బుధవారం 25 నవంబర్ 2020
Siddipet - Oct 20, 2020 , 05:29:33

అన్నపూర్ణా దేవీగా అమ్మవారు

అన్నపూర్ణా దేవీగా అమ్మవారు

సిద్దిపేట టౌన్‌ : దేవీ నవరాత్రోత్సవాలు సిద్దిపేటలో భక్తిశ్రద్ధలతో కోనసాగుతున్నాయి. మండపాల వద్ద అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, కుంకుమార్చన  చేశారు. పట్టణంలోని పార్వతీదేవి ఆలయంలో పార్వతీపరమేశ్వరుల కల్యాణాన్ని ఆలయ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు  అన్నపూర్ణేశ్వరి, కన్యకాపరమేశ్వరి, రేణుకామాత, సంతోషిమాత ఆలయాల్లో ఉత్సవాలు జరుగుతున్నాయి. 

అన్నపూర్ణాదేవీ అవతారంలో..

హుస్నాబాద్‌: దేవీ శరన్నవరాత్రులు హుస్నాబాద్‌ పట్టణంతో పాటు డివిజన్‌లోని అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం అమ్మవారు భక్తులకు అన్నపూర్ణాదేవీ అవతారంలో దర్శనమిచ్చారు. విద్యుత్‌దీపాలతో అందంగా అలంకరించిన మండపాల్లో భక్తులు భౌతిక దూరం పాటిస్తూ దుర్గాదేవీని దర్శించుకుంటున్నారు. 

గాయత్రి దేవీగా 

కొండపాక: కొండపాక మండలం మర్పడగ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం విజయదుర్గామాత గాయత్రిదేవీగా భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారికి  అభిషేకాలు పూజలు నిర్వహించారు.

 అర్ధనారీశ్వరీ అలంకారంలో  ..

గజ్వేల్‌అర్బన్‌: గజ్వేల్‌ పట్టణంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. సోమవారం శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా గజ్వేల్‌ మహంకాళీని కల్యాణిగా అలంకరించి అమ్మవారిని పూ జలు, కుంకుమార్చనలు, గోపూజ, చండిహోమం నిర్వహించారు. అలాగే ప్రసన్నాంజనేయస్వామి ఆల య ప్రాంగణంలోని సంతోషిమాత ఆలయంలో అమ్మవారు అర్ధనారీశ్వరీగా భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయంలో ఉత్సవమూర్తికి  పూజలు, కుంకుమార్చనలు, లక్ష పుష్పార్చనలు నిర్వహించారు. 

శివాలయంలో తాగు నీటి వసతి

 హుస్నాబాద్‌టౌన్‌: పట్టణంలోని కాశీమరకత లింగేశ్వరస్వామి ఆలయంలో తాగునీటి వసతి  కల్పించేందుకు బోర్‌ పనులను సోమవారం ప్రారంభించారు. పట్టణంలోని పురాతన ఆలయాన్ని పునరుద్ధరించడంతో స్వామి దర్శనం కోసం భక్తులు పెద్దసంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ తరుణంలో ఆలయానికి వచ్చే భక్తులకు తాగునీటి వసతిని కల్పించేందుకుగాను బోర్‌ వేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ అయిలేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్‌, మాజీ సర్పంచ్‌ కేడం లింగమూర్తి, కౌన్సిలర్‌ వల్లపు రాజు, కోఆప్షన్‌ సభ్యులు అయిలేని శంకర్‌రెడ్డి, ఆలయ కమిటీకి చెందిన మర్యాల రాజిరెడ్డి, చిత్తారి రవీందర్‌, మైదంశెట్టి వీరన్న, తనుకు ఆంజనేయులు, శంకర్‌, పూజారి అనిల్‌శర్మ తదితరులు ఉన్నారు. 

కరోనా నిబంధనలతో దసరా ఉత్సవాలు

సిద్దిపేట అర్బన్‌ : దసరా ఉత్సవాలను ఈ సంవత్సరం  సాదా సీదాగా నిర్వహిస్తున్నామని 8వ వార్డు కౌన్సిలర్‌ బండారి నర్సింహులు, జమ్మి హనుమాన్‌ దేవాలయ ప్రధాన అర్చకుడు మృత్యుంజయ శర్మలు తెలిపారు.  దసరా రోజు కేవలం  స్వామి వారి దర్శనం మాత్రమే ఉంటుందని దీనికి భక్తులు సహకరించాలన్నారు. సిద్దిపేట 8వ వార్డు నర్సాపూర్‌ హనుమాన్‌ దేవాలయంలో  సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ  దసరా  రోజున  జమ్మి హనుమాన్‌ దర్శనానికి రావాలనుకునే  భక్తులు  కరోనా నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకోవాలని సూచించారు.  ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతికదూరం పాటిస్తూ  శానిటైజర్‌ వాడాలన్నారు.  ఈ కార్యక్రమంలో పంతులు వెంకన్న పాల్గొన్నారు.