మంగళవారం 02 మార్చి 2021
Siddipet - Oct 15, 2020 , 02:03:56

కాంగ్రెస్‌, బీజేపీ అభివృద్ధి నిరోధకులు

కాంగ్రెస్‌, బీజేపీ అభివృద్ధి నిరోధకులు

  •  మంత్రి  హరీశ్‌రావు సమక్షంలో పలువురు చేరిక

దుబ్బాక టౌన్‌/దుబ్బాక: అభివృద్ధి, సంక్షేమానికి పెట్టింది పేరు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీలు అభివృద్ధి నిరోధకులుగా మారారని రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు.  ప్రతి అభివృద్ధి పనికి ప్రతిపక్షాలు కోర్టుల్లో కేసులు వేస్తూ పనులు అడ్డుపడుతున్నారని అంటూ దుబ్బాకలో జరిగే ఉప ఎన్నిక అభివృద్ధి కాములకు, అభివృద్ధి నిరోధకులకు మధ్య జరిగే పోటీ అని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత బుధవారం దుబ్బాకలోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు స్థానిక రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...అభివృద్ధిని కోరుకున్న వారంతా టీఆర్‌ఎస్‌కే ఓటు వేస్తానన్నారు. దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ విజయం ఎప్పుడో ఖాయమైందన్నారు. రెండో స్థానం కోసమే కాంగ్రెస్‌, బీజేపీలు పోటీపడుతున్నాయని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు డిపాజిట్‌ దక్కలేదన్న విషయాన్ని మంత్రి గుర్తు చేస్తూ, అదే తరహా తీర్పు ఈ ఉప ఎన్నికల్లోనూ పునరావృతమవుతుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు చేస్తున్న గోబెల్స్‌ ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ముఖ్యంగా బీజేపీ సోషల్‌ మీడియాలో అభూత కల్పనలు చేస్త్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం సొమ్ము ఇస్తుందని తప్పుడు ప్రచారం చేయడం, బీజేపీ నేతల దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. దుబ్బాక ప్రజలు చైతన్యవంతులని, తప్పు ఏదో ? ఒప్పు ఏదో ? వారికి తెలుసు అని మంత్రి అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అమలు చేసే ప్రతి సంక్షేమ పథకంపై ప్రజలకు పూర్తి అవగాహన ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేసే వివిధ రకాల పింఛన్లలో వంద శాతంలో కేంద్ర ప్రభుత్వం కేవలం 1.8 శాతం మాత్రమే నిధులను అందజేస్తోందన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి ఇంటికి నల్లానీరు, బీడీ కార్మికులకు జీవనభృతి వంటి వాటిని సీఎం కేసీఆర్‌, దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇచ్చిన విషయం ప్రజలు తెలియదా.. అని మంత్రి ప్రశ్నించారు. 

ఆ ఎన్నికల ఫలితాలే దుబ్బాకలో పునరావృతం...

హుజూర్‌నగర్‌, నిజామాబాద్‌లో జరిగిన ఎన్నికల ఫలితాలే దుబ్బాక ఉప ఎన్నికల్లో పునరావృతం అవుతాయని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ప్రజలకు ఏమి ఒరగబెట్టి ఇక్కడ ఓట్లు అడుగుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ , బీజేపీ అనుబంధమైన భారతీయ కిసాన్‌మోర్చా వ్యవసాయ బిల్లును వ్యతిరేకించినా, కేంద్రమంత్రి రాజీనామా చేసినా,  పార్టీలో ఎలాంటి చలనం లేదని, అలాంటి పార్టీ ఇక్కడి రైతులకు ఏమి సమాధానం చెప్పుతారని మంత్రి ప్రశ్నించారు. దుబ్బాక వ్యవసాయాధారిత ప్రాంతమని, నియోజకవర్గంలో 78 వేల మంది రైతులు ఉన్నారన్నారు. వీరందరికీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు సంక్షేమ ఫలాలను అందిస్తుండగా, బోరుబావుల వద్ద మీటర్లు పెట్టి, విదేశీ మక్కలు తెచ్చే బీజేపీ వైపు రైతులు ఏలా ఉంటారన్నారు.  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత నియోజకవర్గంలో ఇప్పటికే 50 గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారని, ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. బీడీ కార్మికులు ఇచ్చిన డబ్బులతోనే సోలిపేట సుజాత బుధవారం నామినేషన్‌ దాఖలు చేసిందని, రామలింగారెడ్డి తరహాలోనే ప్రజల మధ్య ఉంటూ సేవ చేసేందుకు ముందుకు వచ్చిందన్నారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి నిరంతరం కొనసాగేందుకే సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు మంత్రిగా నేను, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సోలిపేట సుజాతకు అండగా ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ, మిరుదొడ్డి పీఏసీఎస్‌ చైర్మన్‌, డీసీసీబీ డైరెక్టర్‌ బక్కి వెంకటయ్య, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు రొట్టె రాజమౌళి, వెంకటనర్సింహ్మరెడ్డి, జట్పీటీసీ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ పుష్పలత, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గన్నెవనిత, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, పాల్గొన్నారు.

నన్ను ఆశీర్వదించండి : టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత

సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత తెలిపారు. దుబ్బాకలో నామినేషన్‌ వేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్దిలో అగ్రభాగాన నిలుపుతానన్నారు. రామలింగారెడ్డి ఆశయ సాధన కోసం వచ్చానని, తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ప్రజల రుణం తీర్చుకుంటానని సుజాత అన్నారు. అంతకుముందు నామినేషన్‌ పత్రాలతో పలు ఆలయాల్లో సోలిపేట సుజాత ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డితో కలిసి చౌదర్‌పల్లి దుబ్బరాజేశ్వరాలయం, దర్గాలతో పాటు ధర్మాజీపేటలోని చర్చి, రేకులకుంటలోని మల్లిఖార్జునస్వామి, ఎల్లమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డితో కలిసి సోలిపేట సుజాత నామినేషన్‌ దాఖలు చేశారు.


VIDEOS

logo