గురువారం 03 డిసెంబర్ 2020
Siddipet - Oct 22, 2020 , 00:36:54

దుబ్బాక ఆడబిడ్డలు దుమ్ములేపిండ్రు..

దుబ్బాక ఆడబిడ్డలు దుమ్ములేపిండ్రు..

మహిళా శక్తి ఏమిటో కాంగ్రెస్‌, బీజేపీకి చూపించారు.. 

ప్రజలంతా టీఆర్‌ఎస్‌ వెంటే...

సుజాతక్క గెలుపు.. మన బతుకమ్మ గెలుపు.. 

దుబ్బాక మహిళా సంఘీభావ ర్యాలీలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు 

దుబ్బాక: ఈ రోజు భారీగా తరలివచ్చిన అక్కాచెల్లెండ్లతో దుబ్బాక దుమ్ము లేచిపోయింది. మీ మహిళల అభిమానం చూస్తుంటే, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతక్క లక్ష ఓట్ల మెజార్టీతో గెల్వడం ఖాయమనిస్తుందని, కాంగ్రెస్‌, బీజేపీ పత్తాలేకుండా పోతాయని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. దుబ్బాకలో చదువుకున్న సీఎం కేసీఆర్‌కు మన కష్టసుఖాలు తెలుసు, అడగకుండానే బీడీ కార్మికులకు ఆసరా పింఛన్‌ ద్వారా జీవనభృతి కల్పించారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు మన తెలంగాణలో ప్రవేశపెట్టి, ఇంటికి పెద్ద కొడుకుగా సీఎం కేసీఆర్‌ అండగా నిలిచారు. వానకాలం ఉసిళ్ల మాదిరిగా దుబ్బాక గురించి తెలియని కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ఇక్కడికి వస్తే, వారిని నమ్మి మనం ఓటువేసే పరిస్థితిలో ఉన్నామా అంటూ ప్రజలను మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. బుధవారం టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో దుబ్బాక పట్టణంలో మహిళా సంఘీభావ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా దుబ్బాక మున్సిపాలిటీతోపాటు మండలంలోని అన్ని గ్రామాల నుంచి భారీసంఖ్యలో మహిళలు తరలివచ్చారు. అంచనాకు మించి మహిళలు స్వచ్ఛందంగా తరలి రావడంతో దుబ్బాక పట్టణం పూర్తిగా గులాబీమయంగా మారింది. దుబ్బాక బస్‌డిపో నుంచి అంబేద్కర్‌ సర్కిల్‌ మీదుగా తెలంగాణ తల్లి విగ్రహం వరకకు ర్యాలీ కొనసాగింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతతో మంత్రి  హరీశ్‌రావు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద మహిళా బహిరంగ సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ..  దుబ్బాకలో మా అక్కాచెల్లెళ్ల దెబ్బకు దుమ్ములేచిపోయింది. కాం గ్రెస్‌, బీజేపీ వాళ్లు పరాయి నాయకులు, కిరాయి మనుషులపైనే ఆధారపడ్డారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాతక్క గెలుపు.. మహిళలుగా తమ గెలుపు .. మన బతుకమ్మ గెలుపుగా భావిస్తున్నారన్నారు. 

దుబ్బాకపై సీఎం కేసీఆర్‌కు ఎనలేని ప్రేమ...

చింతమడకలో పుట్టి.. దుబ్బాకలో చదువుకున్న కేసీఆర్‌కు దుబ్బాక పైన ప్రేమ ఉంటుంది. కానీ, పరాయి నాయకులకు ప్రేమ ఉంటదా..? బీడీ పెన్షన్లకు రూ.1600 ఇస్తున్నామని బీజేపీ చెబుతున్నది. బీడీ కార్మికులకు రూ. 1600 ఇస్తున్నట్లు సాక్షాలు, ఆధారాలతో నిరూపిస్తే నా ఆర్థిక శాఖ మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా...! మరీ రూ.1600 ఇవ్వకపోతే నువ్వు రాజీనామాకు సిద్ధమా..? అని బండి సంజయ్‌కు  మంత్రి సవాల్‌ విసిరారు. బీడీ కార్మికులకు రూ.1600 కాదు కదా.. పదహారు పైసలు కూడా ఇవ్వడం లేదన్నారు. బీజేపీ వాళ్ల సోషల్‌ మీడియా ‘పుకార్ల పుట్ట.. అబద్దాల గుట్ట ’అంటూ ఆయన మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో రూ.500 పింఛన్‌ ఇస్తే, సీఎం కేసీఆర్‌ ఇక్కడ రూ.2000 ఇస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ చేసిందే చెబుతుంది.. చెప్పిందే చేస్తుందని మంత్రి అన్నారు.

అందుకే కాంగ్రెస్‌. బీజేపీ 

తప్పుడు ప్రచారం...

కాంగ్రెస్‌, బీజేపీలు ప్రజలకు చేసిన మంచి పనులు లేకనే.. గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.  ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు కేం ద్రమే నిధులు ఇస్తోందని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా రైతులకు ఉచిత కరెంట్‌, బీడీ పింఛన్లు, కల్యాణలక్ష్మి , రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తున్నారా అని మంత్రి ప్రశ్నించారు. ఇప్పుడు  బీజేపీ నాయకులు ఏం చేస్తామని ప్రచారం చేస్తున్నారు..? విద్యుత్‌ మీటర్లు పెడుతామని ఓట్లు అడుగుతారా..? విదేశీ మక్కలు తెచ్చి రైతుల పొట్టలు కొడుతామని అడుగుతారా..? ఎవరి ప్రయోజనాల కోసం విదేశీ మక్కలు తెస్తున్నారో బీజేపీ చెప్పాలన్నారు. బాయిలకాడ మీటర్లు పెట్టమని కేంద్రమే చెప్పింది.. ఆధారాలతో సహా చూపాం. 

ప్రతి పనిలో సీఎం కేసీఆర్‌ కనిపిస్తారు...

దుబ్బాక ప్రజలు అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరుకుంటున్నారు. ఏ ఇంట్లో నల్లా తిప్పినా ఆ నీళ్లలో కేసీఆర్‌ కనిపిస్తారు. బతుకమ్మ పండుగ వస్తే కన్న కొడుకు మర్చిపోయిన కేసీఆర్‌ పెద్ద కొడుకోలే బతుకమ్మ చీరె పంపించారు. దుబ్బాక నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదల కోసం 2500 ఇండ్లు నిర్మించామన్నారు. ఈ అభివృద్ధి విపక్షాల కండ్లకు పొరలు కమ్మి కనిపించడం లేదన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలు ఎండమావుల లాంటి పార్టీలన్నారు. దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి తుది శ్వాస వరకు దుబ్బాక ప్రజల కోసమే పనిచేశారని, ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి సుజాతక్కను భారీ మెజార్టీతో గెలిపించడం దుబ్బాక ప్రజల బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు. ర్యాలీలో మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, దుబ్బాక మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గన్నె వనితారెడ్డి, ఎంపీపీ పుష్పలత, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు రొట్టె రాజమౌళి, వెంకట నర్సింహారెడ్డి, మద్దుల నాగేశ్వర్‌రెడ్డి, నేషనల్‌ లేబర్‌  కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ డైరెక్టర్‌ రాజ్యలక్ష్మి, కౌన్సిలర్లు, సర్పంచు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

రోడ్‌ షో గ్రాండ్‌ సక్సెస్‌..

దుబ్బాక టౌన్‌: దుబ్బాక గులాబీవనంగా మారింది. ఇసుక పోస్తే రాలనంతగా పట్టణమంతా గులాబీ వనాన్ని తలపించింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతకు మద్దతుగా బుధవారం నిర్వహించిన రోడ్‌ షోకు మంత్రి హరీశ్‌రావు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ముందుగా దుబ్బాక బస్‌డిపో చౌరస్తా నుంచి ప్రారంభమైన రోడ్‌షోకు సుమారు 10వేలకు మందికి పైగా మహిళలు తరలివచ్చారు. మహిళలు బతుకమ్మలు, మంగళహారతులు, ఆటలు, లంబాడీల నృత్యా లు, కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. డిపో నుంచి ప్రారంభమైన రోడ్‌షో పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. పట్టణంలోని బస్‌స్టాండ్‌, కొత్త రోడ్‌, గాంధీ, అంబేద్కర్‌ చౌరస్తా, లాల్‌బహుదూర్‌శాస్త్రి చౌరస్తా మీదుగా తెలంగాణ చౌరస్తా వద్దకు రోడ్‌షో చేరుకుంది. బస్‌డిపో నుంచి మొదలైన రోడ్‌ షో గాంధీ విగ్రహం వరకు సుమారు కిలోమీటరు పొడవునా జనంతో నిండిపోయింది. గులాబీ జెండాలు, జై తెలంగాణ, జై కేసీఆర్‌, జై హరీశ్‌రావు, జై సుజాతక్క అంటూ నినాదాలతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు హోరెత్తించారు.  

తరలివచ్చిన మహిళలు

పట్టణంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మహిళలతో నిర్వహించిన రోడ్‌షో గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యింది. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మహిళలు పెద్దఎత్తున తరలి వచ్చి రోడ్‌షోలో పాల్గొని తమ అభిమానాన్ని చాటారు.  మం డలంలోని 32 గ్రామాలతో పాటు దుబ్బాక మున్సిపల్‌ పరిధిలోని 20 వార్డుల నుంచి మహిళలు తరలివచ్చి సోలిపేట సుజాతను దీవించారు. ఓ వీరాభిమాని మంత్రి ప్రయాణిస్తున్న ప్రచార వాహనంపై ఎక్కి పూల బుట్టితో పూలవర్షం కురిపించాడు. బీజేపీని విమర్శిస్తూ మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్దఎత్తున మంత్రికి మద్దతు పలుకుతూ జై తెలంగాణ నినాదాలతో సభా ప్రాంగణమంతా మార్మోగించారు. 

సమన్వయంతో బాధ్యతలు నిర్వహించిన

 ఎన్నికల ఇన్‌చార్జిలు...

దుబ్బాకలో నిర్వహించిన రోడ్‌షో విజయవంతంలో  గ్రామాలు, వార్డుల ఎన్నికల ఇన్‌చార్జిలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌తోపాటు కౌన్సిలర్లు, ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్‌రెడ్డి, జడ్పీటీసీ కడతల రవీందర్‌రెడ్డి, మండలంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కీలకపాత్ర పోషించారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ కడవేర్గు రాజనర్సు, ఆయా వార్డులు ఎన్నికల ఇన్‌చార్జిలు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు రొట్టె రాజమౌళి, స్థానిక నాయకుల సమన్వయంతో రోడ్‌ షోను విజయవంతం చేశారు. రోడ్‌ షో గ్రాండ్‌ సక్సెస్‌ కావడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని కలిగించింది.


యువత బీజేపీ గోబెల్స్‌

 ప్రచారాన్ని తిప్పికొట్టాలి 

-ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు 

సిద్దిపేట కలెక్టరేట్‌:  సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో నేడు తెలంగాణ పల్లెలన్నీ మార్పుదిశగా పయణిస్తున్నాయి. కాంగ్రెస్‌ 70 ఏండ్ల పాలనలో జరుగని అభివృద్ధిని ఆరేండ్లలో చేసి చూపించామని, యువత అభివృద్ధి వైపు ఉంటారో..లేదా మార్పింగ్‌, ఫేక్‌ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారి వైపు ఉంటారో ఆలోచించాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో దుబ్బాక నియోజకవర్గంలోని ఎనగుర్తి, ధర్మారం, చౌదర్‌పల్లి, ఎల్లారెడ్డిపేట గ్రామాలకు చెందిన శ్రేష్ట భారత్‌, బీజేపీ, కాంగ్రెస్‌లకు చెందిన యువకులు పెద్ద ఎత్తున మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వీరికి మంత్రి హరీశ్‌రావు టీఆర్‌ఎస్‌ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ చేస్తున్న దొంగ ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌, నాయకులు తీపిరెడ్డి మహేందర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

కాంగ్రెస్‌, బీజేపీ నాయకులది దొంగాట 

- మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలు మన తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అమలు చేస్తుంటే, ఇదంతా మేమే చేశామంటూ ఓ పక్క బీజేపీ.. మరోపక్క కాంగ్రెస్‌లు పోటీపడుతూ ప్రచారం చేసుకుంటున్నాయి. దుబ్బాకలో పదిహేను రోజుల నుంచి కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు దొంగ నాటకాలు ఆడుతున్నారంటూ ఆయన దుయ్యబట్టారు.  అభివృద్ధి అంతా నాదే అని ఎవ్వరికి వారే కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ప్రకటించుకుంటున్నారు. చెయ్యని పనులు చేశామని చెప్పుకునేందుకైనా ఆ రెండు పార్టీలకు సిగ్గుండాలి. రాష్ట్రంలోనే అత్యధికంగా పింఛన్లు, రైతుబంధు, డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు దుబ్బాకలో ఉన్నాయి. త్వరలోనే  మల్లన్నసాగర్‌ పూర్తికానున్నది. దీంతో ఏడాదికి రెండు పంటలు రైతులు పండించుకోవచ్చు. మల్లన్న సాగర్‌ కాల్వలకు కాలు అడ్డం పెట్టిన  కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు.. ఇప్పుడు రైతుల వద్దకు ఏ ముఖం పెట్టుకుని  ఓట్లు అడుగుతున్నారనీ ఆయన ప్రశ్నించారు. 


ఆడబిడ్డను హేళన చేయడం 

సంస్కారమా...

- మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి  

తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు వరుసలో నిలబడి, సమైక్య పాలకులను తరిమికొట్టిన గడ్డ దుబ్బాక అని మెదక్‌ ఎమ్మెలే పద్మా దేవేందర్‌రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బీజేపీ, కాంగ్రెస్‌ పాత్ర ఏముంది..? రాజీనామాలు చేయమంటే చేశారా..? తెలంగాణ వస్తే కరెంట్‌ లేక చీకటి జీవితాలు గడపాల్సి  వస్తుందని భయపెట్టించారు. మరీ ఇప్పుడు 24 గంటల కరెంట్‌ ఏ విధంగా వస్తుందని కాంగ్రెస్‌, బీజేపీ నాయకులను ఆమె ప్రశ్నించారు. మంచినీళ్ల కష్టం మా అక్కాచెల్లెళ్లకు బాగా తెలుసు, తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్‌ గడపగడపకూ నల్లా నీళ్లు ఇచ్చి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని నిలిపారు. పుట్ట్టెడు దుఃఖాన్ని కడుపులో పెట్టుకొని మీ సేవ కోసం సుజాతక్క మీ ముందుకు వచ్చింది. ఆడబిడ్డ దుఃఖాన్ని బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు హేళన చేసి మాట్లాడడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి విమర్శించారు.

సీఎం కేసీఆర్‌ నమ్మకాన్ని వమ్ము చేయను.. 

- టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత

ఉప ఎన్నికల్లో మీ వద్దకు ఈ విధంగా వస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఈ ఎన్నికలు నా అదృష్టమో..లేక దురదృష్టమో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. సీఎం కేసీఆర్‌ నాపై నమ్మకంతో పోటీచేసేందుకు మీ వద్దకు పంపించారు. ఆయన అడుగుజాడల్లో ఉంటూ దుబ్బాక ప్రజలకు సేవ చేస్తామని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత అన్నారు. ఈ సందర్భంగా ఆమె కంట్లో నుంచి వచ్చిన కన్నీటిని తుడుచుకుంటూ మరో పక్క తన ప్రసంగాన్ని కొనసాగించింది.  రామలింగారెడ్డి ఉన్నన్ని రోజులు దుబ్బాక ప్రజల సేవలోనే ఉన్నాడని, గత నిరంకుశ ప్రభుత్వాల్లో ప్రజల పక్షాన ఉండి ఎన్నో  పోరాటాలు, ఉద్యమాలు చేశాడని,  ఉంటే ప్రజల్లో ఉంటా.. లేదంటే పాడె మీద ఉంటానని చెప్పేవాడన్నారు. నియోజకవర్గ ప్రజలే తన కుటుంబంగా భావించిన రామలింగారెడ్డి, తన చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే గడిపారు. సీఎం కేసీఆర్‌ తండ్రిలాగా నన్ను ఆశీర్వదించి మీసేవ కోసం పంపించారు. ఉప ఎన్నికల్లో మీ ఆశీస్సులు అందించాలని ఆమె కోరారు. సీఎం కేసీఆర్‌ అడుగు జాడల్లో నడిచి, రామలింగన్న ఆశయాలను కొనసాగిస్తామన్నారు.