గురువారం 03 డిసెంబర్ 2020
Siddipet - Oct 14, 2020 , 01:47:53

కాంగ్రెస్‌, బీజేపీని.. పాతరేయాలి

కాంగ్రెస్‌, బీజేపీని.. పాతరేయాలి

  • n అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్షాలు
  • n పథకాలకు కేంద్రం ఇస్తుందేమి లేదు
  • n పింఛన్ల కోసం ఎంత ఇచ్చిందో చెప్పాలి..
  • n ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట సొంతూరిలోనే చెల్లలేదు
  • n మంచినీటి గోస తీర్చిన ఘనత కేసీఆర్‌దే
  • n టీఆర్‌ఎస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం
  • n దుబ్బాక ఉప ఎన్నికల్లో లక్ష మెజార్టీ ఖాయం
  • n ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

రాయపోల్‌ :  టీఆర్‌ఎస్‌ హయాంలోనే అన్నిర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్‌, బీజేపీకి డిపాజిట్లు దక్కకుండా చేయాలని మంత్రి  హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మంగళవారం రాయపోల్‌ మండల కేంద్రంలోని జీఎంఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన సమావేశంలో రాయపోల్‌ మండలానికి చెందిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బాల్‌లక్ష్మీ, దౌల్తాబాద్‌ మండలం ఇందుప్రియాల్‌ గ్రామానికి చెందిన బీజేపీ గ్రామ అధ్యక్షుడు సురేష్‌తో పాటు వడ్డేపల్లి, గొల్లపల్లి, అనాజీపూర్‌, తిర్మాలాపూర్‌ తదితర గ్రామాలకు చెందిన 200 మంది బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామలు చేసి, మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.  టీఆర్‌ఎస్‌ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తాము టీఆర్‌ఎస్‌లో చేరినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. రూ.200 పింఛన్‌ను రూ.2వేలకు పెంచిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ‘కేంద్రం నుంచి పింఛన్‌ ఇస్తున్నామంటున్న బీజేపీకి సవాల్‌ విసురుతున్న.. కేంద్రం నుంచి ఇచ్చేది ఎంతో చెప్పాలి’.. అని ప్రశ్నించారు. ఏడాదికి పింఛన్లకు తెలంగాణ ప్రభుత్వం రూ.11వేల 7వందల 20 కోట్లు ఇస్తుండగా, ఢిల్లీ నుంచి కేవలం రూ.210 కోట్లు మాత్రమే ఇస్తుందని విమర్శించారు. ‘పప్పులో చిటికెడు ఉప్పు వేసి, పప్పు మొత్తం నేనే చేశా’ అన్నట్లు బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి అడ్డుపతున్న ప్రతిపక్షాలకు ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ‘బీజేపీకి నేను సవాలు విసురుతున్న.. తెలంగాణలో ఇస్తున్న పింఛన్ల విషయంలో కేంద్రం ఎన్ని డబ్బులు ఇస్తున్నదో చర్చకు రావాలి’ అని ఆయన డిమాండ్‌ చేశారు. మొత్తం కేంద్రమే ఇస్తుందని అంటూ బీజేపీ గోబెల్‌ ప్రచారం చేస్తూ ఓట్లు అడగడం సిగ్గు చేటన్నారు.  నిజామాబాద్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీకి డిపాజిట్‌ గల్లంతైందని, రేపు కూడా దుబ్బాకలో అదే జరుగబోతున్నదని ఆయన స్పష్టం చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాటలు ఆయన ఊరిలోనే చెల్లదని, దుబ్బాకలో ఎలా నెగ్గుతుందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు కనిపించరని, ప్రజల కోసం పని చేస్తున్న టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేసి, భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.  సమావేశంలో ఎంపీపీ అనిత, జడ్పీటీసీ యాదగిరి, ఏఎంసీ చైర్మన్‌ శ్రీను, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ రవీందర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ రాయపోల్‌, దౌల్తాబాద్‌ మండలాధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, రణం శ్రీను, కోఆప్షన్‌ సభ్యుడు పర్వేజ్‌, గజ్వేల్‌ మున్సిపాల్‌ చైర్మన్‌ రాజమౌళిగుప్తా, టీఆర్‌ఎస్వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు మోహన్‌రెడ్డి, జిల్లా నాయకుడు వెంకటనర్సింహరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం నాయకులు రాజిరెడ్డి, రాంపల్లి సతీష్‌తో పాటు రెండు మండలాల్లోని ఆయా గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.