గురువారం 22 అక్టోబర్ 2020
Siddipet - Oct 18, 2020 , 01:17:56

దుబ్బాక నియోజకవర్గంలో సోలిపేట సుజాత ముమ్మర ప్రచారం

దుబ్బాక నియోజకవర్గంలో సోలిపేట సుజాత ముమ్మర ప్రచారం

జోరువాన, మండుటెండనూ లెక్కచేయని వైనం

పుట్టెడు దు:ఖంలో ప్రజల ముందుకు..

నీరా‘జనం’ పలుకుతున్న ప్రజలు 

తోడుగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ

నియోజకవర్గంలో 140 గ్రామాలకు.. 75 పల్లెల్లో ప్రచారం పూర్తి

దుబ్బాక: ఉద్యమాల గడ్డగా పేరొందిన దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ తొలిసారి మహిళా అభ్యర్థికి ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశాన్ని కల్పించింది. దివగంత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందడంతో ఆ కుటుంబానికే టికెట్‌ కేటాయించి, టీఆర్‌ఎస్‌ అండగా నిలిచింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతకు సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో పాటు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, మెదక్‌ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి అండదండలు మరింత బలాన్నిచ్చాయి. కడుపునిండా దుఃఖంతో ఉన్న సుజాతకు మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మనోధైర్యాన్ని ఇస్తూ.. ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారు. నియోజకవర్గంలో 140గ్రామాలు ఉండగా, 10రోజులుగా 75 గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత ప్రచారం విజయవంతంగా పూర్తయ్యింది. ఉప ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థుల గుండెల్లో పరుగులు పెట్టిస్తూ, మహిళామణులుగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత, మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రచారంలో దూసుకు పోతున్నారు. సోలిపేట సుజాత వెంట మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీమంత్రి సునీతాలక్ష్మారెడ్డి, సిద్దిపేట జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ, మహిళా ప్రజాప్రతినిధులు ప్రచారం చేస్తున్నారు. రాజకీయాల్లో మహిళలపై వివక్షత చూపుతున్న కాంగ్రెస్‌, బీజేపీలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత ప్రచారం నిద్రలేకుండా చేస్తున్నది. అడగడుగునా టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి నియోజకవర్గ ప్రజలు  బ్రహ్మరథం పడుతున్నారు. 

ఉత్తమ్‌ మాటలపై మహిళల ఆగ్రహం

దుబ్బాకలో మహిళా అభ్యర్థి పోటీ చేయడం కాంగ్రెస్‌, బీజేపీకి మింగుడు పడడం లేదు. ఇటీవల పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాతను ఓ మహిళా అని చూడకుండా సత్తాలేదని అవమాన పరిచేలా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నియోజకవర్గ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళకు గౌరవం ఇవ్వని కాంగ్రెస్‌, బీజేపీకి గుణపాఠం చెప్పేందుకు మహిళలు పూనుకున్నారు. దుబ్బాక శాసనసభకు మహిళా అభ్యర్థి సుజాతను టీఆర్‌ఎస్‌ పోటీచేసే అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు నియోజకవర్గంలోని నారీలోకం ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నది. ఆమెకు మెజార్టీ కట్టబెడుతామని స్పష్టం చేస్తున్నారు.

మండుటెండ, జోరువానలోనూ..

మండుటెండ, జోరువానలోనూ సోలిపేట సుజాత అలుపెరుగకుండా ప్రచారం చేయడం అందరిని విస్మయానికి గురిచేస్తున్నది. సీఎం కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి సేవలను మరిచిపోలేని నియోజకవర్గ ప్రజలు, ఆమెలో రామలింగారెడ్డిని చూస్తున్నారు. దుబ్బాక(దొమ్మాట) నియోజకవర్గంలో తొలి మహిళా ఎమ్మెల్యేగా సుజాతకు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో మహిళా ఓటర్లే అత్యధికంగా ఉండడం టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి బాగా కలిసి వస్తున్నది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు దుబ్బాక ఉప ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో సుజాతను గెలిపించేందుకు ప్రత్యేక వ్యూహం రచించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌, బీజేపీ ముఖ్య నేతలు, ఆ పార్టీకి చెందిన ఎంపీటీసీ, సర్పంచ్‌లతో  పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో కాంగ్రెస్‌, బీజేపీలు క్యాడర్‌ లేక ఖాళీగా మారాయి. మరో పక్క గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు గడపగడపకూ వెళ్లి కారు గుర్తుకు ఓటేయ్యాలని విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.

సుజాత వెంటే మహిళా నేతలు.. 

ఎన్నికల ప్రచారంలో సోలిపేట సుజాతకు అన్నీతానై మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. భర్తను కోల్పోయి పుట్ట్టెడు దుఃఖంలో ఉన్న సుజాతను ఓ పక్క ఓదార్చుతూ, మరోపక్క కాంగ్రెస్‌, బీజేపీ మోసాలను పద్మాదేవేందర్‌రెడ్డి ప్రజలకు వివరిస్తున్నారు. ఉప ఎన్నికల్లో తొలి మహిళా ఎమ్మెల్యేగా, అత్యధిక భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యంగా నియోజకవర్గంలో నిర్విరామంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పద్మాదేవేందర్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, సిద్దిపేట జడ్పీ అధ్యక్షురాలు వేలేటి రోజాశర్మ నిత్యం సుజాతకతో ప్రచారంలో పాల్గొంటున్నారు. 

పది రోజులు.. 75 గ్రామాలు..

దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 140 గ్రామాలు ఉన్నాయి. ఈనెల 5న సుజాతకు సీఎం కేసీఆర్‌ దుబ్బాక టికెట్‌ కేటాయించారు. ఈనెల 6న స్వగ్రామమైన చిట్టాపూర్‌ నుంచి సుజాతను మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, క్రాంతికిరణ్‌ ఎన్నికల ప్రచారానికి ఆహ్వానించారు. మరుసటి రోజు బుధవారం(ఈనెల 7న) నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాతను మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రచారం చేసేందుకు వెంట తీసుకెళ్లారు. మొదట కూడవెళ్లి రామలింగేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. వారం రోజుల నుంచి నియోజకవర్గంలో సుజాత ప్రచారంలో లీనమయ్యారు. 140 గ్రామాలకు గానూ ఇప్పటి వరకు 75గ్రామాల్లో విజయవంతంగా ప్రచారం పూర్తిచేశారు.


logo