శుక్రవారం 05 మార్చి 2021
Siddipet - Oct 12, 2020 , 01:37:51

లక్ష్యం 4,12,158 మెట్రిక్‌ టన్నులు

లక్ష్యం 4,12,158 మెట్రిక్‌ టన్నులు

  • జిల్లాలో 352 వరి కొనుగోలు కేంద్రాలు
  • క్వింటాల్‌ గ్రేడ్‌ ‘ఎ’ ధాన్యానికి రూ.1888 మద్దతు ధర 

సిద్దిపేట కలెక్టరేట్‌ : వాన కాలంలో రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం రైతులు పండించిన ధాన్యం సేకరించేందుకు  సమాయత్తమవుతోంది.  కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులు, కుంటలు నింపడం, విస్తారంగా వర్షాలు కురువడంతో బీడు భూములు సైతం వరి పొలాలుగా మారాయి. ఈ వాన కాలంలో 2,17,272 ఎకరాల్లో రైతులు వరి పంటను  సాగు చేశారు.  దీంతో జిల్లాలో వరి   సాగు విస్తీర్ణం పెరిగింది.   ఈ సీజన్‌లో 5,49,543 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం దిగుబడి రానున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇందులో ఇతర అవసరాలకు పోగా 4,12,158 మెట్రిక్‌ టన్నుల  ధాన్యం కొనుగోలు లక్ష్యంగా జిల్లాలో 352 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్న వైనంపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న కథనం.....

  రైతులు ఆర్థికంగా స్వయం సమృద్ధ్ది సాధించి సమాజంలో ఉన్నత స్థానంలో నిలుపాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా పండించిన పంటకు మద్దతు ధర కల్పించి ధాన్యం  అమ్ముకునేలా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు చేయాలనే సీఎం ఆదేశాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఇం దులో భాగంగా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది. సిద్దిపేట జిల్లాలో 5,49,543 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తుందని అం చనా కాగా, ఇందులో సన్నరకం ధాన్యం 3,29,725 మెట్రిక్‌ టన్నులు, స్థానిక అవసరాలకు 1,37,385 మెట్రిక్‌ టన్నులు పోగా  4,12,158 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా 352 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించనున్నారు. వీటిలో ఐకేపీ 190 కొనుగోలు కేంద్రాలు, 148 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కొనుగోలు కేంద్రాలు, 14 వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్టోబర్‌ మూడో వారంలో ధాన్యం కొనుగోళ్లను ప్రారభించనున్నారు.

  రైతులు పండించిన మేలు రకం గ్రేడ్‌ ‘ఎ’ రకపు ధాన్యంకు రూ.1888 మద్దతు ధరను, సాధారణ రకం ధాన్యానికి రూ.1868 ధరను ప్రభుత్వం అందించనుంది. ధాన్యం సేకరణకు  కోటీ 3 లక్షల గన్నీ బ్యాగులు అవసరం కాగా, ఇప్పుడు 50 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని 115 రైస్‌ మిల్లులకు తరలించనున్నారు. ధాన్యం రవాణా  చేసేందుకు సిద్దిపేట, గజ్వేల్‌, హుస్నాబాద్‌ల్లో ట్రాన్స్‌పోర్టు సెక్టార్లను ఏర్పాటు చేశారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యతను జిల్లాలోని ముగ్గురు ఆర్డీవోలకు అప్పగించారు.

 499 గ్రామాల్లో  ఫ్లెక్సీల ఏర్పాటు

ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నిబంధనలతోపాటు రైతులు పండించిన పంటకు ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర గ్రేడ్‌ ‘ఎ’ కు రూ.1888, సాధారణ రకంకు రూ.1868 మద్దతు ధరను రైతులకు తెలిసేలా, ఫ్లెక్సీలపై తహసీల్దార్‌, వ్యవసాయ అధికారి ఫోన్‌ నంబర్లను ముద్రించి గ్రామ పంచాయితీల వద్ద ఏర్పాటు చేయనున్నారు.


VIDEOS

logo