గురువారం 26 నవంబర్ 2020
Siddipet - Oct 21, 2020 , 00:31:46

మనం చేసింది చెబుదాం..

మనం చేసింది చెబుదాం..

ఏం ఉద్ధరించారని కాంగ్రెస్‌, బీజేపీ ఓట్లు అడుగుతాయి?  

కోర్టుల్లో కేసులు వేయడంతోనే ముంపు గ్రామాల ప్రజలకు అన్యాయం

ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

దుబ్బాకలో కాంగ్రెస్‌,  బీజేపీ ఖాళీ..  

టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు, యువకులు

తొగుట : వానకాలం వస్తే ఉసిల్లు వచ్చినట్లు.. ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్‌, బీజేపీ నాయకులకు ముంపు గ్రామాల ప్రజలు యాదికొస్తారా? అని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. మంగళవారం తొగుటలో కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు లక్ష్మణ్‌గౌడ్‌తోపాటు తుక్కాపూర్‌లోని బీజేపీ, కాంగ్రెస్‌కు చెం దిన ముగ్గురు వార్డు సభ్యులు, తొగుటకు చెందిన 100మంది యువకులు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2018 ఎన్నికల్లో బీజేపీ నాయకుడు మల్లన్నసాగర్‌కు వెళ్లి, ‘మీకు అన్యాయం జరిగింది.. కోర్టులో కేసు వేసి న్యాయం చేస్తా’ అని మొసలి కన్నీరు కార్చాడని గుర్తు చేశారు. ‘మాయమాటలు నమ్మిన యువకులు ఎన్నికల తర్వాత ఫోన్‌ చేస్తే, అతను ఫోన్‌ ఎత్తడం లేదని.. వారు తనతో వాపోయారని’ మంత్రి చెప్పారు. మీద రంగనాయక్‌ సాగర్‌, కింద కొండపోచమ్మ ప్రాజెక్టులు పూర్తవగా, మధ్యలో మల్లన్నసాగర్‌ కేవలం ప్రతిపక్ష నాయకుల కోర్టు కేసుల మూలంగానే ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు ప్రజలకు దామోదర రాజనర్సింహ ఏమీ ఒరుగబెట్టాడని ప్రశ్నించారు. గతంలో ప్రతిపక్ష నాయకుల మాటలను నమ్మిన ముంపు గ్రామాలైన లక్ష్మాపూర్‌, రాంపూర్‌, బంజేరుపల్లి, వేములఘాట్‌, పల్లెపహాడ్‌, ఏటిగడ్డ కిష్టాపూర్‌ గ్రామాల యువకులు నేడు టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటిస్తున్నారన్నారు. మూడు వేల మంది ముంపు గ్రామాల ప్రజలు తమ వద్దకు వచ్చి మద్దతు తెలిపారన్నారు.

  సైదారెడ్డి ప్రశ్నకు ఉత్తమ్‌కుమార్‌ జవాబివ్వాలి

హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సైదిరెడ్డి చెప్పిన రూ. 300 కోట్ల అభివృద్ధి జవాబుకు సమాధానం చెప్పాలని మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. వారు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లాంటి పథకాలు అమలు చేయనందు కు కాంగ్రెస్‌కు ఓట్లు వేయాలా? అని ప్రశ్నించారు. కరువు, కాటకాలకు అప్పుల బాధతో ఆత్మహత్యలు, అనారోగ్యంతో మరణించిన రైతులను కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని, రైతుబీమాతో రైతు మరణించిన 11 రోజుల్లో రూ.5లక్షల పరిహారం అందిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్‌కు కార్యకర్తలు కరువయ్యారని, దుబ్బాకలో పీసీసీ అధ్యక్షుడు వెళ్లిన సమావేశానికి నలుగురు కార్యకర్తలు కూడా రావడం లేదన్నారు. నారాయణఖేడ్‌, పాలేరు, హుజూర్‌నగర్‌లో ఘన విజయం సాధించినట్లు దుబ్బాకలో సోలిపేట సుజాతమ్మ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల్లో మిగిలిపోయిన 10 శాతం న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దివంగత సోలిపేట రామలింగారెడ్డి హయాంలో రూ.800 కోట్లతో ఇంటింటికీ తాగునీరు, 18 సబ్‌ స్టేషన్లు, 133/33 కేవీ సబ్‌ స్టేషన్‌, 1500 ట్రాన్స్‌ఫార్మర్లు, వేల సంఖ్యలో విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతిపక్ష పార్టీల గోబెల్‌ ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదని, సోలిపేట సుజాతకు గ్రామగ్రామాన ప్రజలు మంగళ హారతులతో, డప్పు చప్పుల్లతో స్వాగతం పలుకుతున్నారన్నారు. 

 కాంగ్రెస్‌, బీజేపీ డిపాజిట్‌ గల్లంతు : ఎంపీ ప్రభాకర్‌రెడ్డి

దుబ్బాక ఉపఎన్నికలో కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు డిపాజిట్‌ కోల్పోవడం ఖాయమని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. తొగుట మండలం మొదటి నుంచి టీఆర్‌ఎస్‌ కోట అన్నారు. కాంగ్రెస్‌లో ముత్యంరెడ్డి కుటుంబీకుల పెత్తనం నచ్చకనే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు   లక్ష్మణ్‌గౌడ్‌ తెలిపారు. సోలిపేట సుజాత ఘన విజయానికి కృషి చేస్తామని చెప్పారు. 

 కార్యక్రమంలో అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, జడ్పీటీసీ గాంధారి ఇంద్రసేనారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర కమిటీ సభ్యుడు దేవీరవీందర్‌, సర్పంచ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ గడీల అనిత లక్ష్మారెడ్డి, వైస్‌ ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, కుర్మ యాదగిరి, ఎంపీటీసీలు పాగాల కొండల్‌రెడ్డి, సుతారి రమేశ్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మం డలాధ్యక్షుడు చిలువేరి మల్లారెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు బోధనం కనకయ్య, నాయకులు చెరుకు కొండల్‌రెడ్డి, పబ్బతి శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహారెడ్డి, అనిల్‌ పాల్గొన్నారు.