శనివారం 27 ఫిబ్రవరి 2021
Siddipet - Oct 15, 2020 , 02:04:16

సుజాతమ్మకు ఘన విజయాన్ని అందించండి

సుజాతమ్మకు ఘన విజయాన్ని అందించండి

- మంత్రి తన్నీరు హరీశ్‌రావు

తొగుట : ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి చెబుతుండు..దుబ్బాకకు వచ్చాను కిరాయి తీసుకొని ఇక్కడే ఉంటాను అని..మరి ఎన్నికల తర్వాత ఉత్తమ్‌, రేవంత్‌, కోమటిరెడ్డిలు దుబ్బాకలో ఉంటారా..ఇలాంటి వారు మనకు అవసరమా, ఎన్నికల్లో వారిని చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాలని రాష్ట్ర ఆర్థ్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఓటర్లకు పిలుపు నిచ్చారు. బుధవారం తొగుట-రాంపూర్‌లో ప్రైవేట్‌ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన కార్యక్రమంలో శివసేన జిల్లా అధ్యక్షుడు హన్మంతారెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు తొగుట మాజీ సర్పంచ్‌ పబ్బతి శ్రీనివాస్‌రెడ్డి, సొసైటీ మాజీ డైరెక్టర్‌ విద్యాకర్‌రెడ్డి, లింగం, సుదర్శన్‌ తదితరులు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత మాయమయ్యే నాయకులను నమ్మవద్దని, ఎల్లమ్మ, పోచమ్మ, బీరప్ప పండుగులకు, ఆపద, సంపదలకు వచ్చే టీఆర్‌ఎస్‌ నాయకులకే మద్దతు ఇవ్వాలన్నారు. దుబ్బాకలో కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరడానికి క్యూ కడుతున్నారని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలకు వారు ఆకర్షితులవుతున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణ మాదిరిగా పథకాలు అమలులో ఎందుకు లేవని ఆయన ప్రశ్నించారు. రైతులకు రైతుబంధు, రైతుబీమా, ఆడబిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, సర్కారు దవాఖానలో ఉచిత ప్రసవాలతో పాటు కేసీఆర్‌ కిట్టు తదితర పథకాలను బీజేపీ, కాంగ్రెస్‌ పరిపాలిస్తున్న రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థికి ఓట్లు వేయడం అంటే మోటర్లకు మీటర్లు భిగించడానికి ఒప్పుకున్నట్లే అవుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నట్లు తెలిపారు. దుబ్బాకలో 60 వేల మందిని పింఛన్లు, 78 వేల మంది రైతులకు రైతుబంధు సాయం అందించినట్లు తెలిపారు. వ్యవసాయంగా పెద్ద నియోజకవర్గమైన దుబ్బాకలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. నాడు కరెంటు ఉంటే వార్త అయ్యేదని.. నేడు కరెంటు పోతే వార్త అవుతుందని, 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్న రాష్ట్రం మన తెలంగాణకే దక్కుతుందన్నారు. దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి హయాంలో దుబ్బాక నియోజకవర్గంలో 2500 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించామని, 18 విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌లో లక్ష ఇండ్లకు నిధులు సమకూర్చడం జరిగిందని, వ్యక్తిగతంగా ఇళ్ల నిర్మాణానికి కృషిచేస్తానని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. సుజాతను గెలిపిస్తే దుబ్బాకను అభివృద్ధిలో ముందు వరుసలో నిలుపుతామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, ఆత్మ కమిటీ, రైతుబంధు రాష్ట్ర కమిటీ సభ్యులు అనంతుల పద్మ నరేందర్‌, దేవీ రవీందర్‌, ఎంపీపీ గాంధారి లత నరేందర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, సొసైటీ చైర్మన్‌ హరికృష్ణారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడీల అనిత లక్ష్మారెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు బోధనం కనకయ్య, సర్పంచ్‌ల, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు సిరినేని గోవర్ధన్‌, కంకణాల నర్సింహులు, టీఆర్‌ఎస్‌ మండల  అధ్యక్షుడు చిలువేరి మల్లారెడ్డి, సర్పంచ్‌లు పాగాల కొండల్‌రెడ్డి, అప్పనపల్లి శ్యామల అంజనేయులు, బొడ్డు నర్సింహులు, ఎంపీటీసీలు వెల్పుల స్వామి, శరత్‌, టీఆర్‌ఎస్‌ శ్రేణులు పాల్గొన్నారు.

దుబ్బాకలో కాంగ్రెస్‌, బీజేపీ ఖాళీ..

- కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్‌ ఎంపీ 

ఎన్నికల మూలంగా దుబ్బాకలో కాంగ్రెస్‌, బీజేపీ ఖాళీ అవుతున్నాయని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. తొగుట నుంచి హన్మంతరెడ్డి, రాయపోల్‌లో బాల్‌లక్ష్మి, దుబ్బాకలో వంశీ తదితరులు పెద్ద ఎత్తున బీజేపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరడం శుభపరిణామం అన్నారు. రఘునందన్‌ గెలిస్తే ఏం చేస్తాడు...? అసెంబ్లీలో రెండో ఎమ్మెల్యే మాత్రమే అవుతాడని, అప్పుడు అభివృద్ధి శూన్యమవుతుందన్నారు. కూట్లె రౌతు తియ్యనోడు ఏట్లె రౌతు తీస్తాడా అన్నట్లు.. ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన రేవంత్‌, కోమటిరెడ్డి, ఉత్తమ్‌లు ఏం వెలగబెట్టడానికి దుబ్బాకకు వచ్చారని ప్రశ్నించారు. వార్డు మెంబర్‌, సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీలు, మంత్రులు ప్రభుత్వం అన్ని టీఆర్‌ఎస్‌ వారే ఉన్నప్పుడు, వేరే వారికి ఓట్లేస్తే ఎలా మేలు జరుగుతుందని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌లో చేరిన హన్మంతరెడ్డి, పబ్బతి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఆకర్షితులమై టీఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలిపారు. 

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతమ్మకు ఘన విజయం అందించాలని తొగుట మండల టీఆర్‌ఎస్‌ ఎన్నికల ఇన్‌చార్జి, ఆందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ పిలుపు నిచ్చారు. ఎవరైనా చనిపోతే అయ్యోపాపం అనడం సహజమని, దుబ్బాకలో మాత్రం నీచమైన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

VIDEOS

logo