మంగళవారం 02 మార్చి 2021
Siddipet - Oct 18, 2020 , 01:03:51

‘ధరణి’కి ఏర్పాట్లు చేయండి

‘ధరణి’కి ఏర్పాట్లు చేయండి

ధరణి పోర్టల్‌ సేవలకు తహసీల్‌ కార్యాలయాలు సిద్ధం చేయాలి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ 

కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఆర్డీవోలు, తహసీలార్లు, నాయబ్‌ తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌

సంగారెడ్డి టౌన్‌/సిద్దిపేట కలెక్టరేట్‌:  ధరణి పోర్టల్‌ ద్వారా సేవలు అందించేందుకు తహసీల్‌ కార్యాలయాల్లో అన్ని మౌలిక వసతులతో కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఆర్డీవోలు, తహసీలార్లు, నాయబ్‌ తహసీల్దార్లతో ధరణి పోర్టల్‌ పనితీరుపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ..ధరణి పోర్టల్‌లో దరఖాస్తుదారు స్లాట్‌ బుకింగ్‌, తహసీల్దార్లు, నాయబ్‌ తహసీల్దార్ల పాత్ర, బాధ్యతలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లపై వివరించారు. దీనిపై తహసీల్దార్లు, నాయబ్‌ తహసీల్దార్లు పూర్తిస్థాయిలో పని చేసేలా సిద్ధం కావాలన్నారు. ఈ నెల 25వ తేదీన సీఎం కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈలోగా అన్ని విధాలుగా శిక్షితులై పూర్తి ఏర్పాట్లతో సేవలందించడానికి సిద్ధంగా ఉండాలని తహసీల్దార్లు, నాయబ్‌ తహసీల్దార్లకు సూచించారు. ధరణి పోర్టల్‌ ద్వారా అందించే సేవలతో పారదర్శకత, జవాబుదారీతనం ఉంటుందని, కలెక్టర్లు కో-ఆర్డినేషన్‌ మీటింగ్‌లను నిర్వహించాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ధరణి సన్నాహాకాలు ఏ విధంగా ఉన్నాయనే అంశాన్ని కలెక్టర్లను  సీఎస్‌ అడిగి తెలుసుకున్నారు. కొత్త రెవెన్యూ చట్టంతో రెవెన్యూ కోర్టులను ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ బాధ్యతలను తహసీల్దార్లకు అప్పగించినా తాజా నాలా సవరణ చట్టంతో వ్యవసాయేతర భూముల మార్పిడి అధికారం ఆర్డీవోల నుంచి తప్పించి తహసీల్దార్లకు కట్టబెట్టిందని సీఎస్‌ తెలిపారు. నాలా సవరణ చట్టంతో ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. రాష్ట్రంలోని 570 తహసీల్‌ కార్యాలయాల్లో ఏకీకృత డిజిటల్‌ సేవల పోర్టల్‌ ధరణిని ప్రారంభించుకోనుండటం రెవెన్యూ చరిత్రలో విప్లవాత్మకమన్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి, సిద్దిపేట కలెక్టర్లు హనుమంతరావు, వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడుతూ.. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో ధరణి పోర్టల్‌ అమలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సీఎస్‌కు వివరించారు. జిల్లాల్లోని అన్ని తహసీల్‌ కార్యాలయాల్లో బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌, సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ మేరకు ఆర్డీవోలు, తహసీల్దార్లతో క్షేత్రస్థాయిలో తహసీల్దార్‌ కార్యాలయాలను పరిశీలన జరుపాలని ఆదేశించారు. తొలుత 10 ట్రాన్జక్షన్స్‌ టెస్టు చేయాలని సూచిస్తూ తహసీల్దార్‌, నాయబ్‌ తహసీల్దార్‌, కంప్యూటర్‌ ఆపరేటర్లే కీలకమని కలెక్టర్లు పేర్కొన్నారు. తహసీల్దార్లు, నాయబ్‌ తహసీల్దార్లకు శిక్షణ కూడా ఇస్తున్నామన్నారు. పూర్తిశిక్షణతో అన్ని వసతులతో సిద్ధంగా ఉన్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సంగారెడ్డి అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, డీఆర్డీవో రాధిక రమణి, సిద్దిపేట అదనపు కలెక్టర్లు పద్మాకర్‌, ముజామ్మిల్‌ఖాన్‌, ట్రైనీ కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo