గురువారం 26 నవంబర్ 2020
Siddipet - Oct 20, 2020 , 05:29:35

పండ్ల చెట్టుకు నీళ్లు పోస్తే కాయకాస్తుంది.. ముండ్ల చెట్టుకు పోస్తే ఏం లాభం..?

పండ్ల చెట్టుకు నీళ్లు పోస్తే కాయకాస్తుంది.. ముండ్ల చెట్టుకు పోస్తే ఏం లాభం..?

దౌల్తాబాద్‌: “పండ్ల చెట్టుకు నీళ్లు పోస్తే కాయకాస్తుంది.., ప్రజలకు తినడానికి వస్తుంది, ముండ్ల చెట్టుకు నీళ్లు పోస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు.., అలాగే ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు పట్టం కట్టాలి” అని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మండల పరిధిలోని గువ్వలేగి, ఉప్పరపల్లి, పోసంపల్లి, గోవిందాపూర్‌, కోనాయిపల్లి, దీపాయంపల్లి గ్రామాల్లో ఆమె మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పాలనలో రైతులు ఎరువుల కోసం చెప్పులను లైన్లల్లో పెట్టినా ఒక సంచి బస్తా కూడా దోరుకకాపోయేదని, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రైతులకు కావలసినంత ఎరువులు టీఆర్‌ఎస్‌ సర్కార్‌ సకాలంలో అందిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ప్రవేశపెట్టడం లేదని ప్రశ్నించారు. ప్రజల అభివృద్ధి పట్టని ప్రతిపక్ష పార్టీలు తాము చేశామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం పింఛన్లను మేమే ఇస్తున్నామని ప్రజలకు తప్పుడు సంకేతాలను ఇస్తున్నదని, ఇలాంటి సమాచారం మానుకోవాలని మండిపడ్డారు. గత ప్రభుత్వాల హయాంలో రైతులు పండించిన పంటలను అమ్ముకోవాలంటే మధ్యవర్తులే దిక్కయ్యేవారన్నారు. దీంతో గిట్టుబాటు కాక రైతన్నలు నష్టపోయేవారని, కానీ తెలంగాణ ప్రభుత్వంలో గ్రామానికో ఐకేపీ, కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసి రైతులు పండిచిన ధాన్యానికి మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం రైతుల నడ్డి విరిచేలా చట్టాలను చేస్తూ వారి పాలిట శాపంగా మారుతుందన్నారు. 

టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఘన స్వాగతం..

మండల పరిధిలో ప్రచారం నిర్వహించేందుకు వెళ్లిన టీఆర్‌ఎస్‌ నాయకులకు ఘన స్వాగతం లభించింది. ఆయా గ్రామాల ప్రజలు డప్పు చప్పుళ్లు, పోతరాజుల వేషధారణలు, బోనాలు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. దీపాయంపల్లిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతకు గొల్లకుర్మలు గొర్రెపిల్లను బహూకరించారు. అదే గ్రామానికి చెందిన చిన్నారి నారెడ్డి సురక్షిత దాచుకున్న రూ.500ను ఎన్నికల ఖర్చు కోసం అభ్యర్థికి అందజేశారు. ప్రచారంలో ఎంపీపీ గంగాధరి సంధ్య, జడ్పీటీసీ రణం జ్యోతి, వైస్‌ఎంపీపీ అల్లి శేఖర్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షడు ఆదివెంకన్న, ఆయా గ్రామాల సర్పంచ్‌లు అల్లి లతామధుసూదన్‌రెడ్డి, చిత్తారిగౌడ్‌, మల్లేశంగౌడ్‌, సురేందర్‌రెడ్డి, లావణ్యనర్సింహారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీటీసీలు ననీన్‌కుమార్‌, దేవేందర్‌, వీరమ్మమల్లేశం తదితరులుపాల్గొన్నారు.