శుక్రవారం 04 డిసెంబర్ 2020
Siddipet - Oct 25, 2020 , 00:02:38

బీజేపీ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలే..

బీజేపీ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలే..

దౌల్తాబాద్‌: బీజేపీ పుకార్ల పుట్ట., అబద్ధాల గుట్టగా మారిందని, ఆ పార్టీ నాయకులు నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడుతున్నారని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. మండల పరిధిలోని గోవిందాపూర్‌ మధిర గ్రామం పోసాన్‌పల్లి, దౌల్తాబాద్‌, ఇందుప్రియల్‌ గ్రామాల్లో శనివారం ఆయన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత తరఫున ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ సర్కారు రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్‌ అందజేస్తున్నదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కరెంట్‌ ఎప్పుడు వస్తదో తెలియక కాలిపోయే మోటర్లతో ఎండిపోయిన పంటలతో రైతులు కాలం ఎల్లదీశారు. మళ్లీ ఇప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం మోటర్లకు మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేస్తలేరని ప్రశ్నించారు.

ఇంటింటికీ భగీరథ నీరు..

తెలంగాణ ప్రభుత్వం తాగునీటి ఇబ్బందులను తొలగిస్తున్నది. ప్రతి ఇంటికీ నల్లానీరు ఇచ్చి తీరుతామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం దుబ్బాక నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సహకారంతో గోదావరి జలాలను అందజేస్తున్నామన్నారు. ఆంధ్రాపాలకుల పాలనలో తాగునీటి కోసం ఆడ, మగ తేడా లేకుండా బాయిలకాడికి పోయి బిందెళ్లో నీరు తెచ్చుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడేవారన్నారు. నేడు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టితో ఆ బాధలు తప్పాయన్నారు. ప్రతి ఇంటికీ నల్లా ద్వారా గోదావరి జలాలు వెళ్తున్నాయన్నారు.

ఆడబిడ్డలకు అండగా..

కాంగ్రెస్‌ ప్రభుత్వాల పాలనలో పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రులు పెండ్లిళ్లు చేయాలంటే ఎన్నో ఇబ్బందులు పడేవారని, నేడు తెలంగాణ ప్రభుత్వ పుణ్యమాని ఆ పరిస్థితులు తప్పాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్‌ పెద్ద మనసుతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల ద్వారా రూ.లక్ష నూటపదహారు అందజేస్తుందన్నారు. బీజేజే పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి పథకాలు ఎందుకు అమలు చేస్తలేదని విమర్శించారు. ఆడవాళ్లు కాన్పునకు ప్రభుత్వ దవాఖానకు పోతే మంచి వసతులతో తల్లీబిడ్డలకు మంచి వైద్యం అందిస్తూ కేసీఆర్‌ కిట్‌తో రూ.12 వేలు అందిస్తూ కాన్పు తర్వాత వారిని క్షేమంగా ఇంటి దగ్గర ప్రభుత్వ అంబులెన్స్‌లో వదిలి పెడుతుందని తెలిపారు. 

చర్చకు సిద్ధమా..?

తెలంగాణ ప్రభుత్వం బీడీ కార్మికులకు కోసం ప్రతి నెల రూ.2,016 అందిస్తుంటే బీజేపీ నాయకులు మేమే అందిస్తున్నామని జూట్‌ ప్రచారం చేస్తున్నారని, దీనిపై దమ్ముంటే చర్చ రావాలని మంత్రి సవాల్‌ విసిరారు. బీజేపీ మాటలు అన్ని గోబెల్‌ ప్రచారమాని ఎద్దేవా చేవారు.

టీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ నాయకులు

మండల పరిధిలోని పలు గ్రామాల బీజేపీ నాయకులు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇందుప్రియల్‌ బీజేపీ గ్రామాధ్యక్షుడు సురేశ్‌ ఆధ్వర్యంలో 20 మంది చేరిక, మమ్మద్‌షాపూర్‌ గ్రామ అధ్యక్షుడు రాజిరెడ్డి ఆధ్వర్యంలో 20 మంది, శేరిపల్లి బందారంలో అధ్యక్షుడు జక్కుల లింగం ఆధ్వర్యంలో 40 మంది, నర్సంపేట గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీశైలం ఆధ్వర్యంలో 15 మంది, లింగాయిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు బిల్‌సింగ్‌తో పాటు 30 మంది, చెట్ల నర్సంపల్లి గ్రామ ఉప సర్పంచ్‌తో 15 మంది, కోనాయిపల్లి గౌడ సంఘంతో బీజేపీకి చెందిన కృష్ణతో 40 మంది, గోవిందపూర్‌లో వివిధ పార్టీలకు చెందిన 20 మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 

మా ఓటు టీఆర్‌ఎస్‌కే... 

గోవిందపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని పోసాన్‌పల్లి గ్రామస్తులు తమ గ్రామం అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. తమ ఓట్లు టీఆర్‌ఎస్‌ పార్టీకేనని, ఆ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రణం శ్రీనివాస్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ శేఖర్‌రెడ్డి, జిల్లా కో-ఆప్షన్‌ సభ్యుడు రహీమొద్దీన్‌, మండల కో-అప్షన్‌ సభ్యుడు అమ్మద్‌, సర్పంచ్‌లు మల్లేశంగౌడ్‌, శ్యామల, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు అదివెంకన్న, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ నర్రసత్యం, ఎంపీటీసీలు వీరమ్మమల్లేశం, దేవేందర్‌, టీఆర్‌ఎస్వీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మెరుగు మహేశ్‌, నాయకులు ఖాలీలొద్దీన్‌, రాజేందర్‌, సూచిత్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.