ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Siddipet - Oct 14, 2020 , 01:47:54

రైతన్నకు అండగా అద్దె పనిముట్లు

రైతన్నకు అండగా అద్దె పనిముట్లు

  • n జిల్లాలో తొలిసారి ప్రయోగం
  • n మార్కెట్‌ ధర కంటే తక్కువ
  • n అందుబాటులో యంత్రాలు
  • n హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

కోహీర్‌ : రైతన్నలకు శుభవార్త్త. యంత్రాలు, ఎడ్లు అందుబాటులో లేని రైతులకు ప్రభుత్వం చేయూతనందిస్తున్నది. జిల్లాలో తొలిసారిగా కోహీర్‌ మండలంలో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నది. మండలంలోని ఆయా గ్రామాల రైతుల అవసరార్థం యంత్ర పనిముట్లను అద్దెకు ఇవ్వడానికి నిర్ణయించింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా లావాదేవీలు కొనసాగనున్నాయి. మండల ఐకేపీ-పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు రైతులకు అండగా నిలువనున్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో యాసంగిలో దున్నకం, కలుపుతీత, మందుల పిచికారీ కోసం పనిముట్లను సరఫరా చేసింది. ఒక ట్రాక్టర్‌తో పాటు ట్రాలీ, రోటోవేటర్‌, కల్టీవేటర్‌, రెండు ఇనుప నాగళ్లు, నాలుగు తైవాన్‌ పంపులను ఇక్కడకు తరలించారు. రైతు వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రం ద్వారా రైతులకు మార్కెట్‌ కంటే తక్కువ ధరకు అందించనున్నారు. సంబంధిత ఐకేపీ-పేదరిక నిర్మూలన సంస్థ సభ్యులు పనిముట్ల అద్దె విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోనున్నారు. జిల్లాలోని నాలుగు మండలాల్లో అద్దె కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా కోహీర్‌లో పనిముట్ల అద్దె కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి రైతులకు విశేష సేవలందించాలనే ఉద్దేశంతో సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు.

నిరుపేదలకు మేలు...

రైతు వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రం ఏర్పాటుతో నిరుపేద రైతులకు మేలు జరుగుతుంది. పెద్ద రైతుల వద్ద వ్యవసాయం చేసేందుకు సొంత యంత్రాలు అందుబాటులో ఉంటాయి. కానీ చిన్న, సన్నకారు రైతుల వద్ద మాత్రం యంత్రాలు ఉండే అవకాశం తక్కువ. ప్రభుత్వం అందించే చేయూతతో రైతులందరూ వ్యవసాయాన్ని సంతోషంగా చేపట్టేందుకు వీలవుతుంది. బయట మార్కెట్‌ ధర కంటే ఇక్కడ తక్కువ ధరకు పనిముట్లు లభించనున్నాయి. త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోహీర్‌ పట్టణంలోని తహసీల్‌ కార్యాలయం రోడ్డు పక్కన వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌ తదితరులు ఎన్నికల ప్రచారం, అసెంబ్లీ సమావేశాలు, తదితర పనుల్లో నిమగ్నం కావడంతో కొంత వరకు ఆలస్యమవుతున్నది. కేంద్రాన్ని ప్రారంభిస్తే అందుబాటులో ఉన్న వ్యవసాయ పనిముట్లతో తమ పొలాల్లో పనులు చేయించుకునే అవకాశం రైతులకు లభిస్తుంది. వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల పనిముట్ల ఇక్కడ లభ్యమవుతాయి. బయట మార్కెట్‌ కంటే తక్కువ ధరకు ఇక్కడ పనిముట్లు లభించనున్నాయి. వ్యవసాయ పనుల్లో యంత్రాల కోసం వేచిచూసే అవసరం ఉండదు. రైతులు ఎప్పుడు కావాలంటే అప్పుడు అద్దెకు తీసుకునే వీలుంటుంది. రైతన్నలు ధీమాతో అన్ని రకాల వ్యవసాయ పనులు చేసుకోవచ్చు. తమకు నచ్చిన పంటలను సాగు చేసి అధిక దిగుబడులు పొందవచ్చు. 

రైతుల అభివృద్ధి కోసం.. 

రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నది. రైతులు వ్యవసాయం చేసుకునేందుకు అందుబాటులో ఉన్న పనిముట్లను మార్కెట్‌ కంటే తక్కువ ధరకు వాటిని అద్దెకు ఇస్తాం. కోహీర్‌లోని తహసీల్‌ కార్యాలయం రోడ్డు పక్కన వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రాన్ని త్వరలో ప్రారంభిస్తాం.  

- సమ్మయ్య, కోహీర్‌ ఐకేపీ ఏపీఎం

VIDEOS

logo