బుధవారం 25 నవంబర్ 2020
Siddipet - Oct 22, 2020 , 00:37:01

రాజీవ్‌ రహదారి ప్లాంటేషన్‌ పూర్తి చేయాలి

రాజీవ్‌ రహదారి ప్లాంటేషన్‌ పూర్తి చేయాలి

సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి

సిద్దిపేట కలెక్టరేట్‌ : వచ్చే 20 రోజుల్లో రాజీవ్‌ రహదారి అవెన్యూ ప్లాంటేషన్‌లో ఉన్న గ్యాప్‌ల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం వంటి మామిడి నుంచి తోటపల్లి వరకు రాజీవ్‌ రహదారి వెంబడి డివైడర్‌తో పాటు రహదారికి ఇరువైపులా 33 గ్రామాల పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమంపై అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అటవీ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారుల మధ్య సమన్వయం లోపించిందన్నారు. మిషన్‌ మోడ్‌లో సాగాల్సిన ప్లాంటేషన్‌ ప్రణాళిక లోపం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. రహదారి డివైడర్‌తో పాటు ఇరువైపులా గ్యాప్‌లను గుర్తించి మొక్కలు నాటేందుకు, వాటరింగ్‌, నాటిన మొక్కలు పర్యవేక్షణ, సంరక్షణకు 5 కోట్ల 72 లక్షలతో అధికారులు ప్రతిపాదనలు సమర్పించారన్నారు. గడా, సుడా, ఉపాధి హామీ పథకం, పల్లె ప్రగతి కింద నిధులను మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులకు సంబంధించి ఉత్తర్వులు ఇది వరకే జారీ చేశామన్నారు. రాజీవ్‌ రహదారి పై 91 కి.మీ మేర వేగంగా మొక్కలు నాటేందుకు సమావేశం ఏర్పాటు చేసుకోవాలని అటవీ శాఖ అధికారి శ్రీధర్‌, డీఆర్‌డీవో గోపాల్‌రావు, డీపీవో సురేశ్‌, హుస్నాబాద్‌, సిద్దిపేట, గజ్వేల్‌ రెవెన్యూ డివిజన్‌ వారీగా అటవీ, ఉపాధి హామీ సిబ్బంది కార్యదర్శులతో గురువారం సమావేశం నిర్వహించుకోవాలని కలెక్టర్‌ సూచించారు. 

నిబంధనల ప్రకారం కౌంటింగ్‌ ఏర్పాట్లు.. 

కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారం దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నిక కౌంటింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి వెంకట్రామ్‌రెడ్డి ఎన్నికల కమిషన్‌ అధికారులకు వివరించారు. ఢిల్లీ నుంచి ఎన్నికల కమిషన్‌ అధికారులు కౌంటింగ్‌ నిర్వహణ ఏర్పాట్లపై బీహార్‌తో పాటు ఉప ఎన్నికలు జరుగుతున్న అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఆర్వోలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి, వెంకట్రామ్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ పద్మాకర్‌, రిటర్నింగ్‌ అధికారి బి.చెన్నయ్య, ఎన్నికల నోడల్‌ అధికారి జయచంద్రారెడ్డి, కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు కలెక్టరేట్‌ నుంచి బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు వచ్చే నెల 10న నిర్వహించనుండడంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సౌకర్యంతో పాటు వీడియో గ్రఫీ చేస్తున్నామన్నారు.  

చింతమడక పునర్నిర్మాణ పనులు వేగం చేయండి  

సిద్దిపేట రూరల్‌ : సిద్దిపేట రూరల్‌ మండలం చింతమడకలో వివిధ దశల్లో పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో చింతమడక మధిర గ్రామాల అభివృద్ధి పనుల ప్రగతిపై ఆర్డీవో అనంతరెడ్డి, తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, ఎంపీడీవో సమ్మిరెడ్డి, ఇతర శాఖల అధికారులతో సమీక్షించారు. చింతమడకతో పాటు మధిర గ్రామాలైన అంకంపేట, దమ్మచెరువు, సీతారాంపల్లి గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి పై ఆరా తీశారు. సమీక్షలో డీఈ రామచంద్రం, చింతమడక ప్రత్యేక అధికారి శ్యామ్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.