ఆదివారం 29 నవంబర్ 2020
Siddipet - Oct 20, 2020 , 05:29:54

సింగూరు నీటితో.. సిరుల పంటలు పండాలి

సింగూరు నీటితో.. సిరుల పంటలు పండాలి

పుల్కల్‌ : సింగూరు ప్రాజెక్టు నీటితో యాసంగిలో సిరులు పండించాలని అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ రైతులకు సూచించారు. సోమవారం సింగూరు ప్రాజెక్టు నుంచి చెరువులు నింపడానికి తూమ్‌లను తెరిచి కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. అనంతరం రైతులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రాజెక్టులో నీళ్లు లేనందున రెండేండ్ల నుంచి సాగునీటిని అందించలేకపోయామని తెలిపారు. ఈ సారి సింగూరు ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో సాగునీటికి ఢోకాలేదన్నారు. కుడి, ఎడమ కాలువల ద్వారా 40 వేల ఎకరాల్లో పంటలు సాగుచేయాలని రైతులకు ఆయన సూచించారు. కాలువ పరిధిలో 170 చెరువులు ఉన్నాయని, వాటి కింద కూడా పంటలు సాగుచేయాలని కోరారు. కాలువ పరిధిలోని పుల్కల్‌, చౌటకూర్‌, అందోల్‌ మండలాల్లోని గ్రామాలు, కుడి కాలువ ద్వారా సాగునీరు అందే సదాశివపేట, మునిపల్లి మండలాల్లో యాసంగిలో  కోనసీమను తలపించేలా పంటలతో కళకళలాడాలని ఆయన ఆకాంక్షించారు. స్థానికంగా పుట్టి పెరిగిన తాను, స్థానిక రైతులకు సాగునీటిని అందిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. కాలువల్లో నిరంతరం నీరు పారేటప్పుడు రైతులు సమన్వయంతో మెలిగి, పంటలకు నీటిని సరఫరా చేసుకోవాలని సూచించారు. నీటి పారుదలలో తేడాలుంటే నీటి పారుదల శాఖ అధికారులతో సంప్రదించాలని కోరారు.  తూమ్‌లకు ప్రత్యేక పూజలు చేసి సాగునీటిని ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ విడుదల చేశారు. బొమ్మారెడ్డిగూడెంలోని నాలుగు చెరువులను వచ్చే వారం వరకు కాలువలు పూర్తి చేసి సింగూరు నీటితో నింపాలని అధికారులకు ఆయన ఆదేశించారు. అనంతరం నీటిపారుదల శాఖ ఈఈ మధుసూదన్‌ రెడ్డి, డిప్యూటీ ఈఈ రామస్వామి, ఏఈ మహిపాల్‌రెడ్డితో యాసంగి సాగునీటి విడుదలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జోగిపేట ఆత్మకమిటీ అధ్యక్షుడు యాదగిరిరెడ్డి, డైరెక్టర్‌ వీరారెడ్డి, ఎంపీటీసీ మంజుల వీరారెడ్డి, సర్పంచ్‌లు రాజుగౌడ్‌, అరుణ యాదగిరి, టీఆర్‌ఎస్‌ నాయకులు సంగమేశ్వర్‌గౌడ్‌,మన్నె మధుసూదన్‌ తదితరులు పాల్గ్గొన్నారు.