బుధవారం 20 జనవరి 2021
Siddipet - Oct 24, 2020 , 00:45:59

గోస తీర్చిన గోదావరి

గోస తీర్చిన గోదావరి

దుబ్బాకలో తీరిన తాగునీటి కష్టాలు

సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో ప్రతి ఇంటికీ కుళాయి

దుబ్బాక నియోజకవర్గంలో 802.06 కిలోమీటర్ల పైప్‌లైన్‌

64,646 నల్లా కనెక్షన్లు ఇచ్చి తాగునీటి సరఫరా

తీరిన తిప్పలు.. మహిళల సంతోషం 

సిద్దిపేట, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత దుబ్బాక నియోజకవర్గంలో తాగునీటి కష్టాలు దూరమయ్యాయి. ‘మిషన్‌ భగీరథ’ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చి గోదావరి జలాలు అందిస్తుండడంతో ప్రజలకు తాగునీటి కష్టాలు తీరాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఏడు మండలాలు, ఒక మున్సిపాలిటీ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటిని అందించి నీటి ఇక్కట్లు తీర్చారు. నియోజకవర్గంలో దుబ్బాక మున్సిపాలిటీతో కలుపుకొని మొత్తం 143 గ్రామ పంచాయతీలు ఉండగా, 196 హబిటేషన్‌ గ్రామాలు ఉన్నాయి.  802.06 కిలోమీటర్ల ఇంట్రా పైప్‌లైన్‌ను వేసి, 64,646 ఇంటి నల్లా కనెక్షన్లు ఇచ్చారు. మొత్తం 160 నూతన ట్యాంకులను నిర్మించారు. పాతవి, కొత్తవి కలుపుకొని నియోజకవర్గంలో 429 ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకులు ఉన్నాయి. వీటి ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నారు. మిషన్‌ భగీరథ పథకం కింద గ్రామాల్లో ఒక వ్యక్తికి 100 లీటర్లు, పట్టణాల్లో ఒక వ్యక్తికి 135 లీటర్ల నీటిని అందిస్తున్నారు.

గజ్వేల్‌ సంప్‌హౌస్‌ నుంచి 

నీటి సరఫరా 

గజ్వేల్‌ కోమటిబండ సంప్‌హౌస్‌ నుంచి దుబ్బాక నియోజకవర్గాలకు నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. జిల్లాలో మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా ఓహెచ్‌బీఆర్‌ఎస్‌ నిర్మాణాలు చేపట్టారు. కొండపాక వద్ద 220 కేఎల్‌ సామర్థ్యం కలిగిన ఓహెచ్‌బీఆర్‌ఎస్‌, కొమురవెల్లి కమాన్‌ వద్ద 90 కేఎల్‌ ఓహెచ్‌బీఆర్‌ఎస్‌, కోమటిబండ వద్ద 550 కేఎల్‌ ఓహెచ్‌బీఆర్‌ఎస్‌, కోమటిబండ వద్ద 150 కేఎల్‌ ఓహెచ్‌బీఆర్‌ఎస్‌, తిమ్మా పూర్‌ వద్ద 90 కేఎల్‌ బీపీటీ, వడ్డేపల్లి వద్ద 150 కేల్‌ బీపీటీ, దుబ్బాక మారెమ్మగడ్డ వద్ద 90 కేఎల్‌ ఓహెచ్‌బీఆర్‌ఎస్‌, సిద్దిపేట ఎంపీడీవో ఆఫీసు వద్ద 90 కేఎల్‌ ఓహెచ్‌బీఆర్‌ఎస్‌, కాళ్లకుంట కాలనీ 250 కేల్‌ ఓహెచ్‌బీఆర్‌ఎస్‌, పుల్లూరు గుట్టపై 120 కేఎల్‌ ఓహెచ్‌బీఆర్‌ఎస్‌, మెట్టు క్రాస్‌ వద్ద 60 కేఎల్‌ ఓహెచ్‌బీఆర్‌ఎస్‌, సిద్దిపేట కాళ్లకుంట కాలనీ వద్ద 1600 కేఎల్‌ లీటర్ల సామర్థ్యంతో సంపుహౌస్‌ నిర్మించారు. దుబ్బాకలో 725 కేఎల్‌ లీటర్ల సామర్థ్యం సంప్‌, కొత్తూరు వద్ద 220 కేఎల్‌, అచ్చాయిపల్లి వద్ద 90 కేఎల్‌ లీటర్ల సామర్థ్యం కలిగిన సంప్‌ నిర్మాణాలు చేపట్టారు.

దుబ్బాకలో దూరమైన తాగునీటి కష్టాలు 

సమ్యైక రాష్ట్రంలో దుబ్బాక నియోజకవర్గంలో తాగునీటి కష్టాలు తీవ్రంగా ఉండేవి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో, దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ‘మిషన్‌ భగీరథ’ ద్వారా ఇంటింటికీ గోదావరి జలాలను అందించారు.ప్రతి గుడిసెకు నల్లా కనెక్షన్‌ ఇచ్చి తాగునీళ్లు అందించారు. గతంలో నీళ్ల కోసం మైళ్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. బిందెలు మోసి భుజం కాయలు కాసేవి. మహిళల నడుములు వంగేవి. ప్రస్తుతం ఇంటింటికీ నళ్లా ద్వారా గోదావరి జలాలు వస్తుండడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేండ్లు పడిన  తాగునీటి గోస దూరమైందని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

 నీటి కష్టాలు తీర్చిండ్రు.. 

 ప్రతిరోజు భగీరథ గోదావరి నీళ్లు మంచిగా వస్తున్నాయి.నీళ్ల గోస తీరింది. తెలంగాణ సర్కారు మూలంగానే మా తాగునీటి కష్టాలు తీరినయ్‌.  అందరికంటే ముందు దుబ్బాకోళ్లం.. ఐదేండ్ల నుంచి గోదావరి నీళ్లు తాగుతున్నాం. సీఎం కేసీఆర్‌కు మా నమస్కారాలు. 

-గన్నె భాగ్యలక్ష్మి, దుబ్బాక

 రెండు పూటల నీళ్లస్తున్నయ్‌.. 

 ఎండ కాలం వస్తే తాగడానికి రెండు బిందెల నీళ్ల కోసం ఎన్నో కష్టాలు పడే వాళ్లం. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తరువాత  నీళ్ల కోసం ఎలాంటి తిప్పలు లేవు. పొద్దుగాళ్ల, రాత్రిపూట నళ్లాల ద్వారా నీరిస్తుండ్రు. నీళ్ల గోసను సర్కారు తీర్చించింది. మాకు బిందెల్లను ఎత్తుకొచ్చే బాధ తప్పింది.

-మద్దెల సుగుణ, మహిళా రైతు, మిరుదొడ్డి

దుబ్బాక నియోజకవర్గంలో ఇలా.. 

క్ర.స      మండలం పేరు       జీపీలు   హాబిటేషన్స్‌   నళ్లా కనెక్షన్లు    పైప్‌లైన్‌ (కి.మీ)   ఓహెచ్‌ఎస్‌ఆర్‌ 

1 దుబ్బాక 30 39 12,585 159.87 62 27

2            దుబ్బాక (మున్సిపాలిటీ) - - 5,885         74.43 23 12

3. మిరుదొడ్డి 21 25 10,606 117.33 37 25

4. తొగుట 16 24 6,876 77.38 34 16

5. రాయపోల్‌ 19 24 6,831 82.19 21 20

6. దౌల్తాబాద్‌ 24 29 8,169 96.42 36 22

7. చేగుంట 28 48 10,964 162.64 47 33

8 నార్సింగి 05 07 2,730 31.80 09 05

మొత్తం 143 196 64,646 802.06 269 160logo