బుధవారం 28 అక్టోబర్ 2020
Siddipet - Oct 17, 2020 , 04:19:00

మెజార్టీ మనదే

మెజార్టీ మనదే

-దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే శక్తి లేదు..

-కాంగ్రెస్‌, బీజేపీ చేసిన మంచి పనులున్నాయా?

-టీఆర్‌ఎస్‌ చేసిన మంచి పనులు వంద చెబుతా.. 

-వాళ్లు ఒక్కటి కూడా చెప్పలేకపోతున్నారు..

-కాంగ్రెస్‌, బీజేపీతోనే రైతులకు గోస

-హస్తం హయాంలో కరెంట్‌ లేకపాయె.. కమలం బోరు మోటర్లకు మీటర్లు పెట్టవట్టే..

-తోవ తెలియని నాయకులు దుబ్బాకకు వస్తున్నారు..

-కిరాయి.. పరాయి నాయకులపై ఆధారపడ్డ ప్రతిపక్షాలు

-ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

-దుబ్బాక మండలంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతతో కలిసి ఎన్నికల ప్రచారం

దుబ్బాక: ‘దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతక్క విజయం ఎప్పుడో ఖాయమైంది.. కేవలం మెజార్టీ కోసమే ఈ ఎన్నిక జరుగుతున్నాయి.. మెజార్టీ కూడా మనదే’ అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్‌లో కరెంట్‌ లేదు.. బీజేపీలో బోరు మోటార్లకు మీటర్లు పెట్టవట్టే.. రైతులను గోస పెట్టిన ఆ జాతీయ పార్టీలకు దిమ్మదిరిగేలా దుబ్బాక ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలి’.. అని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం దుబ్బాక మండలం రామక్కపేట, చీకోడ్‌, శిలాజీనగర్‌, వెంకటగిరితండా, గంభీర్‌పూర్‌, పోతారం, ఆరెపల్లి, కమ్మర్‌పల్లి, అచ్చుమయాపల్లి గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సూజాత ప్రచారం నిర్వహించగా, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ప్రచారానికి వచ్చిన నాయకులను ఆయా గ్రామాల్లో మహిళలు మంగళహారతులు, బోనాలు, బతుకమ్మలతో బ్రహ్మరథం పట్టారు. ‘జై తెలంగాణ.. జై కేసీఆర్‌.. నినాదాలతో అడుగడుగునా నీరాజనం పలికారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు.

దుబ్బాక తోవ తెలియని కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు, ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం కొత్త బట్టలు కుట్టించుకుని, నోట్ల కట్టల సూటు కేసులతో వచ్చే వలస నాయకులకు దుబ్బాక ఉద్యమ స్ఫూర్తిని ఓట్ల రూపంలో రుచి చూపాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. టీఆర్‌ఎస్‌ సర్కారులోనే అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరిగిందని, అభివృద్ధి, సంక్షేమం టీఆర్‌ఎస్‌కు రెండు కండ్లలాంటివని, కరోనా కష్టకాలంలో సైతం ఏ ఒక్క పథకాన్ని నిలిపివేయలేదన్నారు. రాష్ట్ర బడ్జెట్‌ తగ్గినా, కేంద్ర నిధులివ్వకున్నా రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలు కొనసాగించిన ఘనత టీఆర్‌ఎస్‌ సర్కారుదేన్నారు. ఆసరా పింఛన్ల ద్వారా నెలకు రూ.980 కోట్లు ఖర్చు పెడుతున్నదని, యేటా రూ.11,720 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.210 కోట్లు అంటే, 1.80శాతం ఇస్తున్నదన్నారు. ‘చిటికెడు ఉప్పేసి.. కుండలోని పప్పంతా నాదే’.. అన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తున్నదని ఎద్దేవా చేశారు.

దేశంలో కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో లేని సంక్షేమ పథకాలు మన తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారని కొనియడారు. కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్‌, బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లు, కేసీఆర్‌ కిట్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే వంద ఉన్నాయన్నారు. మరీ కాం గ్రెస్‌, బీజేపీ ప్రజలకు చేసిన మంచి పనులు ఒక్కటైనా ఉందా? అని ప్రశ్నించారు. దుబ్బాక అంటే సీఎం కేసీఆర్‌కు ఎనలేని ప్రేమ ఉందని, ప్రతి ఇంటికీ నల్లా నీళ్లూ, ప్రతి ఎకరాకు సాగునీరు అందించిన ఘనత టీఆర్‌ఎస్‌ సర్కారుకే దక్కిందన్నారు. నియోజకవర్గంలో 60వేల మందికి రూ.2 వేలు పింఛన్‌ అందిస్తున్నామన్నారు. రైతుబంధు ద్వారా పెట్టుబడికి ఎకరానికి రూ.10వేలు అందిస్తున్నదన్నారు. రైతు ఏ కారణం చేతనైనా మృతి చెందితే, బాధిత కుటుంబానికి రూ.5లక్షల బీమా అందిస్తున్నామన్నారు. దుబ్బాకలో వంద పడకల దవాఖాన, వెయ్యి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, రామసముద్రం, పెద్ద చెరువు కట్టలు సుందరీకరణ చేసుకున్నామని, దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చుకుందామన్నారు.

ఇందుకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతను భారీ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 148మంది సర్పంచుల్లో 142మంది టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లే ఉన్నారన్నారు. 78మంది ఎంపీటీసీల్లో 67మంది టీఆర్‌ఎస్‌, దుబ్బాక మున్సిపాలిటీలో 20వార్డుల్లో 19కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌ వారేనన్నారు. ‘ప్రతి పల్లె.. ప్రతి గ్రామం.. ప్రతి నోటా టీఆర్‌ఎస్‌, కారు గుర్తు...కేసీఆర్‌ సారు’ అని అంటున్నారన్నారు. దుబ్బాక ఎన్నికల్లో మాయ మాటలు చెప్పేందుకు వచ్చినా  కాంగ్రెస్‌, బీజేపీ నాయకులకు ఓట్లతో బుద్ధి చెప్పాలన్నారు. దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే శక్తి లేక కాంగ్రెస్‌, బీజేపీ గోబెల్‌ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ పార్టీలకు క్యాడర్‌ లేక పరాయి నాయకులు, కిరాయి మనుషులపై ఆధారపడ్డారని ఎద్దేవా చేశారు. ద్వితీయ స్థానం కోసమే కాంగ్రెస్‌, బీజేపీ పోటీ పడుతున్నాయన్నారు. కార్యక్రమంలో నేషనల్‌ లేబర్‌ కో ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ డైరెక్టర్‌ రాజ్యలక్ష్మి, దుబ్బాక మున్సిపల్‌ అధ్యక్షురాలు వనిత, ఎంపీపీ పుష్పలత, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, ఏఎంసీ బండి శ్రీలేఖ, పీఏసీఎస్‌ చైర్మన్‌ కైలాశ్‌, సర్పంచ్‌లు శ్రీనివాస్‌, భాస్కర్‌, జనార్దన్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

గులాబీ గూటికి సూరంపల్లి యువకులు

దౌల్తాబాద్‌: మండలంలోని సూరంపల్లికి చెందిన 20మంది యువకులు బీజేపీ, కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, శుక్రవారం టీఆర్‌ఎస్‌ గ్రామాధ్యక్షుడు సత్యం ఆధ్వర్యంలో సర్పంచ్‌ నర్సింహులు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారిలో బీజేపీకి చెందిన శ్రీనివాస్‌, కాంగ్రెస్‌కు చెందిన చామాంతి నవీన్‌, బొల్లం రాజేందర్‌, పలువురు కార్యకర్తలున్నారు.

గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ ప్రచారం

మిరుదొడ్డి: దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ముందు బీజేపీ, కాగ్రెస్‌ పార్టీ డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయమని మిరుదొడ్డి ఇన్‌చార్జి పెద్దగొల్ల సత్యనారాయణ, బేగంపేట నాయికోటి రాజేశ్‌, సర్పంచ్‌లు రంగమైన రాములు, అనసూయ ప్రతాప్‌ అన్నారు. శుక్రవారం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత రామలింగారెడ్డి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ మిరుదొడ్డి, బేగంపేట గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు ధర్మారం లక్ష్మీ మల్లయ్య, సుతారి నర్సింలు, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు సిద్ధాల సత్తయ్య, మాజీ ఎంపీపీ భాస్కరాచారి, టీఆర్‌ఎస్‌ నేతలు రమేశ్‌, బైరయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌, బీజేపీకి బుద్ధి చెప్పాలి :మెదక్‌ ఎంపీ

ఎన్నికల సమయంలో కనిపించే కాంగ్రెస్‌, బీజేపీ నాయకులకు దుబ్బాక ప్రజలు  ఓటుతో బుద్ధి చెప్పాలని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కోరారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు రైతులను ఇబ్బందులకు గురి చేసే చట్టాలు తీసుకొచ్చిందన్నారు. రైతు కుటుంబాలకు బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకుని ఓటు అడిగేందుకు వస్తారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో తప్పుదారి బీజేపీకి ఓటు వేస్తే, బోరు మోటారుకు మీటరు పెట్టేందుకు దుబ్బాక ప్రజలు అంగీకరిస్తున్నారనే తప్పుడు సంకేతం పోతుందన్నారు. కాంగ్రెస్‌ నాయకులు గల్లీకొకరు తిరుగుతున్నా, వారిని పట్టించుకునే పరిస్థితిలో ప్రజలు లేకుండాపోయారని ఎద్దేవా చేశారు.

భారీ మెజార్టీని అందించాలి.. : మెదక్‌ ఎమ్మెల్యే

దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతను భారీ మెజార్టీతో గెలిపించి, దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. దుబ్బాక ప్రజల సేవలోనే రామలింగన్న అమరుడయ్యారని, ఆయన సేవలను గుర్తించి, సీఎం కేసీఆర్‌ ఉప ఎన్నికల్లో సుజాతక్కకు అవకాశం కల్పించారని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌తోనే దుబ్బాక అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు లక్ష ఓట్ల మెజార్టీని అందించి, రామలింగారెడ్డికి నిజమైన నివాళులర్పిద్దామన్నారు.

దుబ్బాక అభివృద్ధే మా లక్ష్యం : సోలిపేట సుజాత

దుబ్బాక అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని, తనకు టీఆర్‌ఎస్‌, నియోజకవర్గ ప్రజలు అండగా ఉన్నందుకు సంతోషంగా ఉందని దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత అన్నారు. రామలింగన్న ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. ప్రజల కోసం పని చేసిన రామలింగారెడ్డి బాటలో నడుస్తానని చెప్పారు. తమకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డికి రుణపడి ఉంటానన్నారు. 


logo