శనివారం 05 డిసెంబర్ 2020
Siddipet - Oct 23, 2020 , 01:14:30

సిద్దిపేట జిల్లాలో పర్యటించిన కేంద్ర బృందం

సిద్దిపేట జిల్లాలో 	పర్యటించిన కేంద్ర బృందం

  • 84,159 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు.. రూ.423.70 కోట్ల నష్టం 
  • చేతికందవచ్చిన పత్తి,వరిపై తీవ్ర ప్రభావం
  • ములుగు, మర్కూక్‌ మండలాల్లో పంటనష్టాన్ని  క్షేత్రస్థాయిలో పరిశీలించిన బృందం 
  • తెగిన రోడ్లు, విద్యుత్‌ లైన్ల నష్టాల అంచనా
  • దెబ్బతిన్న పత్తి చెట్లతో కేంద్ర బృందానికి  గోడు చెప్పుకున్న రైతులు
  • బృందానికి నష్టాన్ని వివరించిన కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి

గజ్వేల్‌ : ఎడతెరిపి లేని వర్షాలతో వరద ఉధృతికి సిద్దిపేట జిల్లాలో వానకాలం పంటలతో పాటు పలు రకాల ఆస్తినష్టం సంభవించిందని కేంద్ర బృందానికి కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, రైతులు విన్నవించారు. జిల్లాలోని ములుగు, మర్కూక్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో ఆర్‌బీ కౌల్‌, మనోహరన్‌లతో కూడిన కేంద్ర  బృందం గురువారం పర్యటించింది. క్షేత్రస్థాయిలో పంటలు, రోడ్లు, విద్యుత్‌ తదితర నష్టాలను పరిశీలించింది. వరదలతో కలిగిన నష్టాన్ని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి వివరించారు. దెబ్బతిన్న పత్తి, వరి, కూరగాయ పంటల మొక్కలతో రైతులు కేంద్ర బృందానికి తమ గోడును వెల్లబోసుకున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికందే సమయంలో నీటి పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించి సమాచారాన్ని సేకరించింది. సిద్దిపేట జిల్లాలో  84,159 ఎకరాల్లో రూ.423.70 కోట్ల విలువ చేసే పంటలు దెబ్బతిన్నట్లు కేంద్ర బృందానికి కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి వివరించారు. వరదలతో పంటలతో పాటు ఇల్లు, ఇతర ఆస్తి నష్టం, రహదారులు కోతకు గురికావడం, విద్యుత్‌లైన్లు దెబ్బతిన్నట్లు తెలిపారు. ములుగు మండలం చిన్న తిమ్మాపూర్‌లో కేంద్ర బృందం దెబ్బతిన్న వరిపంటను పరిశీలించింది. నష్టపోయిన రైతులతో బృందం సభ్యులు మాట్లాడారు. అధిక వర్షాలకు కోతకు వచ్చిన వరిపైరు నేలరాలడంతో పనికి రాకుండా పోయిందని, దోమపోటుతో పాటు వివిధ రకాల తెగుళ్ల బెడద అధికమైనట్లు రైతులు కేంద్ర బృందం ముందు కన్నీరు మున్నీరయ్యారు. అనంతరం ములుగు మండలం అన్నసాగర్‌లో వర్షాలకు కొట్టుకుపోయిన కల్వర్టును పరిశీలించారు. రూ.4.50 లక్షలతో నిర్మించిన కల్వర్టు కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రవాణా సౌకర్యం దెబ్బతినడమే కాకుండా చుట్టుపక్కల పొలాలు వరదతో ఇసుక మేటలు ఏర్పడడం, నీటి నిల్వతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని స్థానిక రైతులు దెబ్బతిన్న పంటలను బృందానికి చూపించారు. ములుగులో దెబ్బతిన్న పత్తి చేళ్లను బృందం పరిశీలించింది. కేంద్ర బృందం వస్తున్న సమాచారాన్ని తెలుసుకున్న రైతులు పెద్దసంఖ్యలో దెబ్బతిన్న పత్తి చెట్లతో కేంద్ర బృందానికి తమ గోడును వెలిబుచ్చారు. పత్తి తొలిదఫా సేకరించకముందే వర్షాలు మొదలు కావడంతో పంట పూర్తిస్థాయిలో దెబ్బతిన్నదన్నారు. ప్రస్తుత పరిస్థితులతో వందశాతం నష్టానికి గురైందని రైతులు కేంద్ర బృందానికి చెప్పారు. తమను ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు. మర్కూక్‌లో దెబ్బతిన్న వరిపంటను బృందం పరిశీలించింది. బొమ్మ ఎల్లయ్య అనే రైతును బృందం పలుకరించగా, కంటతడి పెట్టుకున్నాడు. తాను వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని వరి సాగు చేశానని, ఆరునెలల కష్టం కోతకు వచ్చిన సమయంలో నేలపాలైందన్నారు. అనంతరం బృందం మర్కూక్‌ గ్రామంలోని కమ్మరివాని కుంటను పరిశీలించింది.  

భారీ ఎత్తున నష్టం...

వానకాలం పంటలు చేతికందే సమయంలో వరద తాకిడికి గురై తీవ్రంగా దెబ్బతిన్నట్లు కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి కేంద్ర బృందానికి వివరించారు. వరి, పత్తితో పాటు ఉద్యానవన పంటలు అధికంగా నష్టానికి గురయ్యాయన్నారు. తెలంగాణలో గత 30ఏండ్లలో లేని విధంగా 120రోజుల్లో 82రోజులు వర్షం కురిసిందన్నారు. అక్టోబర్‌లో అత్యధిక వర్షపాతం నమోదైందన్నారు. సాధారణ వర్షపాతం 760.2 మిల్లీమీటర్లకు గాను, ఇప్పటివరకే 1449.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందన్నారు. అక్టోబర్‌లో మూడు రోజుల్లో 20సెంటీమీటర్ల వర్షం నమోదైందన్నారు. వానాకాలంలో సిద్దిపేట జిల్లావ్యాప్తంగా 23 మండలాల్లో 5.33 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా, అన్ని పంటలు పెద్దమొత్తంలో నష్టానికి గురైనట్లు కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి బృందానికి వివరించారు. 

వరి 2,29,542 ఎకరాల్లో సాగు కాగా, 41,708 ఎకరాల్లో నష్టానికి గురైందన్నారు. పత్తి 2,43,74 ఎకరాల్లో సాగు కాగా, 37,443 ఎకరాల్లో పంటనష్టానికి గురైంది. 44,841 ఎకరాల్లో కంది సాగు కాగా, 2,245 ఎకరాల్లో, 2,375 ఎకరాల్లో కూరగాయ పంటలు నష్టానికి గురైనట్లు కలెక్టర్‌ తెలిపారు. 62,745 మంది రైతులు రూ.423.70 కోట్ల మేర పంట నష్టానికి గురయ్యారన్నారు. 

ఇతర నష్టాలు... 

అధిక వర్షాలకు 3,047 నివాసగృహాలు, పాక్షికంగా దెబ్బతిన్నాయని, ముగ్గురు చనిపోయారని, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌ పరిధిలో రహదారులు 324 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయని కలెక్టర్‌ బృందానికి తెలిపారు. ఇందుకు గాను 17.54 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. పంచాయతీరాజ్‌కు చెందిన 70 కిలోమీటర్ల రోడ్లు 13 చోట్ల కోతకు గురికాగా, రూ.18.17 కోట్ల నష్టం ఏర్పడిందన్నారు. విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు లైన్లు దెబ్బతిని 1.81 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు కేంద్ర బృందానికి కలెక్టర్‌ వివరించారు. ఇంకా ఈ పర్యటనలో వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, అదనపు సంచాలకుడు విజయ్‌కుమార్‌, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, డీఏవో శ్రావణ్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ కనకరత్నం, ఇరిగేషన్‌ ఈఈ శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.