శనివారం 06 మార్చి 2021
Siddipet - Oct 12, 2020 , 01:37:48

కేంద్ర విధానాలతో రైతుపై భారం

కేంద్ర విధానాలతో రైతుపై భారం

  • కొత్త విద్యుత్‌ బిల్లు వ్యవసాయరంగానికి గొడ్డలిపెట్టు
  • పేదల పొట్టకొడుతున్న కేంద్రం
  • బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం 
  • మీడియాతో ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, 
  • ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పారూఖ్‌ హుస్సేన్‌ 

సిద్దిపేట కలెక్టరేట్‌ : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యుత్‌ బిల్లుతో రైతులు, దళితులు, గిరిజనులు, అల్పాదాయ వర్గాల వారిపై భారం మోపడమే అని అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లాకేంద్రంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకుడు భీమసేనతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కేంద్రం తెచ్చిన బిల్లులోనే మీటర్లు పెట్టాలనే విషయం స్పష్టంగా ఉందన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో మీటర్లు బిగిస్తున్నారని అన్నారు.

రాష్ర్టాలు కొత్త విద్యుత్‌ బిల్లును ఆమోదిస్తే, రాష్ర్టాలకు ఆర్థికంగా రూ.2500 కోట్లు నిధులు అందజేస్తామని కేంద్రం ఆశ చూపుతోందన్నారు. ఈ బిల్లును అమలు చేస్తే రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారన్నారు. ఏప్రిల్‌ 17న పార్లమెంట్‌లో ఈ బిల్లు ప్రవేశపెట్టగానే, దానిని ఉపసంహరించుకోవాలని సీఎం కేంద్రానికి లేఖ రాశారన్నారు. దుబ్బాక ప్రచారంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు చెప్పేవన్నీ అబద్ధాలే అన్నారు. తనకు తానే రఘునందర్‌రావు మేధావినని ప్రకటించుకుంటున్నాడని విమర్శించారు. దుబ్బాక నియోజకవర్గంలో 76 వేల మంది రైతులకు రైతుబంధును రాష్ట్ర ప్రభుత్వం అందించిందని, ఇందులో దాదాపు 65 వేల పైచిలుకు రైతులకు కరెంట్‌ మోటార్లు ఉన్నాయన్నారు. కేంద్రం తెచ్చిన బిల్లు ప్రకారం వీరందరికీ మీటర్లు పెట్టి కరెంట్‌ చార్జీలు వసూలు చేయరా అని ఎమ్మెల్యే బీజేపీ నాయకులను ప్రశ్నించారు. గతంలో గ్యాస్‌ సిలిండర్లకు సబ్సిడీ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పిన కేంద్రం, సంవత్సరానికి 8 సిలిండర్లు మాత్రమే ఇస్తామని కటాఫ్‌ పెట్టిందన్నారు. రేపు మీకిచ్చిన విద్యుత్‌ కోటా పూర్తయిందని రైతులకు కరెంట్‌ ఇవ్వకపోతే, వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కొత్త విద్యుత్‌ చట్టంతో దుబ్బాక నియోజకవర్గ ప్రజలపై రూ.100 కోట్ల భారం పడుతుందన్నారు.

రైతులతో పాటు గిరిజనులు, రజకులు, నాయీబ్రాహ్మణులు, దళితులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న విద్యుత్‌ సబ్సిడీ ఎత్తివేయాల్సి వస్తుందని, ఇది వారిపై భారం మోపడం కాదా అన్నారు. మాయమాటలు చెబుతూ రైతు సంక్షేమం కోసమే బిల్లు తెచ్చామని బీజేపీ నేతలు చెబుతున్న ప్రచారం అంతా అబద్ధమే అన్నారు. దుబ్బాక ప్రజలు సీఎం కేసీఆర్‌ పాలనను కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు ఓటమి తప్పదని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత లక్ష ఓట్ల మెజార్టీతో గెలువబోతుందన్నారు. కేంద్రం తెచ్చిన ఈ బిల్లును బీజేపీ పాలిత రాష్ర్టాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన సీఎం కేసీఆర్‌ పాలనను ప్రజలు కోరుకుంటున్నారన్నారు. దుబ్బాక ఎన్నికల్లో మాయమాటలు చెబుతున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావును ఓడించాలని ఓటర్లకు ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ పిలుపునిచ్చారు. 

బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం: - మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి  

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, కేంద్రం తెచ్చిన కొత్త విద్యుత్‌ బిల్లుపై అనేక రాష్ర్టాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడ్డ దుబ్బాక ప్రాంత రైతులపై ఈ బిల్లు తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, రైతులపై మోయలేని భారం పడుతుందన్నారు. రైతులకు భరోసా ఇచ్చి రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అన్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో రఘునందన్‌రావు తప్పుడు ప్రచారం చేశారని, అందుకే ప్రజలు గట్టి సమాధానం చెప్పి ఓడించారన్నారు. కొత్త విద్యుత్‌ బిల్లుతో చిన్న వ్యాపారులు, రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలననే దుబ్బాక ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత భారీ మెజార్టీతో గెలుస్తారన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాలనే బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎంలు ఆయా రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారన్నారు. బీజేపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు.

VIDEOS

logo