికి మోటర్లకు మీటర్లు, మార్కెట్లను ప్రైవేట్‌ పరం చేయడం, విదేశీ మక్కలను దిగుమతి చేసుకొని రైతుల నడ్డి విరవడం లాంటి వరాలు ఇచ్చారని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ చెప్పినట్లు హైదరాబాద్‌లో కారు ప్రభుత్వం ఉందని, దుబ్బాకలో కూడా కారు విజయం సాధిస్తేనే అభివృద్ధి ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్ర సంక్షేమ పథకాల్లో బీజేపీ వాటా గురుంచి దుబ్బాకలో చర్చకు సవాల్‌ విసిరితే, సమాధానం చెప్పలేక పోయారన్నారు. 

సక్కనోడు అయినప్పుడు టికెట్‌ ఎందుకివ్వలేదు

దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి గొప్పవాడని చెబుతున్న పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి.. 2018లో ముత్యంరెడ్డికి టికెట్‌ ఎందుకివ్వలేదో సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్‌ చేశారు. సిద్దిపేటలో గతంలోనే కేసీఆర్‌ తాగునీరు అందించాడని, ముత్యంరెడ్డి హయాంలో తాగునీళ్లను అందివలేకపోయాడని, కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చాక మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నామనారు. మల్లన్నసాగర్‌తో తొగుట పెద్ద పర్యాటక, పారిశ్రామిక, మత్స్య విప్లవ కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని, ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు.

అభివృద్ధి-సంక్షేమం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం

60ఏండ్లలో జరుగని అభివృద్ధి ఆరేండ్లలో చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుతో తొగుట మండలంతో పాటు దుబ్బాక నియోజకవర్గం సస్యశ్యామలమవుతుందన్నారు. గతంలో ప్రాజెక్టుల నిర్మాణమంటే, మనం బతికున్నప్పుడు అవుతుందా? అని అనుకునేవాళ్లని, నేడు కళ్ల ముందు ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటున్నామని, పొలాల్లోకి, చెరువు కుంటల్లోకి నీళ్లను వదులుకుంటున్నామన్నారు. మూడేండ్ల పాటు టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉంటుందని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థినే ఆశీర్వదించాలని కోరారు.

అయ్యా.. కొడుకులు రాజీనామా చేయాలి 

: మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

టీఆర్‌ఎస్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై బీజేపీకి అంటకాగుతున్న డీ శ్రీనివాస్‌, పసుపు బోర్డు కోసం బాండు రాసిచ్చి మోసం చేసిన నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ వెంటనే రాజీనామా చేయాలని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బీజేపీ నాయకుల డబ్బులు పోలీసులు పట్టుకోవడంతో ఇంకా పైసలు కావాలని అమిత్‌షాకు ఫోన్‌ చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

హరీశన్న అండతో అభివృద్ధి చేస్తా 

: సోలిపేట సుజాత

మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అండతో దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత పేర్కొన్నారు. తనకు హరీశన్న అండ ఉందని తెలియడంతోనే కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల గుండెలు ఝల్లుమంటున్నాయన్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న తనకు అండగా ఉండాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్‌, పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, జడ్పీటీసీ గాంధారి ఇంద్రసేనారెడ్డి, వైస్‌ ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు మల్లారెడ్డి, సర్పంచ్‌, ఎంపీటీసీలు పాగాల కొండల్‌రెడ్డి, సుతారి లలిత రమేశ్‌, మార్కెట్‌, రైతు బంధు సమితి చైర్మన్లు గడీల అనిత లక్ష్మారెడ్డి, బీ కనకయ్య, సొసైటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ హరికృష్ణారెడ్డి, కుర్మ యాదగిరి, టీఆర్‌ఎస్‌ యువత, టీఆర్‌ఎస్వీ మండలాధ్యక్షులు అనిల్‌, పరమేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.యువజన

 సభ సక్సెస్‌


దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా తొగుట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన యువత బైక్‌ ర్యాలీ గ్రాండ్‌ సక్సెస్‌ అయింది. యువత పెద్ద ఎత్తున పాల్గొని ‘జై తెలంగాణ.. జై కేసీఆర్‌'.. అంటూ నినాదాలు చేశారు. అన్ని గ్రామాల నుంచి వచ్చిన బైక్‌లతో తొగుట మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో తొగుట మండల ఎన్నికల ఇన్‌చార్జి అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌లు కాన్గల్‌ నుంచి ర్యాలీగా వచ్చారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ర్యాలీలో పాల్గొని యువతలో ఉత్తేజాన్ని నింపారు. ‘బీజేపీ, కాంగ్రెస్‌ నాయకుల్లారా.. చూడండి.. ఇదిగో మా యువత’.. అంటూ టీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సాయి చంద్‌ ఆట పాటకు యువత కేరింతలు కొట్టారు.

శుభసూచనం..

తొగుటలో యువజన  బహిరంగ సభ జరుగుతుండగా, అక్కడి నుంచి ఓ శవయాత్ర వెళ్లగా, ‘హిందూ సంప్రదాయం ప్రకారం శవం ఎదురుగా వస్తే శుభసూచకం.. మన కార్యక్రమం జరుగుతున్నప్పుడు శవం మన ఎదురుగా వచ్చింది.. ఇది మనకు మంచిది.. సుజాతమ్మ గెలుపు ఖాయం’.. అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శవయాత్ర సభ దాటేంత వరకు స్పీచ్‌ బంద్‌ చేశారు.


VIDEOS

logo