గురువారం 03 డిసెంబర్ 2020
Siddipet - Oct 13, 2020 , 00:46:01

త్యాగానికి ప్రతిఫలం..

త్యాగానికి ప్రతిఫలం..

  • నిర్వాసితులకు అండగా ప్రభుత్వం
  • మల్లన్నసాగర్‌ ముంపు బాధితులకు సౌకర్యాలతో డబుల్‌బెడ్‌రూం ఇండ్లు
  • శరవేగంగా ముట్రాజ్‌పల్లి వద్ద  ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ నిర్మాణ పనులు
  • 6వేల ప్లాట్లు.. 2350 ఇండ్లు..  త్వరలో నిర్వాసితులకు కేటాయింపు
  • ఒక్కో ఇల్లుకు 250 చదరపు గజాలు ఇండ్ల నిర్మాణం, సౌకర్యాలపై సీఎం కేసీఆర్‌ పర్యవేక్షణ

రైతు పక్షపాతి అయిన సీఎం కేసీఆర్‌ నిరంతరం రైతు క్షేమం కోసం కృషి చేస్తున్నారు. ఎవుసానికి అవసరమైన సాగు నీరు సమృద్ధిగా సమకూరితే రైతుకు ఏ రాయితీ అవసరం ఉండదనే వ్యవసాయ నిఫుణుల అభిప్రాయం ప్రకారం సాగు నీటి గోసకు శాశ్వత పరిష్కారం కోసం జల యజ్ఞం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రాజెక్టులు నిర్మిస్తూనే, నిర్వాసితులకు అన్ని విధాల అండగా నిలుస్తున్నది. సిద్దిపేట జిల్లాలో రిజర్వాయర్‌ కొండపోచమ్మసాగర్‌ పూర్తి కాగా, ముంపు గ్రామాల కుటుంబాలకు ముందుగానే పరిహారం అందించింది.

తున్కిబొల్లారం వద్ద అన్ని సౌకర్యాలతో డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మించగా, అందులో నివాసం ఉంటూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరో భారీ రిజర్వాయర్‌ మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాలకు కూడా నష్టపరిహారం ముందుగానే అందించింది. నిర్వాసితుల కోసం గజ్వేల్‌ పట్టణ పరిధిలోని ముట్రాజ్‌పల్లి వద్ద విశాల ప్రదేశంలో డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్నది. మరో నెలరోజుల్లో పూర్తి చేసి ఇండ్లు కేటాయించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.

‘భూ నిర్వాసితుల త్యాగం గొప్పది.. తోటి రైతుల కోసం భూములు ఇచ్చారు. ప్రభుత్వం కూడా అన్ని విధాల వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది’..

- కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సంలో సీఎం కేసీఆర్‌

గజ్వేల్‌ : ఏ ఒక్క భూ నిర్వాసిత కుటుంబానికి నష్టపరిహారం విషయంలో అన్యాయం జరగ కుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు భూములు తీసుకున్న తర్వాత, పరిహరం కోసం ఏండ్ల తరబడి తిప్పించుకోవడంతో రైతులు తీవ్ర నష్టానికి గురైన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్‌ ముందుగానే స్థిరాస్తుల పరిహారం అందించడంతో పాటు నిర్వాసితులకు ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక రాయితీలు అందిస్తూ దేశంలోనే ప్రపథమంగా వారు కోరుకున్న ప్రాంతంలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను అన్ని సౌకర్యాలతో నిర్మించి ఇస్తున్నారు. మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల కోసం గజ్వేల్‌ పట్టణం ముట్రాజ్‌ పల్లి వద్ద అన్ని సౌకర్యాలతో ఇండ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతున్నది. 614 ఎకరాల్లో 6 వేల ప్లాట్లను సిద్ధం చేస్తున్నారు. 2350 ఇండ్లు నిర్మించనుండగా, 2100 ఇండ్ల నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగతా ఇండ్లు వివిధ దశల్లో ఉండగా, ఈ నెలాఖరు లోగా పూర్తి చేసి ఆయా గ్రామాల నిర్వాసితులకు కేటాయించాలని భావిస్తున్నారు.

  తున్కిబొల్లారం వద్ద 

కొండపోచమ్మ ముంపు గ్రామాల భూనిర్వాసితుల కోసం హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చే ములుగు మండలం తున్కిబొల్లారం వద్ద ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా, మామిడ్యాల, బైలింపూర్‌, తానేదార్‌పల్లి గ్రామాల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అన్ని వసతులు కలిగిన ఇండ్లు బాగున్నాయని, తమకు కొత్త గ్రామం నచ్చిందని చెబుతున్నారు. విశాలమైన రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీతో ప్రశాంతతతో కూడిన ఆహ్లాదకర వాతావరణంలో హైదరాబాద్‌కు సమీపంలో ఉందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.   

 సౌకర్యవంతంగా ముట్రాజ్‌పల్లి ఆర్‌అండ్‌ఆర్‌కాలనీ..

మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల నిర్వాసితుల కోసం ముట్రాజ్‌పల్లి వద్ద 250 గజాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న డబుల్‌బెడ్‌రూం ఇండ్లను నైపుణ్యం కలిగిన ఆర్కిటక్‌లతో డిజైన్‌ చేయించగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనల మేరకు పలు అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నారు. పనులను మంత్రి హరీశ్‌రావు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సూచనలు, సలహాలిస్తున్నారు. 60 ఫీట్ల వెడల్పుతో మూడు ప్రధాన బీటీ రోడ్లు, 40ఫీట్లు, 30 ఫీట్ల వెడల్పుతో అంతర్గత సీసీ రోడ్లు, అండర్‌ డ్రైనేజీ నిర్మాణం, మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా, విద్యుత్‌ కనెక్షన్‌, నాలుగు ఫంక్షన్‌ హాళ్లు, రెండు హెల్త్‌ సబ్‌సెంటర్లు, ఎనిమిది అంగన్‌వాడీ కేంద్రాలు, మూడు మినీ మార్కెట్లు, దుకాణ సముదాయాలు, 5 కమాన్‌లు, కమ్యూనిటీ హాల్‌ తదితర సౌకర్యాలతో పాటు పచ్చదనం ఉట్టి పడేలా మొక్కలు పెంచుతున్నారు. 250చదరపు గజాల్లో 550చదరపు అడుగుల స్లాబ్‌ ఏరియాతో రెండు బెడ్‌రూంలు, వంటశాల, ఒక హాల్‌, 2 టాయిలెట్లు నిర్మిస్తున్నారు. 

 కాలనీలో యూజీడీ నిర్మాణం, నాలుగు ఎస్టీపీలు

మల్లన్నసాగర్‌ ఆర్‌అండ్‌ఆర్‌కాలనీలో వర్షపు నీరు పారేందుకు రోడ్లకు ఇరువైపులా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మిస్తున్నారు. కాలనీకి నాలుగు ప్రాంతాల్లో మురికి నీటి శుద్ధికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సివిల్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను నిర్మిస్తున్నారు. దీని ద్వారా ఉత్పత్తి అయిన కంపోస్టు ఎరువు, నీటిని మొక్కలకు వినియోగిస్తారు. ముట్రాజ్‌ పల్లి సంగాపూర్‌ రోడ్లను కలిపే 60 ఫీట్లు బీటీ రోడ్డుకు మధ్యలో డివైడర్‌తో పాటు సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేస్తారు. అన్ని అంతర్గత రోడ్లను ఇలాగే అభివృద్ధి చేస్తున్నారు.

 నిర్వాసితుల కుటుంబానికి ఉపాధి అవకాశాలు

మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌, అనంతగిరి ప్రాజెక్టుల ముంపు గ్రామాల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. తున్కి బొల్లారం వద్ద 417 ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ పార్క్‌ నిర్మాణం వేగంగా సాగుతున్నది. ఇందులో 18 నుంచి 20 ప్రముఖ కంపెనీలు ఏర్పాటు కానున్నాయి. ఈ పార్కులోని కంపెనీల్లో నిర్వాసిత కుటుంబాలకు చెందిన ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఇంటికొకరికి ఉపాధి లభించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలు అత్యంత విలువైన ప్రాంతంలో గేటెడ్‌ కమ్యూనిటీకి దీటుగా నిర్మించారు. కొండపోచమ్మ ముంపు గ్రామల కోసం నిర్మించిన తున్కిబొల్లారం కాలనీ హెచ్‌ఎండీఏ పరిధిలోకి వస్తే, మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల కోసం నిర్మిస్తున్న ముట్రాజ్‌పల్లి కాలనీ గజ్వేల్‌, అనంతగిరి ముంపు గ్రామాలకు లింగారెడ్డిపల్లి వద్ద నిర్మిస్తున్న కాలనీ సిద్దిపేట మున్సిపల్‌ పరిధిలోకి వస్తాయి. దీంతో వీటి విలువ రోజురోజుకూ పెరిగే అవకాశం ఉంది. నిర్వాసితులకు పలు రాయితీలు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నది.

దేశంలోనే అతిపెద్ద ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ

గజ్వేల్‌ పట్టణానికి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ ప్రతిసృష్టిగా మారుతుంది. గజ్వేల్‌ మహతి ఆడిటోరియంలో సీఎం కేసీఆర్‌ అన్నట్లుగానే ముట్రాజ్‌పల్లి కాలనీ ఓ గొప్ప కాలనీగా రూపుదిద్దుకుంటుంది. పట్టణంలో 9వేల కుటుంబాలుంటే, ఈ కాలనీలో 6 వేల కుటుంబాలుంటాయి. అన్ని సౌకర్యాలతో పాటు మున్సిపల్‌ పరిధిలో నిర్మించిన ఈ కాలనీ దేశంలోనే పెద్దదిగా మారుతుంది. భూనిర్వాసితులు కోరుకున్న విధంగా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు నిర్మించాం. నిర్వాసితులకు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్యాకేజీ అందించాం. ఇండ్ల కేటాయింపు కూడా పారదర్శకంగా జరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి కావడానికి మంత్రి హరీశ్‌రావు తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. అధికారులు బాగా పనిచేయడం, నిర్వాసితులు సహకరించడంతో ఇంత పెద్ద ప్రాజెక్టులను తొందరగా పూర్తి చేసుకోగలిగాం. త్వరలోనే మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాలు ఖాళీ చేసి, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి మారడానికి ఏర్పాట్లు చేస్తాం.

- వెంకట్రామ్‌రెడ్డి, సిద్దిపేట కలెక్టర్‌